తిరుపతి: పెద్ద జీయర్ స్వామి కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం వేధింపులకు బలైపోయాడని.. టీటీడీ చైర్మన్, ఈవో, మరో అధికారి కలిసి మూడు గంటల పాటు ఆయన్ను ఒత్తిడికి గురి చేసి లేఖ రాయించారని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆలయ ఈవోలు ఆరోపణలు చేసినప్పుడు స్పందించని పెద్ద జీయర్ స్వామి.. సీబీఐ సిట్ చార్జిషీట్‌లో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించిన తర్వాత లేఖ రాయడం ఏంటని ప్రశ్నించారు. తెలుగు రాయడమే రాని పెద్ద జీయర్ స్వామితో తెలుగులో లేఖ రాయించి సంతకం తీసుకోవడంపైన ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌ని హిందూ ద్వేషింగా చిత్రీకరించి రాజకీయంగా ఆయన్ను లేకుండా చేయాలన్న చంద్రబాబు క్షద్ర రాజకీయ కుట్రలో సమిధలు కావొద్దని ఆయనకు భూమన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద జీయర్ స్వామికి విలువ లేకుండా పోయిందని, పది రోజులపాటు నిర్వహించే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని రెండు రోజులకు పరిమితం చేసిన సందర్భంగా ఈ విషయం బయటపడిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ప్రలోభాలు, బెదిరింపులతో ధర్నాలు చేస్తున్న మఠాధిపతులు, స్వామీజీలు.. పరీక్షలకు పంపిన నెయ్యి శాంపిల్ చంద్రబాబు సీఎం అయ్యాక తీసుకున్నదేనని మరిచిపోయారా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ ని హిందూ ద్వేషిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు రాజకీయ క్రీడలో భాగస్వాములై వంతపాడుతున్న వారంతా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకుంటారని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ● ఆ ముగ్గుర్నీ పంపించి పెద్ద జీయర్ స్వామిని వేధించారు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సంస్కృతీ సాంప్రదాయాలకు భిన్నంగా తొలిసారి పెదజీయర్ స్వామీజీ గారితోనే బహిరంగ లేఖ రాయించారు. క్షుద్ర రాజకీయ హోమంలో పెద్ద జీయర్ మఠాన్ని సమిధగా వాడుకోవడానికి చంద్రబాబే బలవంతంగా ఈ లేఖను రాయించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, కొత్తగా వచ్చిన ఈవో ముద్దాడ రవిచంద్ర, అవినీతిపరుడైన బొక్కసం ఇన్‌చార్జి గురురాజ్ తదితరులు పెదజీయర్ స్వామి వద్దకు వెళ్లి రెండు గంటలపాటు అక్కడే కూర్చుని ఆయనపై ఒత్తిడితెచ్చి ఆయనతో ఈ లేఖ ఇప్పించారని నా దగ్గర సమాచారం ఉంది. పెద్ద జీయర్‌స్వామి నేతృత్వంలో 2024 సెప్టెంబర్ 23న ఆలయం గుడి లోపల బంగారు బావి దగ్గర ఆలయ అర్చకులతో శాంతి శుద్ధి హోమాలను చేశారు. జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా, ఇక మీదట ఏ తప్పులూ జరగవని ఆగమ పండితుల సూచనలతో ఈ మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఇక మీదట లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎటువంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని సాక్షాత్తూ నాటి ఈవో శ్యామలారావు గారే వెంకయ్య చౌదరి, వీరబ్రహ్మంలతో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. ● చంద్రబాబు ప్రాప్తం కోసం ఆలయ ఉన్నతాధికారుల పాకులాట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ఆరోపించినట్టుగా తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనె కలవలేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత వారి మొహంలో నవ్వు మాయమైపోయింది. వైయస్ జగన్‌ని హిందూ మత వ్యతిరేకిగా ప్రజల్లో ముద్ర వేయాలని రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహానికి జవాబు చెప్పుకోలేక మీడియా సమావేశం ఏర్పాటుచేసి తాము చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేందుకు మరిన్ని నిందలు మోపడం మొదలుపెట్టారు. అయినా కూటమిపై ప్రజల్లో వచ్చిన ఆగ్రహం చల్లారక పోవడంతో రెండు రోజులుగా స్వయం ప్రకటిత స్వాములతో పాటు, పెద్ద జీయర్ స్వామి మఠాన్ని రంగంలోకి దించారు. క్షుద్ర రాజకీయాలు చేసే చంద్రబాబులాంటి వ్యక్తుల చేతుల్లో నైతిక విలువలున్న పెద్ద జీయర్ స్వామి నలిగిపోవడం బాధాకరం. టీటీడీలో పనిచేసే ఉన్నతాధికారులంతా ఆయన ప్రయోజనాల కోసం పనిచేసే వారే తప్ప ఆలయ ప్రతిష్టను కాపాడేవారు ఎంతమాత్రం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో తిరుమల కొండపై జరిగిన అపచారాలే ఇందుకు నిదర్శనం. ● సిట్ చార్జిషీట్‌తో జంతువుల కొవ్వు కలవలేదని తేలిపోయింది లడ్డూలో కల్తీ జరిగిందని ఈవో శ్యామలారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేసినప్పుడు