తిరుపతి: తిరుమల లడ్డు అంశంలో వాస్తవాలను దాచిపెట్టి భక్తుల విశ్వాసాలతో రాజకీయం చేస్తున్న సీఎం చంద్రబాబు తీరుపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్‌డీడీబీ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అర్థం వచ్చేలా మాట్లాడ్డాన్ని తప్పు పట్టారు. సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం ఎన్‌డీడీబీ నివేదికలో జంతు కొవ్వు లేదని, తేలడంతో ఆత్మరక్షలో పడ్డ సీఎం, టీడీపీ–జనసేన నేతలు ఎదురుదాడికి దిగారని విమర్శించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వైయస్ఆర్‌సీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందులో భాగంగానే వైయస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, తన ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నెయ్యి కల్తీ దొంగలు వీరే అంటూ దుష్ప్రచారం చేయడం పక్కా ప్రణాళికతో జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు ఈ అబద్ధాలను నమ్మడం లేదన్న అసహనంతోనే వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఆయనతో పాటు జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీబీఐ నివేదికలో బయటపడ్డ నిజాలను మరుగునపర్చేందుకే ఈ హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారని తేల్చి చెప్పారు. సీబీఐ సిట్ అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం, కల్తీ నెయ్యి తయారు చేసిన ప్రధాన నిందితుడు బోలేబాబా డెయిరీ (మాజీ హర్‡్ష ప్రెష్ డెయిరీ) చంద్రబాబు హయాంలోనే టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. మరో నిందిత సంస్థ ప్రీమియర్ డెయిరీకి కూడా చంద్రబాబు హయాంలోనే 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. లడ్డూలో పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిసిందంటూ మాట్లాడటం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిష్టను భంగం కలిగించినది చంద్రబాబు కాదా అని నిలదీశారు. భగవంతుడిని రాజకీయ పావుగా వాడుకున్నది ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..: సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ లో చాలా స్పష్టంగా ఎన్ డీ డీ బీ ఇచ్చిన రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదని పేర్కొంది. ఆ తర్వాత ఈవో శ్యామలరావు ఏ ఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిపై ఎన్ డీ ఆర్ ఐ కూడా తన నివేదికలో జంతుకొవ్వు లేదన్న విషయం స్పష్టం చేసింది. అయినా సీఎం చంద్రబాబు, టీడీపీ, జనసేనలు సీబీఐ తన నివేదికను కోర్టుకు సమర్పించిన తర్వాత ఆత్మరక్షలో పడ్డారు. తామే తప్పు చేశామన్న సంగతి అర్దమై ఎదురుదాడికి దిగారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు వీరేనంటూ వైయస్.జగన్, వైవీ సుబ్బారెడ్డితో పాటు నా ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ జనం నమ్మే పరిస్థితి లేకపోవడం ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకొని, పక్కా ప్రణాళికతో వైయస్ఆర్‌సీపీనేతలమీద ఏదో ఒక నెపం మోపి దాడి చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల బూతుపురాణంతో దాడికి దిగితే, దానికి స్పందించిన అంబటి ఆ తర్వాత తన మాటలకు క్షమాపణ చెప్పినా.. సహించలేని చంద్రబాబు ముఠా 3వేల మంది రౌడీ మూకలతో ఇంటిపై దాడి చేశారు. అందులో టీడీపీ నేతలు, కార్యకర్తలే కాకుండా అసాంఘిక శక్తులను కూడా ఉసిగొల్పి అంబటి రాంబాబుతో పాటు జోగి రమేశ్ ఇళ్లపై దాడికి దిగారు. బాబు హయాంలోనే భోలేబాబా డెయిరీకి అనుమతి: రాష్ట్రమంతటా ఇదే విధ్వంసకర రాజకీయం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. సిట్ నివేదిక ద్వారా నెయ్యిలో జంతుకొవ్వు కల్తీ జరగలేదని తేల్చిచెప్పింది. అప్పటి పాలకమండలి అధ్యక్షుడు, సభ్యులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఆ వ్యవహారంలో లేదని సిట్ తన