స్కిల్‌ నుంచి సంక్రాంతి బెల్లం వరకు.. ప్రతిదీ స్కామే..

అవినీతి చేసి అడ్డంగా దొరికిపోతే.. కక్ష సాధింపు అని గగ్గోలా..?

త‌ప్పు చేసిన చంద్ర‌బాబుకేమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?

చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అస‌లే కాదు

గాల్లో విభూది సృష్టించినట్లు.. రూ. 371 కోట్లు కొట్టేశారు

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

కాకినాడ‌: చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష కాదని, ఆ అవసరం ప్రభుత్వానికి ఏ మాత్రం లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. చాలా నీతిమంతుడ్ని అని తనకు తానే భుజకీర్తులు తగిలించుకుని మీడియా బలంతో పేట్రేగిపోయే చంద్రబాబు పాపం పండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారన్నారు. సహజ న్యాయం ఒకటి ఉంటుందని, విర్రవీగిపోతుంటే.. దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసే వ్యవస్థలూ ఉంటాయ‌న్నారు. 2014-19 మధ్య భారీగా అవినీతి జరిగిందని చెప్పారు. చంద్రబాబు సొంత మనుషులకు ఏ విధంగా దోచిపెట్టారో అర్థమ‌వుతోంద‌ని, ఈ స్కిల్‌ స్కామ్‌ను మొదట కేంద్ర సంస్థలు వెలుగులోకి తెచ్చాయ‌ని స్ప‌ష్టం చేశారు. 

మాజీ మంత్రి కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబును జైల్లో పెట్టకుండా, ఇంట్లో పెట్టి హౌస్ అరెస్టు చేస్తే..  కావాల్సిన వారితో మాట్లాడుకుంటూ ఉంటారు. సపర్యలు అన్నీ అక్కడే చేయాలంట. మరి, దాన్ని అరెస్టు అంటారా? చంద్రబాబుకు వర్తించేది మిగతావారికి వర్తించదా? చంద్రబాబుకేమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఉందా?. ఎంత మ్యానిపులేటరో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర బీజేపీకి సొంత వదిన అధ్యక్షురాలు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాల్లో చంద్రబాబు నిర్వాకాలు చాలా ఉన్నాయి. పురంధేశ్వరి చంద్రబాబు అరెస్టు అక్రమం అంటారు. చంద్రబాబు అరెస్టు చూసి జనసేన అధినేత మధనపడుతున్నాడు. కమ్యూనిస్టులు ఆప్తుల్లా ఉంటారు. ఆయనపై మమకారాన్ని చూపకుండా ఉండలేరు. ఇంతకాలం చంద్రబాబు స్కిల్‌ మేనేజ్‌మెంట్ చూశాం. బ్యాక్‌డోర్‌లో వ్యవస్థలను మేనేజ్‌ చేయటంలో చంద్రబాబును కొట్టేవాడే రాష్ట్రంలో లేడు. ఇవాళ జరిగిన అరెస్టు ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జరగాలి. 

స్కిల్‌ లేదు.. ఒక ఇన్‌స్టిట్యూట్‌ లేదు. దాదాపు రూ. 371 కోట్లు లాగేశారు. సీమెన్స్‌ సంస్థ రూ.3500 కోట్లతో వచ్చిందని 10% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని కాగితాలపై చూపించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే దోపిడీ మొదలుపెట్టారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఏం జరగలేదన్నట్లు ఎప్పటికప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇవాళ అదే జరిగింది. గాల్లో విభూది సృష్టించినట్లు రూ.371 కోట్లు కొట్టేశారు.  మొదటగా ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంను జీఎస్టీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు తవ్వాయి. సీఐడీ కూడా దర్యాప్తు చేసి ఏడుగురిని అరెస్టు చేసింది. 

ఎల్లో మీడియా బలాన్ని చూసుకుని చంద్రబాబు- తనను ఎవ్వరూ పీకలేరని అంటారు. నిన్నటి సంఘటనతో చట్టం చంద్రబాబు చుట్టం కాదని తెలిసింది. ఒకరోజు కాకపోయినా మరో రోజు పాపం పండుతుందని నిన్న అర్థమైంది. 15 రోజులుగా లోకేశ్, చంద్రబాబు వాడుతున్న భాషతో ఫ్రస్టేషన్‌కు వెళ్లారని అర్థమౌతోంది. ఎవ్వరూ ఏమీ పీకలేరని అంటారు. మీ నాన్నే ఏమీ చేయలేదు. నువ్వు ఏమి చేస్తావని పదే పదే అన్నారు. కానీ, అవినీతి జరగలేదని ఎక్కడా చెప్పరు. 

