తాడేపల్లి: విజయవాడ జైలు అధికారులను హటాత్తుగా మార్చడం వెనుక చంద్రబాబు రచించిన మరో భారీ కుట్ర ఉందని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో అరెస్ట్ అయినా వారంతా విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్నందున వారిని వేధించేందుకే తాము చెప్పినట్లు నడుచుకునే అధికారులను అక్కడ నియమించారని అన్నారు. ఒకవైపు సంబంధం లేని అంశాల్లో ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, మరోవైపు అక్రమ అరెస్ట్‌లతో రిమాండ్‌కు పంపి, వారిని జైలులో హింసించాలన్నదే చంద్రబాబు కుతంత్రంగా కనిపిస్తోంని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే చంద్రబాబు పాలన సాగిస్తున్నాడు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఏపీలో సంక్షేమ పథకాల అమలు లేదు. మరోవైపు ప్రజల దృష్టిని మళ్ళించేందుకు అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు. గతంలో ఒక సినీ నటిని తీసుకువచ్చి, తప్పుడు కేసులు నమోదు చేసి, చివరికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమికొట్టారు. నేడు గత సీఎం కార్యాలయంలో పనిచేసిన అధికారులనందరినీ టార్గెట్ చేస్తూ, అరెస్ట్ చేస్తున్నారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. గతంలో చంద్రబాబు పలుసార్లు అధికారంలో ఉండి, ప్రతిపక్షంలోకి వెళ్ళారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్ గారు మళ్లీ అధికారాన్ని చేపడతారు. ఇప్పుడు అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగానికి చంద్రబాబు, పవన్, లోకేష్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజలు అధికారంను ఇచ్చింది ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టడానికా? ఈ తప్పుడు విధానాలుకు పావులుగా వాడుకుంటున్న ఐపీఎస్ అధికారులను తమ దుర్మార్గాలకు బలిపెడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.5వేల కోట్ల లిక్కర్ స్కామ్ 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రూ.5000 కోట్ల పైచిలుకు లిక్కర్ స్కామ్ ద్వారా అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో బార్ షాప్‌లకు ప్రివిలైజ్డ్ చార్జీలను పెంచుతున్నామని చెప్పి వారి నుంచి భారీ ఎత్తున ముడుపులు దండుకున్నారు. అలాగే తరువాత వారికి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఏడాదికి సుమారు రూ.1300 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. అదికూడా నూటికి ఎనబై శాతం చంద్రబాబుకు అస్మదీయులకు మేలు జరిగేలా చూశారు. ఇది కదా లిక్కర్ స్కామ్. దీనిపై వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విచారణ జరిపి కేసు నమోదు చేశారు. ఆనాటి ఎక్సైజ్ మంత్రి, చంద్రబాబును, అప్పటి ఎక్సైజ్ కమిషనర్‌లపై కేసులు నమోదు చేశారు. లిక్కర్ ఆదాయాల్లో తేడాలపై విచారణకు సిద్దమా? 2018-19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.16, 900 కోట్లు అయితే 2023-24లో లిక్కర్ ఆదాయం రూ.24,700 కోట్లు వచ్చింది. నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లుగా వైయస్ఆర్‌సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చన ఆదాయం ఎలా పెరిగిందీ? చంద్రబాబు థీయరీ ప్రకారం పెరిగిన ఆదాయం ప్రభుత్వానికి బదులు బినామీల జేబుల్లోకి వెళ్లి ఉండాలి కదా? 2018-19లో లిక్కర్, బీరు కలిపి 6.6 కోట్ల కేసులు విక్రయిస్తే, వైయస్ఆర్‌సీపీ హయాంలో 2023-24లో 4.44 కోట్ల లిక్కర్ కేసులు విక్రయించారు. అంటే వైయస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గాయి, ఆదాయం పెరిగింది. కానీ చంద్రబాబు హయాంలో లిక్కర్ సెల్స్ పెరిగాయి, ఆదాయం లేదు. దీని మతలబు ఏమిటో చంద్రబాబే చెప్పాలి. లిక్కర్ అమ్మకాలు ప్రతి ఏటా పదిశాతం పెరుగుతూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఇదే తంతు కొనసాగుతోంది. కొత్తగా అరవై వేల బెల్ట్ షాప్‌లు పెట్టారు. పర్మిట్ రూంలు, డోర్ డెలివరీలు కూడా చేస్తున్నారు. అంటే లిక్కర్ అమ్మకాలు మరింత పెంచుతున్నారు. కానీ లిక్కర్ ద్వారా వస్తున్న ఆదాయం మాత్రం పెరగడం లేదు. అంటే ఈ ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతోంది? ఇది స్కామ్ కాదా? వీటిని డైవర్ట్ చేసేందుకు కొత్త నాటకానికి చంద్రబాబు తెర తీశారు. గత ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేసిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి లపై అక్రమ కేసులు బనాయించి, వారిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసులో ఆధారాలు లేవంటూ అభ్యంతరాలు తెలియజేసిన సీఐడీ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ ను పక్కకు తప్పించి, కేంద్ర సర్వీసులకు పంపారు. అలాగే ఇటువంటి తప్పుడు కేసులను అంగీకరించడానికి పలువురు ఐపీఎస్ అధికారులు నిరాకరించడంతో, విజయవాడ సీపీని సిట్ చీఫ్‌గా నియమించి ఈ అక్రమ కేసులను ముందుకు తీసుకుపోతున్నారు. చంద్రబాబు ఈ అక్రమాలు ఎల్లకాలం చెల్లవనే విషయం గుర్తుంచుకోవాలని మార్గాని భరత్ హెచ్చరించారు.