తిరుపతి: గతంలో అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికీ సమాధానం చెప్పకుండా టీటీడీ ఛైర్మన్ తిరిగి తన మీద వ్యక్తిగత దాడికి ప్రయత్నిస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ భూములను పర్యాటక శాఖకు బదలాయించి, అంత విలువైన భూమిని ఒక హోటల్‌కు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. టీటీడీ ఛైర్మన్ అరాచకాలు ప్రశ్నిస్తే, వాటిని ఆయన స్వామి వారికి ఆపాదించడం అత్యంత హేయమని అన్నారు. బీఆర్ నాయుడు వంటి వ్యక్తి టీటీడీ ఛైర్మన్ కావడం హిందువుల దురదృష్టమని భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: ●సమాధానం చెప్పలేక ఎదురుదాడి?: అత్వంత విలువైన టీటీడీ భూమలను ఒక హోటల్‌కు అడ్డగోలుగా కేటాయించడాన్ని ప్రశ్నిస్తే, వాటికి బదులివ్వలేక టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అర్ధం పర్థం లేని ఆరోపణలు, విమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. టీటీడీ భూముల్లో పవిత్రం, అపవిత్రం అని విభజించి చూడం అత్యంత హేయం. ఇప్పటి వరకు టీటీడీ భూముల్లో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న టాటా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, అరబిందో ఆస్పత్రి, రాయలసీమకు తలమానికంగా ఉంటూ వైద్యంలో దాదాపు70 ఏళ్లుగా సేవలందిస్తున్న రుయా ఆస్పత్రితో పాటు, వేద విశ్వవిద్యాలయం, భారతీయ విద్యాభవన్ ద్వారా ఉత్తమ విద్య అందిస్తున్న పాఠశాల ఉండగా, అక్కడే అత్యంత విలువైన 25 ఎకరాల స్ధలాన్ని పర్యాటక శాఖ ద్వారా ఒబెరాయ్ హోటల్‌కు ఎందుకు ఇస్తున్నారన్న ప్రశ్నకు టీటీడీ ఛైర్మన్ సమాధానం చెప్పడం లేదు. నిజంగా హోటల్‌కు భూమి ఇవ్వాలనుకుంటే, టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీతో పాటు, 50 ఎకరాల్లో టూరిజం శాఖ బస్టాండ్ కూడా ఉంది. ఆ పక్కనే ఎస్వీ వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకు చెందిన 15 ఎకరాల స్థలం ఉంది. అది ఇవ్వొచ్చు కదా అన్న ప్రశ్నకు బీఆర్ నాయుడు సమాధానం ఇవ్వకపోగా, వ్యక్తిగత దూషణలు చేశారు. ఆయన మాటలు తీవ్ర అభ్యంతరకం. ●అది హిందువుల దురదృష్టం: ఏ మాత్రం నైతికత, నిబద్ధత లేని బీఆర్ నాయుడు వంటి వ్యక్తి టీటీడీ ఛైర్మన్ కావడం కోట్లాది హిందువుల దురదృష్టం. పవిత్రమైన పదవిలో ఉండి కూడా బూతు పంచాంగం వినిపిస్తున్నారు. ఆయన చిల్లర వ్యవహారాలు, చౌకబారుతనం పద్ధతి వల్ల తిరుమల పవిత్రత వివాదాస్పదమవుతోంది. తన బాధ్యత మర్చిపోతున్న నాయుడు, నిత్యం మామీద, మా పార్టీ అధినేతపైనా విమర్శలు చేస్తూ దుయ్యబడుతున్నారు. టీటీడీలో అక్రమాలు, అరాచకాలు ప్రశ్నిస్తుంటే, వాటిని స్వామి వారికి ఆపాదించి, మాపై నిందలు వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. హిందువులకు వ్యతిరేకంగా బీఆర్ నాయుడు నేతృత్వంలో టీటీడీ పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలను నిలదీస్తున్నాం. ప్రతిపక్షంగా అది మా బాధ్యత. అయితే వాటికి సమాధానం ఇవ్వకుండా బూతులు మాట్లాడడం అత్యంత హేయం. ●పదవి దుర్వినియోగం. శ్రీవారికి ద్రోహం: అత్యంత పవిత్రమైన టీటీడీ ఛైర్మన్ పదవి దుర్వినియోగం అంటే అది ముమ్మాటికీ శ్రీవారికి ద్రోహం చేయడమే. ఆ పదవి ద్వారా శ్రీవారి సేవ చేయకుండా, దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం వల్లనే టీటీడీ ఇంతగా వివాదాస్పదం అవుతోంది. 