మీరెందుకు లేఖ రాయలేదని పెద్ద జీయర్ స్వామిగారిని నేను నేరుగా ప్రశ్నిస్తున్నా. సిట్ దర్యాప్తు చేసి జంతువుల కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాత ఎందుకు స్పందించారు? నెయ్యి కల్తీలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని కొంతమంది అధికారులు, నెయ్యి సరఫరాదారులు నెపుణ్యం కలిగిన కొంతమంది కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తేల్చిన తర్వాత ఎందుకు స్పందించారు? ఎందుకంటే, చంద్రబాబు ఆరోపించినట్టు వైయస్ జగన్ గారికి కానీ ఆయన ఆధ్వర్యంలో టీటీడీలో పనిచేసిన పాలకమండలికి ఎలాంటి సంబంధం లేదని సిట్ రిపోర్టుతో తేటతెల్లం చేయడంతో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. వైయస్ జగన్ ని, వైయస్ఆర్‌సీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న కోణంలో సృష్టించిన ఈ కల్తీ నెయ్యి వ్యవహారం చివరికి చంద్రబాబు మెడకే చుట్టుకుంది. తనను సమర్థించే వారు ఎవరూ లేక ప్రతిష్ట దిగజారిపోయి పలచనైపోయిన చంద్రబాబు.. కొత్త మఠాధిపతులు, స్వామీజీలతో ఈ కొత్త అంకానికి తెరదీశాడు. కొంతమందిస్వామీజీలను భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి, లోబర్చుకుని కొత్త ప్రచారానికి తెరలేపాడు. చివరికి పెద్ద జీయర్ స్వామితోనే లేఖ రాయించాడు. వాస్తవానికి ఆయనకు తెలుగు రాయడం తెలియదు. అలాంటిది ఆయనతో తెలుగులో లేఖరాయించి సంతకం పెట్టించారు. ఇన్ని ఘోరాలు చేసి చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. వైయస్ జగన్ గారిని హిందూ ద్వేషిగా చిత్రీకరించే కుట్రలో భాగంగానే పెద్ద జీయర్ స్వామినే రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధిస్తున్నారు. ఈ కుట్రలో భాగస్వాములైన వారు రేపటి రోజున ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదు. ● కూటమి ప్రభుత్వం పెద్ద జీయర్ స్వామిని పట్టించుకోలేదు గడిచిన ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ హయంలో ధనుర్మాసంలో పెద్ద జీయర్ మఠంలో ముప్పై రోజులపాటు తిరుప్పావై పఠనాన్ని పఠింపజేసి దాన్ని ఎస్వీబీసీ భక్తి ఛానెల్‌లో ప్రపంచానికి చూపించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో దాన్ని పూర్తిగా అటకెక్కించారు. దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోకానీ, వైయస్ జగన్ పాలనలోకానీ ఆలయ ప్రతిష్టకు ఆలయ గౌరవానికి సేవ చేసే చిన్న జీయర్, పెద్ద జీయర్ మఠాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండకూడదని టీటీడీ తరఫున పెద్ద ఎత్తున ధన సహాయం పెంచిన విషయాన్ని ఎలా మరిచారు? వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనుసరించిన విధానాలనే తిరుమలలో అనుసరించాలని పెద్ద జీయర్ స్వామిని సంప్రదించిన తర్వాతనే అమలు చేయడం జరిగింది. 36 మంది పీఠాధిపతుల అనుమతి పొందిన తర్వాతనే వారి సూచనల మేరకే పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తిరుమల కొండపై నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రోజులు మాత్రమే జరపాలని నిర్ణయించాడు. ఆ తర్వాత బోర్డు సమావేశమై ఆగమ సలహామండలి సూచనలతో నిర్ణయం తీసుకోవాలన నిర్ణయించింది. కానీ వారు పెద్ద జీయర్ స్వామిని మాత్రం పూర్తిగా విస్మరించారు. పెద్ద జీయర్ స్వామికి వారిచ్చే గౌరవం ఏపాటిదో చెప్పడానికి ఈ ఒక్క ఘటనే సాక్ష్యం. పెద్ద జీయర్ స్వామి గారు అంగీకరిస్తే ఆయనతో చర్చలకు సిద్ధమే. కానీ చంద్రబాబు క్షుద్ర రాజకీయాల్లో సమిధలు కావొద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. ధర్నాలు చేస్తున్న స్వాములు కూడా చంద్రబాబు రాజకీయ చదరంగంలో పావులుగా మారొద్దని కోరుతున్నా. ఎన్నో మంచి పనులు చేసిన మా ప్రభుత్వంపై నిందలు మోపుతున్నవారు పునరాలోచన చేసుకోవాలి. వైయస్ఆర్‌సీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పడానికి ఒక్క శాంపిల్ కూడా తీసుకోలేదు. చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీలోకి ప్రవేశించిన నెయ్యినే ల్యాబులు పరీక్షలు చేశాయి. దానిపై మఠాధిపతులు ధర్నాలు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. టీటీడీ రిజెక్టు చేసిన వెనక్కి పంపిన నెయ్యినే దొడ్డి దారిన తీసుకొచ్చి నెయ్యి తయారీలో వాడితే చంద్రబాబు తప్పు చేసినట్టు కాదా? దానికి మాపై నిందలు మోపడం సిగ్గుచేటు. వైయస్ జగన్ గారిని రాజకీయంగా అంతం చేయడానికి తిరుమల శ్రీవారిని వాడుకుందామనుకుంటే చూస్తూ ఊరుకుంటామని మాత్రం అనుకోవద్దని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.