హైదరాబాద్: ఎన్నికల మందు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ, రూ.14 లక్షల కోట్ల అప్పులు చేశామని దుష్ప్రచారం చేసిన టీడీపీ కూటమి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, అది నిజమని చూపేందుకు విశ్వప్రయత్నం చేస్తోందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్ర అప్పులపై వాస్తవాలన్నీ బడ్జెట్ ప్రతుల్లో ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పు రూ.6.46 లక్షల కోట్లు అని స్పష్టంగా పేర్కొన్నా.. ఏవేవో లెక్కలు కట్టి, ఇప్పుడు దాన్ని రూ.9.74 లక్షల కోట్లుగా చూపుతూ, తవ్వేకొద్దీ ఇంకా ఎంత బయట పడుతుందో! అంటూ చెబుతున్నారని ఆయన ఆక్షేపించారు. తవ్వడానికి ఇదేమీ సొరంగమో, గనినో కాదన్న ఆయన, నిజానికి కాగ్ ప్రతినెలా ఆడిట్ చేస్తుందని, అన్ని వాస్తవాలు అందులో బయట పడతాయని చెప్పారు. ‘నిద్ర పోతున్న వారిని మేల్కొలపవచ్చు. కానీ, నిద్ర పోతున్నట్లు నటిస్తున్న వారిని మేల్కొలపలేం’ అన్న, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని, అన్ని వాస్తవాలు తెలిసినా, అన్నింటికి గత మా ప్రభుత్వాన్నే నిందిస్తూ, విమర్శలు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగడుతూ.. గణాంకాలతో సహా, అన్నీ వివరించారు. అందుకే ఎవరు గుంజీలు తీయాలో ఆలోచించుకోవాలని ప్రభుత్వానికి చురకలంటించారు. హైదరాబాద్, ప్రెస్‌క్లబ్‌లో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు పచ్చి అబద్ధాలు. నిందలు: – అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి కేశవ్, మండలిలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గత ప్రభుత్వ అప్పులు తప్పులే తమ ప్రభుత్వానికి శాపమని, స్కామ్‌లో కోసమే స్కీమ్‌లు అమలు చేశామని చెబుతున్నారు. – ఇప్పటి వరకు రూ.9,74,556 కోట్ల అప్పులు తేలాయని, తవ్వితే ఇంకెంత ఉంటుందో అంటున్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా గత 5 ఏళ్లలో ఏ కార్యక్రమం కూడా చేయలేదని, అందుకే వృద్ధి రేటు తగ్గిందని నిందిస్తున్నారు. – మా ప్రభుత్వ హయాంలో పథకాలన్నీ పూర్తి పారదర్శకంగా డీబీటీ విధానంలో అమలు చేశాం. ఏకంగా రూ.2.74 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. మరి స్కామ్‌కు ఎక్కడ అవకాశం ఉంది?. అసలు బ్యాంక్‌ల ద్వారా నేరుగా డబ్బులు వెళ్లినప్పుడు ఎక్కడ తేడా వస్తుంది? అప్పులపై మళ్లీ అదే దుష్ప్రచారం: – రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఏకంగా రూ.14 లక్షల కోట్లకు చేరాయని ఎన్నికల ముందు కూటమి నేతలు అదేపనిగా దుష్ప్రచారం చేశారు. బడ్జెట్‌లో నికర అప్పును రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. ఇప్పుడేమో ఆ మొత్తం రూ.9,74,556 కోట్లు అని చెబుతున్నారు. – ఇంకెన్ని తవ్వుతారో తవ్వండి. మీరు చేసినా చేయకపోయినా