ప్రకాశం: మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్ర కార్మిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిపై తీవ్ర విమర్శలు చేశారు. దళితుల మధ్య చిచ్చు పెట్టేలా మంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దళితుల ఆరాధ్యులైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల విషయంలో అవమానకర రీతిలో వ్యవహరించారని ఆయన ధ్వజమెత్తారు. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మించుకున్న ఆ విగ్రహాల ప్రారంభోత్సవాన్ని దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిర్వహించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు విగ్రహాలను పసుపు నీళ్లతో శుద్ధి చేశారని సురేష్ తెలిపారు. ఇది దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చేసిన చర్య అని ఆయన పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు కేసులకు భయపడే రకం కాదని, ప్రజల మనోభావాలను కాపాడే విషయంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం సరికాదని, దళితుల గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.