ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర 

ఓటరుకు తెలియకుండానే ఫారం–7 దాఖలు చేశారు

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

కలెక్టర్‌ను కోరిన గోరంట్ల మాధవ్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

అనంతపురం  : రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఓట్ల తొలగింపునకు భారీగా కుట్రకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వైయ‌స్ఆర్‌సీపీ ఓటర్లు, సానుభూతిపరుల లక్ష్యంగా అధికారపార్టీ ఈ చర్యలకు పాల్పుడతోందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త గోరంట్ల మాధవ్, రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కలెక్టర్‌ వీరపాండియన్‌కు  విన్నవించారు.

బుధవారం వారు కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాలను సమర్పించారు. నియోజకవర్గం పరిధిలో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన దాదాపు 14 వేల ఓట్లను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓటర్లకు తెలియకుండా ఫారం–7లో దరఖాస్తు చేశారన్నారు. ఆ తర్వాత బీఎల్‌ఓపై ఒత్తిడి తీసుకొచ్చి వాటని ఆమోదింపజేసేలా కుట్రకు తెరతీశారన్నారు.

ఓటు తొలగింపునకు సంబంధించి నోటీసు అందడంతో జరుగుతున్న కుట్ర వెలుగు చూసిందన్నారు. ప్రస్తుతం ఓట్ల తొలగింపునకు వచ్చి దరఖాస్తులన్నీ బోగస్‌వేనని చెప్పారు. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఫారం–7 దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇంటింటికి వెళ్లి విచారణ చేయించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, నాయకుడు హరినాథ్‌రెడ్డి, న్యాయవాది నరేంద్రరెడ్డి ఉన్నారు.

 

Back to Top