పశ్చిమగోదావరి: తణుకు నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కొరతపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కొరత ఏర్పడటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇంధన కొరత లేకపోయినా ఏపీలో మాత్రమే సమస్యలు రావడం దురదృష్టకరమని అన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత మంత్రి లేదా ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణగా పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రంపై బాధ్యత నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కేంద్రంలో కూడా భాగస్వాములే అన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోతోందని విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు, అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని, పెట్రోల్, డీజిల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.