85 ఏళ్ల టీటీడీ పాలకమండలి చరిత్రలో ఏనాడూ ఇలా వివాదాస్పదం కాలేదు. కానీ, ఈరోజు కేవలం బీఆర్ నాయుడు వల్ల, అది జరుగుతోంది. టీటీడీ ఛైర్మన్, టీవీ5 ఛానల్ ఛైర్మన్ రెండూ వేర్వేరు అన్న విషయాన్ని బీఆర్ నాయుడు పూర్తిగా మర్చిపోయారు. ఛానల్ అధినేతగా ఆయన తప్పుడు మాటలు మాట్లాడితే, అది ఆయనకు వ్యక్తిగత మరక అవుతుంది. కానీ, టీటీడీ ఛైర్మన్‌గా అలా బూతులు మాట్లాడడం చాలా తప్పు. అనైతికం. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఇలా బూతులు మాట్లాడినంత కాలం.. నిలదీస్తూనే ఉంటాం. ● ‘మీ’ దర్శనాలకు సెపరేట వ్యవస్థా?: మీరు టీటీడీ ఛైర్మన్ అయ్యాక, వీఐపీ దర్శనాలు ప్రత్యేకంగా అనుమతించడం లేదని, అదంతా గతంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిందని మీ ఛానల్‌లో ప్రచారం చేస్తున్నారు. కానీ, అనేక ఆరోపణలు ఎదుర్కొని, క్రమశిక్షణ చర్యల కింద బదిలీ అయిన రామచంద్ర అనే అధికారిని తిరిగి పిలిపించి, జేఈఓ కార్యాలయానికి అటాచ్ చేశారు. మీకు సంబంధించిన వారందరి దర్శనాల బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఇప్పుడు టీటీడీ జేఈఓ ఆఫీసులో రామచంద్ర మాట శిలాశాసనంగా సాగుతోంది. ఇది వాస్తవం కాదా?. నాడు మా ప్రభుత్వ హయాంలో దర్శనాల కోసం ఛైర్మన్ ఆఫీస్ సిఫార్సు చేస్తే, ఆ పత్రాలు నేరుగా అక్కడి నుంచే వచ్చేవి. కానీ, ఇప్పుడు జేఈఓ ఆఫీసులో పని చేస్తున్న ఆ అధికారి రామచంద్ర ద్వారా టీటీడీ ఛైర్మన్‌కు చెందిన వేలాది మందికి దర్శనాలు చేయిస్తున్నారు. ●మీ అక్రమాల మీదే మా పోరాటం: మీరు చేస్తున్న అరాచకాలు, అన్యాయపు పోకడల మీదే మా పోరాటం తప్ప, మాకు మీపై (బీఆర్ నాయుడు) వ్యక్తిగత ద్వేషం లేదు. వయసులో మీరు మా కంటే పెద్ద. అందుకు గౌరవిస్తాం. కానీ, మీ తప్పులను అంగీకరిస్తూ నిలదీయకుండా ఉండలేం. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదు. భయపడేది లేదు. మీరు టీటీడీకి చేస్తున్న నష్టం, మంటగలుపుతున్న టీటీడీ పవిత్రత మీదే మా పోరాటం. మీ పదవి శాశ్వతం కాదు. మీరు రెండేళ్ల తర్వాత వెళ్లిపోతారు. మిమ్నల్ని ప్రశ్నిస్తే, మేము టీటీడీని విమర్శించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. మీరు తప్పుడు ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. మీ ఛానల్‌లో నా మీద ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టిస్తూ, విష ప్రచారం చేస్తున్నారు. ●టీటీడీ ఛైర్మన్ పదవి క్విడ్ ప్రో కో: గత ఏడెనిమిది సంవత్సరాలుగా మా నాయకుడు జగన్‌గారిపై అత్యంత దారుణంగా మీ ఛానల్‌లో విష ప్రచారం చేశారు. అందుకు మెచ్చిన సీఎం చంద్రబాబు, మీకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అందుకే మీకు ఆ పదవి క్విడ్ ప్రోకో. ఇప్పుడు కూడా రోజూ డిబేట్లు పెట్టి, మీ భజనపరులతో మాట్లాడిస్తూ, మమ్మల్ని తిట్టిస్తున్నారు. ●దమ్ముంటే ఆ దర్యాప్తు కోరండి: మీరు నా మీద చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. మీకు ధైర్యం ఉంటే, దేశంలో అత్యున్నత సంస్ధ సీబీఐతో దర్యాప్తు చేయించమని నేను కోరితే.. దానికి ఆ సంస్థ ఎందుకు? ఎస్‌ఐ సరిపోడా? అని మీరు వ్యాఖ్యానించారు. అంటే మీరు అత్యున్నత స్థాయి దర్యాప్తుకు భయపడుతున్నారనేది స్పష్టమవుతోంది. ఇప్పటికైనా మీకు దమ్ము, ధైర్యం ఉంటే, నాపై మీరు చేసిన, చేస్తున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరండి. నేను దానికి సిద్ధం. 