రాజమహేంద్రవరం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైయస్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించడమే కాకుండా, గత ప్రభుత్వంలో తలపెట్టిన అభివృద్ధి పనులను కూడా ఓర్వలేక కడుపుమంటతో అధికార పార్టీ నేతలు రగిలిపోతున్నారు. రాజమహేంద్రవరంలోని 40వార్డులో వైయస్ఆర్‌సీపీ హయాంలో వాటర్ ట్యాంకు నిర్మాణం చేయించినచోట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూటమి పార్టీ నేతలు పగుల గొట్టించారు. ఈ దుశ్చర్యలను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ విస్మయం వ్యక్తం చేశారు. ఈమేరకు భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏమిటీ ఈ కూల్చివేతల సంస్కృతి? `కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజమండ్రి నగరంలో చేసిన పనులు ఏమీ లేనప్పటికీ వైయస్ఆర్‌సీపీ హయాంలో వేసిన శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారు. గతంలో మోరంపూడి ప్లైఓవర్ దగ్గర శిలాఫలకాన్ని ఈవిధంగానే ధ్వంసం చేసి ఆ తర్వాత ప్రజల్లోంచి వ్యతిరేకత రావడంతో పునరుద్ధరించారు. అయినప్పటికీ శిలాఫలకాలు కూలగొట్టడం ఆపడం లేదు. తిలక్ రోడ్డు సీసీ డ్రైన్ శంకుస్థాపన శిలాఫలకం కూడా ధ్వంసం చేశారు. తాజాగా 40వార్డు వాటర్ ట్యాంకు నిర్మాణం చేసిన దగ్గర ఉన్న శిలాఫలకాన్ని పడగొట్టేశారు. ఇది చాలా దిగజారుడుతనం. కూటమి ప్రభుత్వం మంచి అంటే ఇదేనా?. శిలాఫలకాలు కూలగొట్టగలరేమో గానీ, చేసిన అభివృద్ధికి సంబంధించిన వాస్తవాలను ప్రజల మనోఫలకాల నుంచి తొలగించలేరు` అని భరత్ వ్యాఖ్యానించారు. శిలాఫలకం తొలగించడానికి చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని , దీనిపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.