కాగ్ వాళ్లు నెల నెలా అకౌంటింగ్ చేస్తారు. మీరింకా ఏం తవ్వుతారు?. ఇదీ ఆ లెక్క అట!: – పబ్లిక్ అకౌంట్ అప్పులు రూ.80,914 కోట్లు, కార్పొరేషన్ అప్పులు రూ.2,48,670 కోట్లు, సివిల్ సప్లై శాఖలో రూ.36 వేల కోట్లు, విద్యుత్ రంగంలో రూ.34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఆఫ్ వెండర్స్ (సప్లయర్స్) రూ.1,13,244 కోట్లు, ఉద్యోగులకు రూ.21,980 కోట్లు. – ఇవన్నీ కలిపి అప్పు రూ.9,74,556 కోట్లు అని, ఇది అబద్ధమని ఎవరు వచ్చినా లెక్కలు చూపించి గుంజీలు తీయిస్తాం అంటున్నారు. బడ్జెట్ ప్రతుల్లో ఏం చూపారు?: – ఇదే ప్రభుత్వం బడ్జెట్‌లో చూపిన ప్రభుత్వ నికర అప్పు రూ.6,46,531 కోట్లు. అందులో పబ్లిక్ ఎక్కౌంట్ కలిపిన రాష్ట్ర అప్పు రూ.4,91,734 కోట్లు, కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది రూ.1,54,797 కోట్లు. రెండూ కలిపితే మొత్తం నికర అప్పు రూ.6,46,531 కోట్లు. – ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా విద్యుత్ సరఫరా సంస్థల అప్పులు రూ.63,783 కోట్లు, విద్యుత్ సంస్థలు కట్టవలసిన బకాయిలు రూ.11,603 కోట్లు. మొత్తం ఇవన్నీ కలిపినా, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మొత్తం రూ.7,21,918 కోట్లు. – నిజానికి ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన అప్పు రూ.6,46,531 కోట్లు మాత్రమే. మిగతావి ప్రభుత్వానికి సంబంధం లేదు కాబ్టటి వాటిని మీరు రాయలేదు. రెండు ప్రభుత్వాలు–ఎంతెంత అప్పులు: – విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న అప్పు రూ.1,40,717 కోట్లు. అదే ఆ ప్రభుత్వం దిగిపోయే (2019) నాటికి చేరిన అప్పు రూ.3,90,247 కోట్లు – అంటే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 22.63 శాతం పెరిగింది. – 2019లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న అప్పు రూ.3,90,247 కోట్ల నుంచి, 2024 నాటికి రూ.7,21,918 కోట్లకు చేరింది. – అంటే మా ప్రభుత్వ హయాంలో పెరిగి అప్పు 13.57 శాతమే. అంటే మీరు మా కంటే దాదాపు 10 శాతం అప్పు పెంచారు. ఇది కాదని చెప్పగలరా? మా హయాంలో నికర అప్పుల్లో ఏది? ఎంత?: – 2018–19 నాటికి ఉన్న నికర అప్పు రూ.2,57,509 కోట్లలో.. ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా తీసుకున్న రుణం రూ.1,55,376 కోట్లు, కేంద్రం నుంచి పొందిన మొత్తం రూ.10,223 కోట్లు, ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పు రూ.15,393 కోట్లు, స్మాల్ సేవింగ్స్ నుంచి రూ.12,504 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ నుంచి రూ.16,583 కోట్లు, జీపీఎఫ్, పెండింగ్ అమౌంట్స్ రూ.47,429 కోట్లు. – అంతా కలిపితే రూ.2,57,509 కోట్లు. దీంట్లో ప్రావిడెంట్ ఫండ్ లేదా? అలాగే అది పబ్లిక్ అకౌంట్ కాదా? – అదే మేం