కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

ఏ ఒక్క వర్గానికి ఏ మేలు చేయని ప్రభుత్వం

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా పార్టీ

విద్యార్థులు, రైతులు, యువత, అక్కచెల్లెమ్మలు

ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతున్నాం

జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నాం

ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలి

వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది

వైయ‌స్ జగన్‌ ఉంటే, ఎలా మేలు జరిగేదన్నది ఆలోచిస్తున్నారు

ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమే

ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతాను

అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటాను

ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ

సమావేశంలో వైయస్‌ జగన్‌ వెల్లడి

తాడేపల్లి: ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.
    గతంలో ఒకసారి ఇలా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. కొంతకాలం తర్వాత తిరిగి, ఏలూరు నియోజకవర్గంతో ఆ తరహా సమావేశాలు ప్రారంభించారు. ఇక నుంచి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతానని, ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటించారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..:

మరోసారి పాదయాత్ర:
    నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో గతంలో సమావేశమయ్యాం. మళ్లీ ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెడుతున్నాం. ఇక ముందు వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశం అవుతాం. చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. అలాగే మిగిలింది మూడేళ్లు మాత్రమే. అందులో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలుపెడతాను. ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు, నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను.

ప్రతి ఇంట్లోనూ అదే చర్చ:
    ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరగుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావడంతో వ్యవహరిస్తున్నారు. పాలనంతా అబద్దాలు మోసాలు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్‌ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది.
    ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. జగన్‌ ఉన్నప్పుడే బాగుండేది. ఆయన ప్రతి నెలా బటన్‌ నొక్కేవాడు. చెప్పింది చేసే వాడు. మాట నిలబెట్టుకునేవాడు. అన్నీ ఇచ్చేవాడు అని ప్రజలంతా, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు. అదే చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పొలావ్‌ కూడా లేకుండా చేశారని అంతా బాధపడుతున్నారు.
    మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌. అన్ని కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం. మాట నిలబెట్టుకున్నాం. అదే ఈరోజు ప్రజల్లో, ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.

మోసం. దగా. అదే చంద్రబాబు పాలన:
    మనం ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత, ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ఉండరని అంతా గుర్తించారు. సూపర్‌సిక్స్‌ లేదు. సూపర్‌ సెవెన్‌ లేదు. అన్నీ మోసాలే. ఏదీ అమలు లేదు. మరోవైపు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంటు స్కూళ్లు పూర్తిగా కళ తప్పాయి. మన హయాంలో గవర్నమెంటు స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడే స్థితి ఉంటే.. ఇప్పుడు అంతా రివర్స్‌ అయింది. నాడు–నేడు మనబడి లేదు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు లేవు. పిల్లలకు టోఫెల్‌ క్లాస్‌లు లేవు. గోరుముద్ద కూడా క్వాలిటీ లేకుండా పోయింది. పిల్లల ప్రాణాలు పోతున్నాయి. నాడు గవర్నమెంట్‌ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేల నుంచి కూడా రికమెండేషన్లు ఉండేవి. ఆ స్థాయిలో గవర్నమెంటు స్కూళ్లకు డిమాండ్‌ ఉండేది. 
    అదే ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంటు స్కూళ్ల నుంచి చదువు మానేశారు. నాడు మన హయాంలో గవర్నమెంట్‌ స్కూళ్లలో దాదాపు 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు కేవలం 33 లక్షల మంది మాత్రమే చదువుతున్నారు.

