డీజిల్ కొరతతో రామచంద్రపురంలో నిలిచిన వరి కోతలు 

 రామచంద్రపురం: కోతల కీలక సమయంలో డీజిల్ అందుబాటులో లేకపోవడంతో రామచంద్రపురం ప్రాంతంలో వరి కోతలు నిలిచిపోయాయి. వరి కోత యంత్రాలకు డీజిల్ దొరక్క రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే కూలీల కొరత, పెరుగుతున్న కూలి రేట్లు, ఇతర ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ డీజిల్ సమస్య మరింత భారంగా మారింది. వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో పనులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీజిల్ కొరత కారణంగా కోతలు నిలిచిపోవడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోందని స్థానికులు చెబుతున్నారు. పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఈ పరిస్థితి ఎదురవడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేసే వారే కరువయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
 

Back to Top