దిగిపోయే నాటికి ఉన్న నికర అప్పు రూ.4,91,734 కోట్లు. అందులో ఓపెన్ మార్కెట్ లోన్లు రూ.3,66,564 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.28,138 కోట్లు, ఇతర సంస్థల నుంచి రూ.19,858 కోట్లు, స్మాల్ సేవింగ్స్ రూ.6,639 కోట్లు (అదే టీడీపీ టైమ్‌లో రూ.12,504 కోట్లు వాడారు), ప్రావిడెంట్ ఫండ్ రూ.29,791 కోట్లు, డిపాజిట్స్ అండ్ రిజర్వ్స్ రూ.40,741 కోట్లు. – అంతా కలిపితే రూ.4,91,734 కోట్లు. ఇందులో ప్రావిడెంట్ లేదా? కానీ మీరు ప్రావిడెంట్ ఫండ్ రూ.80,914 కోట్లు అదనం అంటున్నారు. అది తప్పు. మీరు ఉద్యోగుల నిధులు దారుణంగా వాడారు: – ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ కానీ, వారి ఇతర సేవింగ్స్ కానీ, ప్రభుత్వ జీవిత బీమా (జీఎల్‌ఐ) కానీ, ఇంకొకటి కానీ.. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో, 2014 నాటికి నికర అప్పు రూ.32,997 కోట్లు ఉంటే, అందులో 58 శాతం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. – అంటే 2014లో మీ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కానీ, వారి ఇతర సేవింగ్స్ కానీ, ప్రభుత్వ జీవిత బీమా (జీఎల్‌ఐ) తదితరాలకు సంబంధించి రాష్ట్ర నికర అప్పు రూ.19,138 కోట్లు. – అదే మీరు దిగిపోయే నాటికి ఆ మొత్తం రూ.76,516 కోట్లు. అంటే మీరు ఏకంగా రూ.57,378 కోట్లు, ఉద్యోగులకు సంబంధించిన నిధులు వాడారు. – అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కానీ, వారి ఇతర సేవింగ్స్ కానీ, ప్రభుత్వ జీవిత బీమా (జీఎల్‌ఐ) తదితరాలకు సంబంధించి రాష్ట్ర నికర అప్పు రూ.77,171 కోట్లు అయింది. – అంటే మీ హయాంలో ఉద్యోగుల డబ్బులు రూ.57,378 కోట్లు వాడితే, మా హయాంలో మేము వాడింది కేవలం రూ.655 కోట్లు మాత్రమే. మీరు మాకు ఆర్థిక నీతులు చెబుతున్నారు. – అయినా మా ప్రభుత్వం గ్యారెంటీ అప్పులు, కార్పొరేషన్ అప్పులు ఎక్కువ చేసిందని నిందిస్తున్నారు. పబ్లిక్ డెట్. సీఏజీ లెక్కలు: – పబ్లిక్ డెట్‌లో ఇంటర్నల్ డెట్, సెంట్రల్ లోన్.. రెండు రకాలు ఉంటాయి. మీ లెక్కల ప్రకారం అది మా హయాంలో రూ.4,91,734 కోట్లు. అంతకు ముందు చూపించిన రూ.4,29,525 కోట్లు తీసేస్తే వచ్చే పెరిగిన నికర పబ్లిక్ డెట్ రూ.68,360 కోట్లు. – అయితే ఇక్కడ అది రూ.59,164 కోట్లుగా ఉంది. – ఎందుకంటే ఆ అకౌంట్ గత మార్చి 31 నాటిది. మీరు ఇచ్చింది ఈ సెప్టెంబరు నాటికి. అంటే 6 నెలలు. అందుకే ఆ తేడా కనిపిస్తోంది. – అదే తేడా మొత్తం అప్పుల్లో కూడా కనిపిస్తోంది. గత మార్చి నాటికి ఉన్న అప్పులు రూ.4,86,151 కోట్లు కాగా, ఇప్పుడు ఈ బడ్జెట్‌లో ఆ మొత్తం రూ.4,91,734 కోట్లు. – ఇంకా సీఏజీ నివేదిక ప్రకారం, ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు రూ.1,54,797 కోట్లు. మేం చెబుతోంది కూడా అదే. మరి గుంజీలు ఎవరు