విజయవాడ : రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ భవానిపురం బ్యాంక్ సెంటర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఆయన క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి వాహనదారుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 25న ఇండెంట్ పెట్టినప్పటికీ ఇప్పటికీ స్టాక్ రాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కొరత లేదని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. సామాన్య ప్రజలు డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతుంటే మంత్రులు విదేశీ పర్యటనల్లో మునిగిపోయారని ఆయన మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకునే ప్రభుత్వం ఇంధన కొరతను గుర్తించలేకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ఈ సంక్షోభం కృత్రిమంగా సృష్టించబడిందని ఆరోపిస్తూ ఆయిల్ కంపెనీలతో కుమ్మక్కై ధరలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెలంపల్లి పేర్కొన్నారు. రేషన్ పద్ధతిలో ఇంధనం ఇవ్వడం సిగ్గుచేటని, ప్రజల దైనందిన జీవితం పూర్తిగా దెబ్బతిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వ్యవహారంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.