చిత్తూరు: చిత్తూరు జిల్లా లో మామిడి రైతులు పరిస్థితి దారుణం ఉందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం చిత్తూరు బి.వి.రెడ్డి కాలనీలో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ` చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వైయస్ జగన్ మామిడి రైతులు మేలు చేశారు. గత మూడేళ్లుగా కిలో మామిడి సరాసరి 25 రూపాయలకు అమ్మకం చేశారు. గత ఏడాది కిలో మామిడి 27 రూపాయలు పైనే విక్రయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇవాళ కిలో మూడు రూపాయలకు అమ్ముకుందామన్నా..కొనే నాథుడు లేడు. చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అన్న వ్యక్తి, ఈరోజు రైతులకు ఏవిధముగా మేలు చేస్తాడు. రాష్ట్రం లో మామిడి, మిర్చి, పొగాకు, టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. మరో నాలుగేళ్లు రైతులకు కూటమి పాలనలో ఇబ్బందులు తప్పవు` అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రైతుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాటం: ఎంపీ మిథున్‌రెడ్డి రాష్ట్రంలో రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ మిథున్‌రెడ్డి అన్నారు. మామిడి రైతులు, పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత 20 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మామిడి రైతులు కిలో 3 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమూల్ పాల డైరీ దెబ్బతీసి లీటర్ పాలకు 4- 5 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తున్నారని ఆక్షేపించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతుందని, తప్పుడు కేసులు పెడుతుందని మండిపడ్డారు. రైతులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.