తీయాలి. మీరే ఆలోచించండి. కార్పొరేషన్ల అప్పులు డబుల్ ఎంట్రీ: – ఆర్టీసికి వివిధ రాయితీల కింద ఇచ్చే మొత్తం ప్రభుత్వం ఇవ్వనప్పుడు, ప్రభుత్వ సూచన ప్రకారం కార్పొరేషన్ నేరుగా అప్పు చేస్తుంది. అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్, విద్యుత్ సంస్థలు కూడా. – ఆ మేరకు ఆర్టీసీ బ్యాంక్‌ల నుంచి రూ.36 వేల కోట్ల రుణం సేకరిస్తే.. దాన్ని డబుల్ ఎంట్రీ చేశారు. – అంటే అటు ఆర్టీసీ (కార్పొరేషన్) ఖాతాలోనూ, ఇటు ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన మొత్తంలోనూ (డబుల్ ఎంట్రీ), రెండూ కలిపి చూపారు. – అదే పని సివిల్ సప్లైస్ కార్పొరేషన్, విద్యుత్ సంస్థల రుణాల్లోనూ చూపడం ఎంత వరకు సబబు?. – అలాగే ప్రభుత్వ గ్యారెంటీలు చూస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఆ రుణం రూ. 1,51,568 కోట్లు. – కానీ మీ పుస్తకాల్లో కానీ, కాగ్ కానీ ఆ మొత్తాన్ని రూ.1,54,797 కోట్లు. ఆ తేడా ఎందుకంటే.. ఒకటి సెప్టెంబర్ ఎంట్రీ, ఒకటి మార్చి ఎంట్రీ కాబట్టి. ఎవరి హయాంలో అప్పు, వడ్డీ ఎక్కువ?: – 2014–15 నుంచి ఓపెన్ మార్కెట్ బారోయింగ్ అంటే మీరు రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎంత వడ్డీకి తీసుకున్నారనేది చూద్దాం. – 2014–15లో 8.49 శాతం వడ్డీ, 2015–16లో 8.3 శాతం, 2016–17లో 7.5 శాతం, 2017–18లోనూ 7.5 శాతం, 2018–19లో 8.5 శాతం వడ్డీతో రుణం పొందారు. – అదే మా ప్రభుత్వ హయాంలో వరుసగా 7.5 శాతం, 8 శాతం, 7.2 శాతం, 6.5 శాతం, 7 శాతం, 7.8 శాతంతో రుణం తీసుకున్నాం. – మరి ఎవరు తక్కువ రేటుకు తీసుకున్నారు? – అంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్ లో కూడా మీరు ఎక్కువ శాతం వడ్డీకి రుణం తీసుకున్నారు. మళ్లీ ఆర్థికంగా మాకు చిత్తశుద్ధి లేదని చెబుతారు. మీ బకాయిలు మేం చెల్లించాం: – ఇంకా మా ప్రభుత్వం దిగిపోతూ రూ.1,13,244 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టి పోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి అంత మొత్తం లేనే లేదు. – మీరు కూడా దిగిపోయేటప్పుడు వేలకోట్ల బకాయిలు పెట్టిపోతే.. అవన్నీ మేం చెల్లించాం. 2019 బడ్జెట్లో వాటిని చూపాం. – ఆ మేరకు కన్జూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైయ్స్ రూ.5,786 కోట్లు, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ రూ.180 కోట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రూ.264 కోట్లు, వ్యవసాయ శాఖ రూ.2,378 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ రూ.1,088 కోట్లు, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్స్ ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ రూ.2,840 కోట్లు.. ఇలా చూసి 42,183 కోట్లు సుమారుగా ఉన్నాయని చెప్పాం. – మీరు