రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు చంద్రబాబు ఆజ్యం

చంద్రబాబు పంతం రాష్ట్రంలో అయిదు కోట్ల ప్రజలకు శాపం

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం

శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు

కానీ సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి. పక్షపాత ధోరణి

నిపుణుల కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ నిర్ణయం

వెనకబడిన ప్రాంతాల ఆవేదననూ విస్మరించిన చంద్రబాబు

చంద్రబాబు వైఖరితో మళ్లీ హైదరాబాద్‌ తరహా పరిస్థితులు

అభివృద్ధి కేంద్రీకరణ రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదు

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టీకరణ

దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర బిడ్డలు ఇంకా వలసబాట

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ఏకంగా రూ.3.30 లక్షల కోట్లు

అయినా శ్రీకాకుళం ప్రాజెక్టులకు నిధులేవి?

అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా?

సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి ధర్మాన 

వంశధారపై మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం 

ప్రాజెక్టుపై నాడు శ్రీ వైయస్‌ జగన్‌కు చిత్తశుద్ధి

అందుకే ఒడిషా సీఎంతో భేటీ అయ్యారు. చర్చించారు

ఇన్నేళ్లలో చంద్రబాబు ఏనాడైనా ఆ పని చేశారా?

వంశధార ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు కావాలి

కానీ, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.80 కోట్ల కేటాయింపు

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆక్షేపణ

శ్రీకాకుళం: రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో అయిదు కోట్ల ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, కానీ కానీ సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. నిపుణుల కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ రాజధానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, ఆయన వైఖరితో మళ్లీ హైదరాబాద్‌ తరహా పరిస్థితులు ఉత్పన్నమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
    వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని ధర్యాన ప్రసాదరావు తెలిపారు. ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పని చేసిన నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్, అప్పుడు ఒడిషా సీఎంను కూడా కలిసి చర్చించారని గుర్తు చేశారు. వంశధార ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు కావాల్సి ఉండగా, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.80 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని, శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్పుబట్టారు.
ప్రెస్‌మీట్‌లో ధర్మాన ప్రసాదరావు ఇంకా ఏం మాట్లాడారంటే..:

ప్రాంతీయ అసమానతల విద్వేషం:
    రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష  విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు శాశ్వతంగా వెనకబడి పోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌ చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చి రాష్ట్రం విడిపోయిందని కమిటీ గుర్తు చేసింది. కాగా, ఇప్పుడు సీఎం చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. అమరావతి పేరుతో కేవలం సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం నిధులన్నీ అక్కడే కుమ్మరిస్తే, భవిష్యత్తు తరాలు మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాల్సిన దుస్థితిని చంద్రబాబు కల్పిస్తున్నారు.

నిపుణుల కమిటీని కూడా కాదని ఏకపక్ష నిర్ణయం:
    రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం ఏర్పాటైన నిపుణుల శివరామకృష్ణన్‌ కమిటీ రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలం కాదని స్పష్టంగా చెప్పింది. ఆనాడు ఆ కమిటీకి కనీస వసతులు కూడా కల్పించకుండా హింసించి పంపిన చంద్రబాబు, నేడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తన రాజకీయ అవసరాల కోసం అమరావతి తీర్మానం చేసి, పార్లమెంటులోనూ ఆమోదింప చేసుకుని కేంద్రంతో నోటిఫై చేయించారు. చంద్రబాబు చేసిన ఈ పని, భవిష్యత్తులో అనేక సమస్యలకు తావునిస్తుంది.

80 ఏళ్లైనా ఇంకా వలసలేనా?:
    ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే పేర్కొంది. వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏం చేశారు?. మరోవైపు 80 ఏళ్లైనా కూడా  ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇంకా పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారు. ఇక్కడ 60 ఏళ్లయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు కూడా కేటాయించరా? ఇది ధర్మమా?
    అమరావతిలో కనీస మౌలిక వసతుల కోసమే రూ.2 లక్షల కోట్లు కావాలని, అది పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారు. మరి అంతవరకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు గోచీలు కట్టుకుని కూలీలుగా మిగిలిపోవాలా?.

జగన్‌గారి విజన్‌పై హేళన సరికాదు:
    ప్రపంచమంతా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా వెళ్తుంటే, ఇక్కడ సీఎం చంద్రబాబు మాత్రం కేంద్రీకృత అభివృద్ధికి మొగ్గు చూపుతున్నారు. కానీ, జగన్‌గారు చాలా ముందుచూపుతో 5, 6 జిల్లాలకు మేలు చేసేలా వికేంద్రీకరనను ప్రతిపాదిస్తే, అవహేళన చేస్తున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. జగన్‌గారిని, వైయస్సార్‌సీపీని అకారణంగా నిందించడం కంటే, కూటమి ప్రభుత్వం విషయాన్ని వాస్తవిక కోణంలో చూడాలి.

వంశధార ప్రాజెక్టుపై అచ్చెన్నాయుడి అబద్ధాలు:
    వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు పచ్చి అబద్దాలు. ట్రిబ్యునల్‌లో మనకు అనుకూలంగా నాడు జగన్‌గారి హయాంలో తీర్పు వచ్చింది. దాన్ని అమలు చేయడానికి నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఒడిషా వెళ్లి, అక్కడి సీఎంతో చర్చించారు. మరి ఇన్నేళ్ల సీనియర్‌ అని చెప్పుకునే చంద్రబాబు తన పాలనలో ఏనాడైనా ఒడిషా సీఎంతో మాట్లాడారా? ట్రిబ్యునల్‌ తీర్పు తర్వాత ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) దాఖలు చేసినా, చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఒడిషా వెళ్లి ఆ సీఎంతో మాట్లాడలేదు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలి. 
    నిజానికి వంశధారపై ట్రిబ్యునల్‌ తీర్పు జగన్‌గారి ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. దానికి సంబంధించిన గజిట్‌ ఇప్పుడు వస్తే... అదంతా తామే చేశామని అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని చెబుతున్నారు. వారు సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఒడిషా ప్రభుత్వ ఎస్సెల్పీ గురించి మంత్రి అచ్చెన్నాయుడు మర్చిపోయినట్లు ఉన్నారు. ఆయనకు ఈ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రధానిగారితో మాట్లాడి, ఒడిషా ప్రభుత్వంతో ఆ ఎస్సెల్పీని ఉపసంహరింపచేయాలి. ఇంకా వంశధార ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు అవసరం కాగా, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.80 కోట్ల కేటాయింపు తమ ప్రాంతాన్ని మోసం చేయడమే అని ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Back to Top