నిన్న ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూథ్రాను తీసుకువచ్చారు. ఆయన కోర్టులో వచ్చి నిలబడితే చాలు క్లయింట్ గెలుస్తారని ప్రచారం. సినిమాల్లోనూ లేనంత సీన్‌ కోర్టులో క్రియేట్ చేశారు. ఇంతమంది వకీల్‌లకు తోడు.. ఇంకో వకీల్‌సాబ్ వచ్చి రోడ్డు మీద పడుకున్నారు. ఇంతమంది వాదించినా బాబును రిమాండ్‌ చేశారు. ఎంతసేపూ టెక్నికల్‌గా మాట్లాడతారు తప్ప అవినీతి చేయలేదని మాత్రం అనరు. 

చంద్రబాబు స్కాంల లిస్టు చూస్తే.. స్కిల్‌ డెవలప్‌మెంట్, రాజధాని భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు, సెక్రటేరియట్‌ నిర్మాణాల ద్వారా షెల్‌ కంపెనీలకు రూ.118 కోట్లపై ఐటీ నోటీసులు, ఫైబర్‌ గ్రిడ్, రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం జరిగాయి. ఇలా టీడీపీ హయాంలో అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీని సీఎం వైయ‌స్‌ జగన్ వేశారు. అందులో నేను కూడా ఒక సభ్యుడ్ని. చంద్రన్న సంక్రాంతి కానుకలోనూ బెల్లం స్కాం చేశారు. అందులో అనకాపల్లి వ్యాపారులు, రైతులు పాల్గొనకుండా నిబంధనలు పెట్టారు. వేరే రాష్ట్రాల నుంచి బెల్లం కొనుగోలు చేశారు. టెండర్లు లేకుండా హెరిటేజ్‌ నుంచి నెయ్యి కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో మజ్జిగ కూడా హెరిటేజ్‌ నుంచి కోట్లలో కొనుగోలు చేయమని జీఓ ఇచ్చారు. ఏ ఒక్కటైనా వదిలారా? ముట్టుకుంటే అవినీతి. మీ స్కాంలు.. స్కీంలు ఎవరికీ తెలియని బాగోతాలు అనుకుంటున్నారా? టీడీపీ నాయకులు అర్థం చేసుకుంటే మంచిది. 

ఎల్లో మీడియాలో చంద్రబాబును అన్నాహజారేకి బ్రదర్‌లా చూపిస్తారు. దేశంలో గొప్ప ప్రతిభావంతమైన నాయకుల్లో ఒకడిగా రాస్తారు. చంద్రబాబుకే అన్యాయం జరిగినట్లు రాస్తారు. చంద్రబాబును ఓ హీరోగా. ఆయన కొడుకు ఎదిగొస్తున్న హీరోగా. మా పార్టీ, మా నాయకుడు విలన్‌లా చూపిస్తారు. నువ్వు కోట్లు మోసేశావు అంటే ఒప్పుకోరు. ఎదుటివాడిని దొంగే అన్నట్లు విమర్శలు చేస్తారు. 

చంద్రబాబు కోసం పవన్ బాగా బాధపడ్డాడు. రోడ్ల మీద పడుకున్న ఫొటోలూ చూశాం. ఈ సందర్భంగా టీడీపీ, జనసేనలు బలపడ్డాయని పవన్ అన్నట్లు ఈనాడులో రాశారు. కోనసీమ వారాహియాత్రలో ఏదో దుర్ఘటన చేయాలని కుట్ర పన్నారని పవన్ విమర్శిస్తారు. అసలు.. సినిమాల్లోలా మాదిరిగా పవన్ భ్రమలో బతుకుతున్నారు. ప్రభుత్వం మారగానే సీఎం వైయ‌స్‌ జగన్‌ని అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పిస్తామని పవన్ చెబుతున్నారు. రాష్ట్రం, కేంద్రం అయిపోయింది. ఇక అంతర్జాతీయం అంటున్నాడు. జాతీయమో, అంతర్జాతీయమో చంద్రబాబుకు ఉన్న ఖ్యాతి భవిష్యత్తులో తెలుస్తుంది. చంద్రబాబుకు రిమాండ్ నెంబర్ ఖైదీగా 7691 నెంబర్ ఇచ్చారట. 