ఊర్కే రూ.1.13 లక్షల కోట్లు అంటున్నారు. ఊర్కే ఫిగర్ చెబితే సరా? ఆ లెక్కలు ఏవి? ఇదెంత అన్యాయం?: – పబ్లిక్ అకౌంట్ రూ.80 వేల కోట్లు డబుల్ ఎంట్రీ కలిపారు. మీరు రూ.36 వేల కోట్ల సివిల్ సప్లయ్స్, మరో రూ.34 వేల చిల్లర కోట్లు పవర్ డ్యూస్ డబుల్ ఎంట్రీ చేశారు. – ఇంకా మేం బకాయి పెట్టిపోయామంటూ రూ.1.13 లక్షల కోట్లు లెక్క చెబుతున్నారు. దానికి ఎక్కడా లెక్కాపత్రం లేదు. – ఇలా అన్నీ గోల్‌మాల్ లెక్కలన్నీ కలిపితే రూ.9.45 లక్షల కోట్లు అవుతుంది. ఎంత అన్యాయం ఇది? నికర అప్పులు రూ.6.46 లక్షల కోట్లు: – మేం క్లియర్‌గా చెబుతున్నాం. రాష్ట్ర నికర అప్పు రూ.6.46 లక్షల కోట్లు మాత్రమే. – దానికి కార్పొరేషన్ల గ్యారెంటీ రుణాలు తీసుకున్నా, మొత్తం రుణం రూ.7.21 లక్షల కోట్లు వస్తుంది. – మరి ఎక్కడ రూ.14 లక్షల కోట్లు.. ఎక్కడ ఈ రూ.7 లక్షల కోట్లు. అంత అన్యాయంగా ఎలా మాట్లాడుతున్నారు. కాగ్ కు వివరాలపైనా దుష్ప్రచారం: – కాగ్ కు మేము లెక్కలు ఇవ్వలేదట. ఆ పని మేము చేయకపోతే, ఈ రిపోర్టులు ఎలా వచ్చాయి? కాగ్ రిపోర్టులు మీరు ఎలా టేబుల్ చేశారు? మేం లెక్కలివ్వకుంటే మీరెలా టేబుల్ చేస్తారు? – కాగ్ కు లెక్కలు ఇవ్వాలా? వాళ్లే తీసుకుంటారు. వాళ్లే ఆడిట్ చేసేది, అకౌంట్స్ చేసేది. వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మనకేమైనా డౌట్లు ఉంటే వాళ్లను అడిగి ఇప్పించుకుంటాం. విద్యుత్ నష్టాలపైనా దుష్ప్రచారం: – విద్యుత్ రంగంలో రూ.1.29 లక్షల కోట్ల నష్టం అంట? అది వాస్తవమా? – వాస్తవానికి 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి విద్యుత్ రంగంలో డిస్కమ్‌లు రూ.6,625 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. – 2019 నాటికి ఆ మొత్తం ఏకంగా రూ.28,715 కోట్లకు చేరుకుంది. – 2022–23 నాటికి ఆ నష్టాలు రూ.29,110 కోట్లకు చేరాయి. – అంటే మీ 5 ఏళ్ల హయాంలో డిస్కమ్‌ల నష్టాలు రూ.22,089 కోట్లు పెరిగితే, మా హయాంలో ఆ పెరిగిన అప్పులు కేవలం రూ.395 కోట్లు మాత్రమే. – అంటే మా హయాంలో డిస్కమ్‌ల అప్పులు 34 శాతం పెరిగితే, మా ప్రభుత్వ హయాంలో పెరిగిన అప్పు కేవలం 0.3 శాతమే. – అదే విధంగా మొత్తం విద్యుత్ రంగ అప్పులు కూడా టీడీపీ హయాంలోనే పెరిగాయి. – రాష్ట్ర విభజన నాటికి రూ.29,552 కోట్లు ఉన్న విద్యుత రంగం అప్పులు 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏకంగా రూ.86,215 కోట్లకు చేరాయి. – అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం అప్పులు రూ.56,663 కోట్లు పెరిగాయి. – అదే మా ప్రభుత్వ హయాంలో పెరిగిన అప్పులు రూ.36,603 కోట్లు మాత్రమే. – అంటే టీడీపీ హయాంలో విద్యుత్ రంగం అప్పులు 24 శాతం పెరిగితే, మా హయాంలో కేవలం 7 శాతమే పెరిగాయి. ట్రూఅప్ ఛార్జీలు–వాస్తవాలు: – ట్రూ అప్ చార్జీలు..టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య డిస్కమ్‌ల అప్పులు రూ.6,625 కోట్ల నుంచి రూ.28,717 కోట్లకు పెరగ్గా, ఆ సంస్థలకు మొత్తం రూ.22,089 కోట్ల నష్టం వచ్చింది. – ఆ మొత్తాన్ని నిజానికి ట్రూఅప్ ఛార్జీల కింద వినియోగదార్లకు బదిలీ చేస్తారు. అందుకు ఏపీఈఆర్‌సీ కూడా అనుమతి ఇస్తుంది, – కానీ, మా ప్రభుత్వం కేవలం రూ.2,300 కోట్ల భారం మాత్రమే వస్తే.. అప్పుడు టీడీపీ, జనసేన నాయకులు నానా యాగీ చేశారు. – మా ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేశారు. 5 నెలల్లోనే రూ.18 వేల కోట్ల మోత: – మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే, 5 నెలల్లోనే రూ.6,072 కోట్లు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ వేస్తూ, ఛార్జీల మోత మోగించారు. – అది కాకుండా మరో రూ.12 వేల కోట్లు వేసేందుకు రెడీ అయ్యారు. ఇది నిజం కాదని చెప్పగలరా? ప్రభుత్వ కరెంటు బిల్లులు చెల్లించాం: – వివిధ అవసరాల (లిఫ్ట్ ఇరిగేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీలు వగైరా) కోసం ప్రభుత్వం వినియోగించే విద్యుత్‌కు సంబంధించి టీడీపీ ప్రభుత్వం 2014–19 మధ్య రూ.31,800 కోట్ల బిల్లులు ఉంటే, అప్పటి ప్రభుత్వం రూ.20,615 కోట్లు మాత్రమే కట్టి, రూ.11,634 కోట్లు బకాయిలు పెట్టారు. – మేము 2023 డిసెంబర్ వరకు లెక్కేసినట్లయితే మా దగ్గర అకౌంట్స్ ఉన్నంత వరకు రూ.68,000 కోట్లు కట్టాల్సినది ఉంటే రూ.62 వేల కోట్లు కట్టాం. – అంటే మీరు పెట్టిన బకాయి కూడా మేమే కట్టాం. మేం దిగిపోయే నాటికి కేవలం రూ.5,800 కోట్ల బిల్ పెండింగ్‌లో ఉంది మూలధన వ్యయం–వాస్తవం: – మూలధన వ్యయం సున్నా అంట. మొన్న బడ్జెట్ లో ప్రజెంట్ చేశారు. మీరిచ్చిన బుక్కులో చూద్దాం. ఎక్స్‌పెండిచర్ డ్యురింగ్ 2023–24 లాస్ట్ పేజీ.. రూ.23,330 కోట్లు మూల ధన వ్యయం జరిగింది. – కానీ, మీరేమో సింపుల్‌గా సున్నా అంటున్నారు. ఇది అసెంబ్లీ.. రికార్డుల మీద ఎలా చెబుతారు? తలసరి ఆదాయం–వాస్తవం: – తలసరి ఆదాయం (పీసీఐ) తగ్గిపోయిందట!. ప్రజల ఆదాయం తగ్గిందంట!. – మరి 2018–19 లెక్క.. ఇది ఎక్కడి నుంచి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (మాస్పీ) నుంచి వచ్చింది. – దాని ప్రకారం 2018–19లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,54,031. దేశంలో మన రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. – 2022–23కు వచ్చే సరికి తలసరి ఆదాయం రూ.2,19,881కి పెరిగి మనం 15వ స్థానానికి వెళ్లాం. – కానీ ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. పడుకున్న వాళ్లను లేపొచ్చు కానీ నటిస్తున్న వాళ్లను లేపలేం. ఏదో ఒకటి తేల్చుకొండి: – అసెంబ్లీ, కౌన్సిల్‌లో టీడీపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. యనమల రామకృష్ణుడు రూ.14 లక్షల కోట్ల అప్పు