విజ‌య‌వాడ‌లో వినూత్న నిర‌స‌న‌

రాష్ట్రవ్యాప్తంగా బంకుల వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం మరింత ముదిరిన నేపథ్యంలో విజ‌య‌వాడ‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వాహ‌నాల‌కు తాళ్లు క‌ట్టి లాగుతూ వినూత్న నిర‌స‌న చేప‌ట్టారు.  యూరియా, గ్యాస్ తర్వాత ఇప్పుడు ఇంధన కొరత ఏర్పడటం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో రైతులు, ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. ఆరు రోజులుగా కొనసాగుతున్న ఇంధన కొరతపై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. డీజిల్ కొరతతో డెల్టా ప్రాంతాల్లో వరి కోతలు నిలిచిపోయాయని, 108 అత్యవసర సేవలు కూడా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

 
చంద్రబాబుది చేతకాని ప్రభుత్వం:  దేవినేని అవినాష్‌
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్ర‌బాబుది చేత‌కాని ప్ర‌భుత్వ‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు. కూటమికి ఓట్లు వేసిన ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిప‌డ్డారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులు యూరియా కోసం, వృద్ధులు పింఛన్ కోసం, మహిళలు రేషన్ కోసం, ప్రజలు గ్యాస్ కోసం క్యూల్లో నిలబడుతున్న దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా అందించలేని పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రజలపై మోపే ప్రయత్నం చేస్తోందని, మంత్రులు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా విదేశాల్లో తిరుగుతున్నారని అన్నారు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ప్రచార రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు.

తాడేపల్లి పెట్రోల్ బంకు వ‌ద్ద నిర‌స‌న‌
వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో తాడేప‌ల్లిలోని పెట్రోల్ బంకు వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఇంధన కొరతతో రవాణా వ్యవస్థ దెబ్బతిందని, డెల్టా ప్రాంతాల్లో వరి కోతలు నిలిచిపోయాయని తెలిపారు. 108 అత్యవసర సేవలు కూడా ప్రభావితమవుతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇంధన సరఫరాను వెంటనే పునరుద్ధరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు.

Back to Top