అనుబంధ ఛార్జిషీట్ లో పేర్కొంది. అదే నివేదికలో కొద్ది మంది సాంకేతిక నిపుణులు ఎవరైతో టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ఉన్న వారే, నెయ్యి సరఫరాదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈ బోలేబాబా డెయిరీ 2018 వరకు హర్‡్ష ప్రెష్ డెయిరీ పేరుతో టీటీడికి నెయ్యి సరఫరా చేసింది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కంపెనీకి నెయ్యి సరఫరాకి టెక్నికల్ శాంక్షన్ జరిగింది. అప్పటిలో కేజీ రూ.291 చొప్పున ఈ బోలేబాబా డెయిరీ(అప్పటి హర్‡్ష ప్రెష్ డెయిరీ) నుంచి సరఫరాకు అనుమతిచ్చింది. సిట్ పేర్కొన్నట్టు కల్తీ నెయ్యి తయారు చేసిన ప్రధాన నిందితుడు బోలేబాబా డెయిరీ.. చంద్రబాబు హయాంలో కూడా నెయ్యి సరఫరా చేసిన విషయాన్ని కూడా స్పష్టం చేసింది. మరో నిందితుడుగా ఉన్న ప్రీమియర్ డెయిరీ కూడా కల్తీ చేసిందని చెప్పింది. ఈ ప్రీమియర్ డెయిరీ 2013 లో రూ.273 లకు, 2016లో రూ.332, 2106 సెప్టెంబరులో రూ.364లకు, 2017 ఏప్రిల్ లో రూ.411లకు, అక్టోబరు లో రూ.378లకు, 2018 జనవరిలో రూ.320లకు, 2019 ఆగష్టులో రూ.389 లకు నెయ్యి సరఫరా చేసిన ప్రీమియర్ డెయిరీ చంద్రబాబు హాయంలోనే అత్యధిక సార్లు నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చారు . ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డెయిరీకే చంద్రబాబు హాయంలో 90 శాతానికి పైగా నెయ్యి సరఫరాకు అవకాశం ఇచ్చారు. దీంతో డిఫెన్స్ లో పడ్డ చంద్రబాబు ఇవాళ జంతుకొవ్వు కలిపారు చెప్పారు అన్న తర్వాత సాక్షాత్తూ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిస్ధాయిలో ఇలా మాట్లాడ్డం సరికాదని చెప్పి సీబీఐ విచారణకు ఆదేశించారు. మాట మార్చిన శ్యామలరావు.: 2024 జూలైలో ఈవో శ్యామలరావు నెయ్యి నాణ్యతపై మాట్లాడుతూ... ఎన్ డీ డీ బీ నివేదికలో వెజిటబుల్ ఆయిల్ కలిపారని నివేదిక వచ్చిందన్నారు. అయితే నెయ్యిలో లడ్డూ సీఎం చంద్రబాబు మాట్లాడిన అనంతరం సెప్టెంబరు 23న మరలా ఈవో శ్యామలరావు ఎన్ డీ ఆర్ ఐ రిపోర్టులో జంతు కొవ్వు కలిసిందని వచ్చిందంటూ చంద్రబాబుకి వంతపాడారు. కానీ సీబీఐ విచారణలో అదే ఎన్ డీ ఆర్ ఐ కు శాంపిల్స్ పంపిస్తే అందులో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని అనుబంధ ఛార్జిషీట్ లో నివేదించారు. దీంతో చంద్రబాబును మోసే ఎల్లో మీడియా సంస్థలు సిట్ ను ప్రశ్నిస్తున్నారు? సీబీఐను ప్రశ్నిస్తున్నారు? విచారణ ఫలానా విధంగా చేయలేదని వార్తలు రాస్తున్నారు. చంద్రబాబు సిట్ నియమిస్తే ఆ అధికారులు బాబు చెప్పినట్లు వినేవాళ్లు. వాళ్లు తప్పుడు నివేదికలు ఇచ్చి, వెంటనే మమ్నల్ని నిందితులు చేసే సిట్ కాకుండా... సరైన న్యాయవిచారణ కోసం సుప్రీం కోర్టు నియమించిన అధికారులతో విచారణ చేయించాలి. దీనికి మేం సిద్ధంగా ఉన్నాం. సీబీఐ తన ఛార్జి షీట్ పేజీ నెంబరు 65లో 2018లో బోలేబాబా డెయిరీ హర్‡్ష ప్రెష్ డెయిరీ పేరుతో నెయ్యి సరఫరా చేసారని పేర్కొంది. వైయస్.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బోలేబాబాను డిస్ క్వాలిఫై చేశాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టెండర్ నిబంధనలను సడలించడం ద్వారా ఈ సంస్థలు వచ్చి కల్తీనెయ్యి తయారు చేశాయని ఎల్లో మీడియాలో ఆరోపిస్తున్నారు. వాస్తవానికి టెండరు నిబంధనలను సరళతరం చేయడానికి ముందే హర్ష్ ప్రెష్ డెయిరీ టెండర్లలో పాల్గొంది. ప్రీమియర్ డెయిరీ కూడా గతంలో ఉంది. ఇప్పుడు కొత్తగా రాలేదు. అదే విధంగా మాల్ గంగా కూడా తర్వాత టెండర్లులో పాల్గొంది. టెండరు నిబంధనలు సరళతరం చేసిన తర్వాత టెండర్లలో పాల్గొన్న ఒక్క సంస్ద పేరు కూడా సీబీఐ పేర్కోలేదు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలన్న నిర్ణయంతో స్ధానికంగా ఉండే తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని డెయిరీ కంపెనీలను ప్రోత్సహించడానికి నిబంధనలను సరళతరం చేశాం. వైయస్.