తుని: ఏ ఒక్క రైతు నుంచీ తాను భూమి లాక్కోలేదని, మార్కెట్ రేటు కంటే ఎక్కువకే సెజ్‌లో భూములు కొన్నట్లు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. తనపై అధికార కూటమి బురద చల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ సెజ్‌లో తాను మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకే భూములు కొనుక్కున్నాను తప్ప.. ఏ రైతు నుంచీ లాక్కోలేదని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వెల్లడించారు. వైయస్ఆర్‌సీపీలో ఉంటే భూములు కొనకూడదా? అని ప్రశ్నించిన ఆయన, దీనిపై బురద చల్లడం కోసమే ఎల్లో మీడియా కథనాలు రాస్తోందని ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు అమరావతిలో, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పిఠాపురంలో భూములు కొన్నారని గుర్తు చేసిన ఆయన, మరి వారు ఏ రైతుల నుంచి ఆ భూములు లాక్కున్నారని నిలదీశారు. కాకినాడ జిల్లా, తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. యనమల అంత ఎలా సంపాదించారు?: ఇంకా ఈ 10 రోజుల్లోనే యనమల రామకృష్ణుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రెండు ఆస్తులు ఏ పేదల దగ్గర దోచుకున్నవో చెప్పాలని మాజీ మంత్రి కోరారు. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, కనీసం రూ.2 లక్షలు కూడా లేకపోతే, తుని నియోజకవర్గంలో ప్రముఖులు చందాలు వసూలు చేసి గెలిపించారని తెలిపారు. మరి అదే యనమల ఇప్పుడు డిస్టిలరీలు ఎలా ఏర్పాటు చేశారని, భూములు ఎలా కొన్నారని, అంత ఆస్తి ఎలా సంపాదించారని నిలదీశారు. అక్రమ ఆస్తులు కూడబెట్టిన యనమల, వాటిని ప్రజలకు పంచి పెట్టి అప్పుడు నీతులు చెబితే బాగుంటుందని సూచించారు. తునిలో తమది మొదటి నుంచి వ్యాపార కుటుంబం అన్న దాడిశెట్టి రాజా, తాము అందరి లాగనే చట్టబద్దంగా భూములు కొంటే తప్పేమిటని ప్రశ్నించారు. రైతులను దోచేస్తున్నారు: ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం.. రైతులను దోచుకు తింటోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని ఆయన వెల్లడించారు. అందుకే రైతులకు మద్ధతుగా వైయస్ఆర్‌సీపీ ఆందోళన చేపడుతోందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో బస్తా ధాన్యం రూ.2200 నుంచి రూ.2400 ఉంటే, ఈరోజు అది రూ.1400కు పడిపోయిందని ఆక్షేపించారు. ధాన్యం సేకరణ తమకు చేతకావడం లేదని సాక్షాత్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే వైయస్ జగన్‌గారు ప్రకటించిన మద్ధతు ధరతో పాటు రూ.2200 వరకు చెల్లించాలని దాడిశెట్టి రాజా సవాల్ చేశారు.