ఇలా ఎన్నో కేసుల్లో కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ, ఏ కేసులోనూ దర్యాప్తు జరగకుండా చూసుకుంటున్న చంద్రబాబు, ఇప్పుడు అడ్డంగా దొరికిపోవడంతో అక్రమ అరెస్టు..  రాజకీయ కక్ష అని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. చంద్రబాబును ప్రేమిస్తున్న వారి  బాధ వర్ణణాతీతం. అచ్చెన్నాయుడు ఫోన్‌లో కార్యకర్తలను రోడ్ల మీదకు రమ్మని బ్రతిమిలాడుకుంటున్నాడు. ఎందుకంటే, టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు నొక్కేసి ఉంటాడని నమ్ముతున్నారు. 

ఈ అవినీతి దెబ్బతో చంద్రబాబుకు సానుభూతిగానీ, విజయంగానీ దక్కదు. 2004-05 ముందు అలిపిరి ఘటన జరిగినా ఎలాంటి విజయం దక్కిందో చూశాం. గతంలో సోషల్ మీడియా లేనప్పుడు ఆ మీడియా చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి. ఇవాళ ప్రజలకు వాస్తవాలు అర్థమౌతున్నాయి. ఎన్ని కుంభకోణాలు.. అవినీతి మేత పెట్టుకుని అబద్ధాలు చెప్పుకుంటూ గ్యారెంటీ ఇస్తానంటూ చంద్రబాబు రోడ్డు మీదకు రావటానికి ఎంత ధైర్యం ఉండాలి.  

సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పథకాన్ని దేశంలోనే ఒక మోడల్‌గా అందిస్తుంటే... టీడీపీ వాళ్లకు, ఎల్లో మీడియాకు కనిపించదు. లోకేశ్ పాదయాత్ర చూస్తే.. తెల్లవారే సరికి జిల్లా మారిపోతున్నాడు. అంతంత దూరం ఎలా నడుస్తున్నాడో అర్థం కావట్లేదు.  కవర్ చేసే మీడియా బలం, ధనబలం ఉంది. అన్ని పార్టీల చెవులు కొరికే నాయకులు ఉన్నారనే ధైర్యం. వీరంతా ఒక ఎత్తు అయితే.. సీఎం వైయ‌స్‌ జగన్ మరో ఎత్తు. వైయ‌స్ జగన్ వైపు జనం ఉంటే.. చంద్రబాబు వైపు ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయం మాత్రమే ఉంది. సీఎం వైయ‌స్ జగన్‌ ఏదైనా చేయాలని పట్టుపడితే సంకల్పం.. బలం ఉంటుంది. 

యుద్ధమని పవన్ అంటున్నాడు. నిజానికి.. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని సీఎం వైయ‌స్ జగన్ ఎప్పుడో చెప్పారు. ప్రజాపక్షాన నిలబడినప్పుడు మీ కుట్రలు ఎదుర్కోవటానికి ఈ పక్షం అంతా సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పుతామంటున్నారు. సీఎం పిల్లల చదువుల కోసం లండన్ వెళ్తే.. లోకేశ్, భజన బృందాలు స్పెషల్ ఫ్లైట్‌ అని పచ్చిగా మాట్లాడుతున్నారు. నిన్న ఒక్కరోజే నాలుగైదు స్పెషల్‌ జెట్‌లు టీడీపీ వారే వాడారు. లాయర్‌కు ఒకటి, ఆయన పార్టీ మద్దతు ఇచ్చే నాయకుడికి ఒకటి, కుటుంబ సభ్యులకు ఒకటి, పైన వాళ్లకి, కింద వాళ్లకి ఒకటి ఐదో, ఆరో వాడారు. ఈ డబ్బులు ఏ స్కిల్ వాడితే టీడీపీకి వచ్చాయి.

ప్రభుత్వం అనుకుంటే ఎవ్వరినీ జైలుకు పంపలేదు. సాక్ష్యాధారాలు చూసి తప్పు జరిగిందని కోర్టు నమ్మినందువల్లే.. చంద్రబాబును రిమాండ్‌కు పంపింది. రాజకీయ కక్షతో సీఎం వైయ‌స్‌ జగన్ చంద్రబాబును జైలుకు పంపినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని న్యాయ నిపుణులంతా చంద్రబాబు పక్షాన వాదించారు. అయినా స్కిల్‌లో తప్పు జరిగిందని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికైనా రాజకీయ వైరంగా ప్రచారం చేయటం మానుకోవాలి. 

Back to Top