జగన్ హయాంలోనే ఎన్ డీ డీ బీతో ఒప్పందం: అయినా ఒక్క కంపెనీ కూడా రాలేదు కాబట్టి నిబంధనలను మరలా కఠినతరం చేశాం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సాహి, గిర్ వంటి ఉత్తమ ఆవులను విరాళాల ద్వారా తెప్పించడమే కాకుండా... ఎన్ డీ డీబీ వంటి సంస్థలను వైయస్.జగన్ ప్రభుత్వం టీటీడీకి పరిచయం చేసిందే వైయస్.జగన్ ప్రభుత్వం. గతంలో ఎన్ డీ డీ బీ ద్వారా పరీక్షలకు పంపించే పరిస్థితి లేదు. ఆ సంస్థ ద్వారా రూ.50 కోట్ల విరాళం స్వీకరించి గిర్, సాహీవాల్ ,కాంక్రీజ్ లాంటి ఆవుల ఉత్పత్తి కేంద్రంలో ఆడదూడలు పుట్టేలా చేయడం ద్వారా టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా పూనుకున్నదే వైయస్.జగన్. ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగానే అప్పటివరకు అందుబాటులో లేని.. బీటా సైట్స్ టెరాలసిస్ టెస్ట్ ను వైయస్.జగన్ ఆదేశాలతో ఎన్ డీ డీ బీ వాళ్ల సహకారంతో ఈ టెస్ట్ మిషనరీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి టెండర్లు పిలిచాం. మా హయాంలోనే ఈ రకమైన ఏర్పాట్లు చేశాం. మా హాయంలో నిబంధలను కఠినతం చేసినందువల్లే కల్తీకి కేంద్రబిందువుగా మారిన ఏ ఆర్ డెయిరీ డెయిరీ నాలుగు ట్యాంకర్లు నెయ్యి కల్తీ అని తెలిసింది. అలా నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ అని తెలిసినా కూడా ఆ నెయ్యి వేరే ఇన్ వాయిస్ లతో వస్తే దాన్ని లడ్డూ ప్రసాదంలో వాడినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు వెనక్కి పంపిన.. చంద్రబాబు చెప్పినట్లు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని కూటమి ప్రభుత్వంలోనే వాడారు. అంటే మీరు చెప్పినట్లు మీ ప్రభుత్వ హయాంలోనే పందికొవ్వు నెయ్యితో తయారు చేసిన లడ్డూలు తయారు చేశారా? సీబీఐ ఆ నాలుగు ట్యాంకర్లలో కలిసింది పందికొవ్వు కాదని చెప్పినా... చంద్రబాబు మాత్రం తాను శ్రీవేంకటేశ్వరస్వామి వీర భక్తుడని పదే పదే చెప్పిన మాటలే చెబుతూ... మరలా జంతుకొవ్వులు కలిసాయని ఆరోపిస్తున్నారు. మా ఇళ్లతో టీటీపీ నేతలు భోగిమంటలు: నాలుగు దశాబ్దాలుగా మిమ్నల్ని గమనిస్తున్నాను. మిగిలివాళ్లు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు కాదా? భక్తి పేరుతో స్వామి వారి ప్రసాదాలు, స్వామి వారిని రాజకీయాలకు వాడుకోవడమే మీ నైజమా? మీరు చెప్పింది నిజమైతే సుప్రీం కోర్టు మిమ్నల్ని ఎందుకు మందలించింది? దానికి సమాధానం చెప్పాలి. మిమ్నల్ని ఆక్షేపించిన సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ దర్యాప్తులోనే ఎలాంటి జంతుకొవ్వులు కలవలేదని చెప్పిన మాట వాస్తవం కాదా? అయినా మీరు చెప్పిన అబద్దాలు ప్రచారం చేస్తూ.. వాటిని జనాలు నమ్మడం లేదని హింసను ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? ఎవరు ఎవరి ఇళ్లమీద దాడి చేస్తున్నారు? టీడీపీ, జనసేన కార్యకర్తలు వైయస్ఆర్‌సీపీనేతల ఇళ్లు కాలబెట్టి బోగిమంటులు వేసుకుని చలికాసుకుంటున్నారు. ఇదే మీ నైజమా? అని సూటిగా ప్రశ్నించారు. లడ్డూలో పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిపారన్న మీ మాటలతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిష్టకు భంగం కలిగించారు. మా ఇలవేల్పు అని చెబుతున్న మీరే స్వామి వారి లడ్డూలో ఆవుకొవ్వు కలిపారంటే ఎవరిపై అపవాదు మోపారు? భగవంతుడిని రాజకీయ పావుగా వాడుకున్నది మీరు. మీ ఆరోపణలతో 140 కోట్ల మంది భక్తుల మనోభావాలను, శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్ర మహిమని నేలమట్టం చేసేలా మాట్లాడింది మీరు కాదా చంద్రబాబూ? ఇప్పటికైనా మీ అంతరాత్మను ప్రశ్నించుకొండి. దైవద్రోహం చేసినవాళ్లను దేవుడు వాళ్ల జీవితకాలంలోనే శిక్షిస్తాడన్నారు. మీ కంటే ఎవరూ దైవద్రోహం చేసారు చంద్రబాబూ అని భూమన సూటిగా ప్రశ్నించారు. కోట్ల లడ్డూల్లో ఆవుకొవ్వు కలిపారనడం కన్నా అపవాదు ఇంకా ఏముంటుందని భూమన కరుణాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు.