కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదానికి బెల్ట్ షాపులో విక్రయించిన నకిలీ మద్యమే కారణమని, బెల్ట్ షాపులకు అనధికారికంగా అనుమతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పి, రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించి ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతిచెందిన బైకర్ కి అర్ధరాత్రి మద్యం దొరక్కపోయుంటే తాగేవాడు కాదని, బెల్ట్ షాపులో అతడు మద్యం తాగకపోయుంటే అతడితోపాటు బస్సు ప్రమాదంలో చనిపోయినవారంతా ప్రాణాలతోనే ఉండేవారని ఎస్వీ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకే 20 మంది మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించాలని చెప్పారు. పగలూరాత్రీ తేడాలేకుండా నకిలీ మద్యం విక్రయిస్తూ ఈ ప్రభుత్వం అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు రాష్ట్రంలో వేళాపాలా లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోకుండా మద్యపాన ప్రియుల ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. గుడి, బడి, థియేటర్.. పగలు రాత్రీ, హైవేలు, రాష్ట్ర రోడ్లు అనే తేడా లేకుండా మద్యం విక్రయిస్తూ తెలుగుదేశం నాయకులు జేబులు నింపుకుంటున్నారు. బెల్ట్ షాపుల వద్ద తిరునాళ్ల మాదిరిగా రాత్రుళ్లు కలర్‌ఫుల్ లైట్లు వేసి మరీ మద్యం విక్రయిస్తున్నారు. గ్రామాల్లో మహిళలు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటోంది. అన్నపూర్ణగా పిలవబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. మద్యం మత్తులో రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. కర్నూలు ఐదు రోడ్ల జంక్షన్‌లో రోడ్డుకి ఒకవైపు ఆంజనేయ స్వామి గుడి ఉంటే దానికి ఎదురుగా ఇంకోవైపు టానిక్ వైన్‌షాపును నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ మాదిరిగా జరుగుతోంది. ప్రభుత్వ పెద్దల సహకారంతో టీడీపీ నాయకులే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, రేపల్లె, అనకాపల్లి, నెల్లూరు, ఏలూరు ప్రాంతాల్లో వెలుగుచూసిన ఘటనలే రుజువు చేస్తున్నాయి. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ యూనిట్‌ని ఏకంగా తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి నిర్వహిస్తున్నట్టు ఆధారాలతో సహా గుర్తించినా పోలీసులు అరెస్ట్ చేయలేదు. నకిలీ మద్యం తయారీలో అడ్డంగా దొరికిపోయిన కూటమి ప్రభుత్వం దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాజీ మంత్రి జోగి రమేశ్ మీద తప్పుడు ఆరోపణలు చేయిస్తోంది. తప్పుడు వాంగ్మూలాలతో వైయస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వం, నకిలీ మద్యం వ్యవహారంలో దొరికిన నిందితులను మాత్రం అరెస్ట్ చేయడం లేదు సరికదా కనీసం వారి ఫోన్లు సీజ్ చేయడం లేదు, వారి మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం లేదు. ములకలచెరువులో భారీ ఎత్తున లక్షల బాటిళ్లలో నకిలీ మద్యం దొరికినా బెల్ట్ షాపులు సీజ్ చేయడం కానీ, మద్యం దుకాణాల్లో తనిఖీలు చేయడం కానీ చేయలేదు. ప్రభుత్వమే నకిలీ మద్యం తయారు చేయించి బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల ద్వారా విక్రయిస్తుందని చెప్పడానికి ఇంతకన్నా వేరే రుజువులు అవసరం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నీరు దొరకని గ్రామం ఉందేమో కానీ మద్యం దొరకని గ్రామం లేదు. ఫోన్ చేస్తే మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. మారుతీ వ్యాన్‌లలో, అరటి కాయల బండ్ల మీద సైతం మద్యం విక్రయిస్తున్నారంటే ఇంతకన్నా చోద్యం ఉంటుందా? - మద్యం దొరక్కపోయుంటే ప్రమాదం జరిగేది కాదు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదానికి కూడా నకిలీ మద్యమే కారణం. బైకు నడిపిన యువకుడు లక్ష్మీపురం బెల్ట్ షాపులో దొరికిన నకిలీ మద్యం సేవించి బైకు నడిపినట్టు పోలీసుల దర్యాప్తులోనే తేలింది. యువకుడు మద్యం మత్తులో డివైడర్‌ను ఢికొట్టి కిందపడి చనిపోవడంతోపాటు ఆ బైకు రోడ్డుపైనే ఉండిపోయింది. ఆ వెంటనే వచ్చిన బస్సు కింద పడిన ఆ బైకు ఇంజిన్ పేలిపోవడంతో దుర్ఘటన జరిగి దాదాపు 20 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి వేళ బెల్ట్ షాపులో మద్యం దొరక్కపోయుంటే ఆ యువకుడు మద్యం తాగేవాడే కాదు. ఆ యువకుడు మద్యం తాగకపోయుంటే ఈ ప్రమాదం జరగకపోయేది. అప్పుడు ఆ యువకుడి ప్రాణాలతోపాటు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి 20 మంది కూడా ప్రాణాలతో మిగిలేవారు. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో రాష్ట్రంలో మద్యం దొరుకుతుందంటే ఇంతకన్నా దారుణం ఏముంటుంది? ఇదంతా కూటమి ప్రభుత్వం ధనదాహంతో అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టి మరీ బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం విక్రయించడం వల్లే జరిగింది. ఈ అమాయకుల ప్రాణాలను ఈ ప్రభుత్వమే బలిగొంది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలి. ఆ కుటుంబాల వద్దకు వెళ్లి క్షమాపణ పత్రం రాసివ్వాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా బస్సు ప్రమాద ఘటనలో కేసు నమోదు చేయాలి. ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి నకిలీ లిక్కర్ బాటిల్ ఉందని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. నకిలీ లిక్కర్ ద్వారా గడిచిన ఏడాదిలోనే రూ.5 వేల కోట్లకుపైగా తెలుగుదేశం నాయకులు దోచుకున్నారు. ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకలేకపోతే ఆ అక్రమ సంపాదన నుంచైనా బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలి. విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులకు అనధికారికంగా అనుమతులిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బస్సు ప్రమాదానికి బాధ్యత తీసుకుని బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలి. - చంద్రబాబు కారణంగా మరణించిన వారెందరో... చంద్రబాబు కారణంగా నిత్యం అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గతంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి గుంటూరులో ముగ్గుర్ని, ఇరుకు రోడ్లల్లో సభలు పెట్టి కందుకూరులో ఏడుగుర్ని చంద్రబాబు బలిగొన్నాడు. ఇప్పుడు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్న బెల్ట్ షాపుల కారణంగా 20 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కర్నూలు బస్సు ప్రమాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.