కూటమి నాయకుల ప్రయోజనాల కోసమే కృత్రిమ కొరత  

ఇంధన కృత్రిమ కొరతపై బలసాని ఆగ్రహం  

గుంటూరు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏర్పడిందని ప్రత్తిపాడు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ బలసాని కిరణ్ కుమార్ విమర్శించారు. గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెం గ్రామంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌ను సందర్శించి వాహనదారుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన కొరత నెలకొనడం ఆందోళనకరమన్నారు. రాష్ట్రంలో సుమారు 4,500 పెట్రోల్ బంకుల్లో 70 శాతం వరకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు.

పెట్రోల్ బంకుల్లో పరిమితంగా ఇంధనం ఇవ్వడంతో ఆటో డ్రైవర్లు, రోజువారీ వృత్తులు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రోజుకు అవసరమైనంత పెట్రోల్ దొరకక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వాహనదారులు తమకు తెలిపారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నాయకుల ప్రయోజనాల కోసమే ఈ కృత్రిమ కొరత సృష్టించబడిందని ఆరోపిస్తూ, వెంటనే ప్రభుత్వం స్పందించి ఇంధన సరఫరాను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top