2006–08 మధ్య నేను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు నాపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబుగారు, ధర్నా కూడా చేశారు. అప్పుడు నాకు నేనుగా అప్పటి గవర్నర్ నరసింహన్‌గారిని, నాటి సీఎం రోశయ్యగారిని కలిసి, దర్యాప్తు చేయించాలని కోరాను. ఇంకా కోర్టులో పిటిషన్ వేస్తే.. నిరాధార ఆరోపణల మీద విచారణ చేయలేమని కోర్టు కొట్టి వేసింది. అయినా ఆగకుండా నాపై సీబీఐ దర్యాప్తు కోరుతూ, తిరుపతిలో ఆమరణ నిరాహార దీక్ష చేపడితే, 10 రోజుల తర్వాత కుర్తాళ పీఠాధిపతి వచ్చి, నచ్చచెప్పి నా దీక్ష విరమింపచేశారు. ● ఇదే నా సవాల్: నేను వేల కోట్లు సంపాదించుకున్నానని బీఆర్ నాయుడు ఆరోపించారు. నేను ఈ సందర్భంగా ఆయనను సవాల్ చేస్తున్నాను. ‘మీరు నాకు రూ.100 కోట్లు ఇవ్వండి చాలు. నేను సంపాదించినట్లు మీరు ఆరోపిస్తున్న వేల కోట్లు మీకు బదలాయిస్తాను’. ● ఇవన్నీ మీ అక్రమాలు కావా?: జూబ్లీహిల్స్ సొసైటీ పేరుతో నీ కుమారుడు రూ.1000 కోట్ల విలువైన స్థలాన్ని అమ్మారని పోలీసులకు ఫిర్యాదు అందింది. మంచిరేవుల దగ్గర ఒక స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీకి అటాచ్ చేసుకుని రూ.5 లక్షల చొప్పున దాదాపు రూ.200 కోట్లు కలెక్ట్ చేశారు. దీనిపై ఆ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. మీ టీవీ5 ఆఫీసు ఎదురుగా ఉండే పిళ్లా సత్యనారాయణ అనే వ్యక్తి మొక్కలు పెంచితే, హైడ్రాకు చెప్పి వాటిని తీసేయించారు. జూబ్లీ హిల్స్ సొసైటీ సెక్రటరీగా ఉన్న మురళీ అనే వ్యక్తిని తరిమేశారు. మీరు నాలుగేళ్లు సొసైటీ ఛైర్మన్‌గా వేల కోట్ల దోపిడి చేశారని, మీ మీద, మీ కుమారుడి మీద తెలంగాణా రెవెన్యూ మంత్రి.. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రిలాంఛింగ్ బుకింగ్స్ పేరుతో రూ.200 కోట్లకు పైగా సేకరించి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని కూడా మీపై ఫిర్యాదు నమోదైంది. అదీ మీ హేయమైన చరిత్ర. ● ఇకనైనా వైఖరి మార్చుకొండి: ‘నా సంగతి మీకు తెలియదు. నాతో పెట్టుకుంటే అంతే’.. అని బీఆర్ నాయుడు బెదిరిస్తున్నారు. అయ్యా, మీరేమైనా మాఫియా డాన్‌ను అనుకుంటున్నారా? లేక టెర్రరిస్టుల నాయకుడు అనుకుంటున్నారా?. నీవెంతటి వాడివైనా నిన్ను ఉపేక్షించే పరిస్థితి లేదు. నీ తప్పులు ఎత్తి చూపుతాం. నీ అరాచకాలు నిలదీస్తూనే ఉంటాం. ఇకనైనా మీ వైఖరి మార్చుకొండి. నిజాయితీతో పని చేయండి. లేకపోతే, హిందువులంతా కలిసి మిమ్మల్ని తరిమి కొడతారు. ఆ పదవి నుంచి తరిమేస్తారు. నేను నా రాజకీయ జీవితంలో నిజాయితీతో, చిత్తశుద్ధితో పని చేశాను. మీ వంటి దుర్మార్గులు, దోపిడీదార్లను, దొంగలను ఎదురించి పోరాడాను. ఇంకా ఒళ్లంతా లాఠీదెబ్బలు తిని రాజకీయాలు చేశానే తప్ప, ఆయన (బీఆర్ నాయుడు) మాదిరిగా అవినీతి ఊబిలో కూరుకుపోయి కోట్లు కొల్లగొట్టలేదని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.