తాడేపల్లి: విజయవాడ సమీపంలో జరిగిన హైందవ శంఖారావం సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరీ రాజకీయ విమర్శలు చేయడం దారుణమని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ సభలో మిగిలిన వారికి విరుద్దంగా పురంధేశ్వరీ గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై రాజకీయపరమైన ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. తన మరిది చంద్రబాబు ప్రయోజనాల కోసమే పురంధేశ్వరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పురంధేశ్వరికి అలా మాట్లాడటం అలవాటు హైందవ శంఖారావం సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ మాట్లాడుతూ గత అయిదేళ్ళ వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో హైందవ ధర్మంపై విపరీతమైన దాడి జరిగిందని, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్లుగా ఆరోపణలు చేశారు. ఆమె ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం అలవాటు. పదేళ్ళు కాంగ్రెస్ లో సెక్యులరిస్ట్ గా, తరువాత బీజేపీలో చేరి హిందూవాదిగా చెప్పుకుంటూ, తన మరిది చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజమండ్రి పుష్కరాల్లో ఆయన ప్రచార ఆర్భాటం వల్ల దాదాపు 29 మంది హిందువులు దుర్మరణం పాలైనప్పుడు పురంధేశ్వరీ మాట్లాడలేదు. చంద్రబాబు సీఎంగా, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో దాదాపు 40 కిపైగా ఆలయాలను కూల్చేశారు. దేవతల విగ్రహాలను చెత్త ట్రాక్టర్ లలో తలించారు. అప్పుడు హిందుత్వవాది పురంధరేశ్వరికి అవేవీ కనిపించలేదు. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన హైందవ సభలో చంద్రబాబుకు మేలు చేయాలని, గత వైయస్ఆర్సీపీ పాలనపై బుదరచల్లాలనే ఉద్దేశంతోనే ఆమె మాట్లాడారు. వైయస్ జగన్ హయాంలోనే ఆలయాలకు మహర్థశ వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ రాష్ట్రంలో నిజమైన హిందూధర్మ పరిరక్షణ పరిఢవిల్లింది. హిందూ దేవాలయాలకు సంబంధించి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి, స్థానిక ఆలయ నిర్వహణా కమిటీలకు అప్పగించడం జరిగింది. దేవాలయాల్లోని అర్చకులకు కనీస వేతనాలను రూ.10 నుంచి 15 వేల వరకు పెంచడం జరిగింది. అర్చకులకు రిటైర్ మెంట్ వర్తించకుండా, వారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం పనిచేసుకునే వెసులుబాటు కల్పించాం. వంశపారంపర్య అర్చకత్వంను కొనసాగించేందుకు వీలు కల్పించాం. రాష్ట్రంలోని అనేక ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. ఆలయాల్లో కోట్లాధి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు మాస్టర్ ప్లానింగ్ చేయించాం. రూ. 225 కోట్లతో కనకదుర్గమ్మ ఆలయంలో మాస్టర్ ప్లాన్ అమలు చేశాం. అలాగే శ్రీశైలం ఆలయంలో రూ.50 కోట్లతో సాలమంటపాలు, 70 కోట్లతో క్యూకాంప్లెక్స్ లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టాం. ఆనాడు శ్రీశైల క్షేత్రంలో రాజగోపురంకు సంప్రదాయాలకు అనుగుణంగా పీఠాధిపతులను ఆహ్వానించి మహా కుంభాభిషేకం నిర్వహించాం. దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన లక్షలాధి ఎకరాల విషయంలో సెక్షన్ 83 ని సవరించి, లీజు గడువు పూర్తయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం, అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్రిటీష్ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న శ్రీశైలం భూముల చిక్కుముడిని విప్పి, భూములను ఆలయానికి స్వాధీనం చేశాం. రాష్ట్రంలో రూ.600 కోట్లు సీజీఎఫ్ నిధుల నుంచి కొత్త దేవాలయాలు, పాతదేవాలయాల పునరుద్దణకు కృషి చేశాం. 3000 కొత్త దేవాలయాలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను వినియోగించాం. ఇన్ని కార్యక్రమాలు జగన్ గారి నేతృత్వంలో జరిగాయి. ఇవ్వన్నీ పురంధేశ్వరీకి కనిపించడం లేదు. ఇంత చేసిన వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం పై ఆమె చేసిన ఆరోపణలతో నిజంగానే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే ఆమె ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పురంధేశ్వరి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పురంధేశ్వరీ వ్యాఖలు ఉన్నాయి. తిరుమల లడ్డూ పవిత్రతపైనే దారుణంగా ఆరోపణలు చేశారు. లడ్డూ కల్తీ అన్నారు. తీరా విచారణలో అది వాస్తవం కాదని తేలిపోయింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేశారని ప్రజలు కూడా గుర్తించారు. వైయస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని హిందూ దేవాలయాల పరిరక్షణకు తీసుకున్న చర్యలు, ప్రారంభించిన అభివృద్ది పనులను కొనసాగించినప్పుడే కూటమి ప్రభుత్వానికి హిందూధర్మంపై గౌరవం ఉందని నిరూపణ అవుతుందని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.