అన్ని వ్యవస్థలు నిర్వీర్యం. అన్నీ బకాయిలే:
    ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 8 క్వార్టర్లు పెండింగ్‌. ఒక త్రైమాసికం అయిపోగానే, దానికి సంబంధించిన డబ్బులు జమ చేసే వాళ్లం. 2024లో ఎన్నికలకు ముందు జనవరి నుంచి మార్చి వరకు ఇవ్వాల్సిన త్రైమాసిక చెల్లింపు, ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్‌ రావడంతో ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో, అప్పటి నుంచి ఫీజుల చెల్లింపు లేకుండా పోయింది. ఒక్కో క్వార్టర్‌కు రూ.700 కోట్లు. అలా 8 క్వార్టర్లకు సంబంధించి రూ.5600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.700 కోట్లు ఇచ్చారు. అలా రూ.4,900 కోట్లు బకాయి పడ్డారు.
    వసతిదీవెన కింద మనం పిల్లలకు కోర్సును బట్టి ఏటా రూ.20 వరకు ఇచ్చే వాళ్లం. అలా ప్రతి ఏప్రిల్‌లో రూ.1100 కోట్లు ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం రెండేళ్ల నుంచి ఇవ్వక రూ.2200 కోట్లు బకాయి పడింది. అలా చదువుల రంగం పూర్తిగా నాశనం అయింది. ఇక్కడ చదవాలంటే పిల్లలు భయపడుతున్నారు.
    ఆరోగ్యశ్రీ కనుమరుగు చేశారు. నెలకు రూ.300 కోట్లు దానికి కావాలి. మన హయాంలో 3300 ప్రొసీజర్లకు విస్తరించి, రూ.25 లక్షల వ్యయం వరకు ఉచిత వైద్యం అందించాం. దాదాపు 20 నెలల నుంచి నెలకు రూ.300 కోట్ల చొప్పున దాదాపు రూ.6 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. రూ.4 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. 108, 104 సర్వీసులు నిర్వీర్యం చేశారు. కోవిడ్‌ టైమ్‌లో కూడా అన్ని సదుపాయాలతో మనం కొత్త వాహనాలు ప్రవేశపెడితే.. వాటిని ఇవాళ పడకేయించారు. ఇప్పుడు టీడీపీకి డాక్టర్ల వింగ్‌కు చెందిన వారికి సర్వీసులు అప్పగించారు. ఇప్పుడు ఆ సర్వీసుల కోసం ఫోన్‌ చేస్తే, మూడు గంటలైనా రావడం లేదు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్‌:
    మన ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టాం. పూరై్తన 10 మెడికల్‌ కాలేజీలను ఈ ప్రభుత్వం అచ్చంగా ప్రైవేటీకరిస్తోంది. అంతే కాకుండా ఆ మెడికల్‌ కాలేజీల్లో రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. ఒక మెడికల్‌ కాలేజీలో జీతాలకు ఏటా రూ.60 కోట్లు కావాలి. అలా రెండేళ్లకు రూ.120 కోట్లు ఖర్చవుతాయి. ఈ ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు వారికి ఇవ్వడమే కాకుండా, రెండేళ్ల పాటు జీతం కూడా చెల్లిస్తారట. అంటే కాలేజీ ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ స్టాఫ్‌. ఇంకా నిర్వహణ ఖర్చు ప్రభుత్వానిది. కానీ, లాభాలు మాత్రం ప్రైవేటువారికి.
    ఇలాంటి స్కామ్‌కు పాల్పడిన వారిని, మేము రాగానే రెండు నెలల్లోనే చర్య తీసుకుంటామనగానే.. ఆ కాలేజీలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

నాలుగు రంగాలు నాశనం:
    వ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేశారు. చివరకు ఎరువులు కూడా బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. నాడు గ్రామాల్లో ప్రతి అడుగులో రైతుల చేయి పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు ఇప్పుడు పని చేయడం లేదు. ఉచిత పంటల బీమా లేదు. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. పంటలకు మద్దతు ధర లేదు. చివరకు రైతు భరోసాలో కూడా మోసం. రూ.40 వేలకు బదులు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు.
    అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నాశనం కాగా, తాజగా నాలుగో వ్యవస్థ శాంతి భద్రతలు. దాన్నీ నాశనం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. ఎక్కడా పోలీసింగ్‌ వ్యవస్థ కనిపించడం లేదు. ఇంకా మొత్తం ప్రైవేటీకరణ.. అదే అనుకుంటే చివరకు సీఎం పదవిని కూడా ప్రైవేటుకు ఇవ్వొచ్చు కదా?.

జనంతో వైయ‌స్ఆర్‌సీపీ మమేకం:
    అన్నింటా విఫలమైన ప్రభుత్వం, ప్రశ్నించే గొంతు నొక్కుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కేసులతో వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రజలకు తోడుగా నిలబడుతోంది. విద్యార్థులు, యువత, రైతులు, అక్క చెల్లెమ్మలు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా, వారందరి తరపున జెండా పట్టుకుని నిలబడుతున్నాం. గట్టిగా పోరాడుతున్నాం.    
    ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగాలి. ఆ దిశలో మీరంతా కలిసికట్టుగా పని చేయాలి. ఏలూరులో మన పార్టీ నాయకుడు జేపీ (జయప్రకాష్‌)కి మీ అందరి సహకారం కావాలి. మీరంతా ఆయనకు తోడు కావాలి అంటూ.. శ్రీ వైయస్‌ జగన్, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
    ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు జయప్రకాష్, కారుమూరి సునిల్‌తో పాటు, దాదాపు 200 మంది ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Back to Top