అంటాడు. సీఎం రూ.9.74 లక్షల కోట్లు అంటాడు. – ఎందుకీ గందరగోళం. మీటింగ్ పెట్టుకుని కూర్చుని ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. ప్రజలను ఇంతగా ఎందుకు సతాయిస్తారు? – ఇంకా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు మేము గ్యారెంటీ రుణాలు అపరిమితంగా రూ.2.23 లక్షల కోట్లు చేయలేదు. – నిజానికి మాకు ఆ పరిమితి ఉన్నా, చేసింది రూ.1.54 లక్షల కోట్లు మాత్రమే. ఇది వాస్తవం. ఎందుకీ అర్థం లేని మాటలు: – గత 5 ఏళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం జరిగిందని మాట్లాడారు. ఇప్పుడు ఆరు నెలల నుంచి మీరు ఉన్నారు కదా. ఎందుకు? ఏం అరాచకం జరిగిందో ఎందుకు చూపించలేకపోతున్నారు. – కేంద్ర ప్రభుత్వం నుంచి సరిగా తెచ్చుకోలేకపోయామని కేశవ్ మాట్లాడుతున్నాడు. మీరు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములు. 17 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సి ఉంటే మీరు కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు కొట్లాడతారు. – అందరితో కలుస్తుంటారు, అందరితో విడిపోతుంటారు. మీరు కేవలం రూ.4 వేల కోట్లే తెచ్చుకున్నారు. మేం ముఖ్యమంత్రిగా జగన్ గారు ప్రధానితో ఎంతో సఖ్యత మెయింటైన్ చేసి రూ.10,500 కోట్లు తెచ్చుకున్నాం. మీది గొప్పా? మాది గొప్పా? వైయస్సార్‌సీపీ హయాంలో ఆర్థిక పురోగతి: – కోవిడ్ వచ్చినా, వివిధ ఇబ్బందులు అయినా కూడా దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) మీ సమయంలో 4.47 శాతం ఉంటే, అది మా హయాంలో 4.83 శాతానికి పెరిగింది. – హయ్యర్ ట్యాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్.. కేంద్రం నుంచి అదనపు ట్యాక్సులు వచ్చాయంట. ఎక్కడి నుంచి వచ్చాయి? రెండు డివల్యూషన్లు ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటే కాదు కదా వచ్చినది? మొత్తం దేశానికి అంతా వచ్చింది. ఇందులో మీ ప్రత్యేకత ఏముంది? – చిక్కీకి పెండింగ్ అంట, మీరు కోడిగుడ్లకు పెండింగ్ పెట్టలేదా? ఇవి రన్నింగ్ బిల్స్, పెండింగ్ ఉండనే ఉంటుంది. – ఓవర్ బారోయింగ్... మేం ఎక్కువ అప్పు చేశామంట. ఎవరు చెప్పారు? నిజం చెప్పాలంటే 2016–17లో మీరు రూ.4,800 కోట్లు ఎక్కవ చేశారు. – 2017–18లో మీరు రూ.1,040 కోట్లు ఎక్కవ చేశారు. 2018–19లో మీరు రూ.10 వేల కోట్లు ఎక్కువ చేశారు. – అంతా లెక్కేస్తే వాస్తవానికి ఒక పరిమితి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా అప్పు చేయడానికి ఉండదు. మీరు రూ.16 వేల కోట్లు ఎక్కువ అప్పు చేశారు. మీ నిర్వాకం. మేం భరించాం: – పరిమితికి మించి మీరు చేసిన అప్పు బాధను మేం భరించాం. – 2016–17 నుంచి 2021–22 వరకు చూస్తే 17,531 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పు చేసింది. – 2019–20 నుంచి కట్ చేసి కోత వేస్తాం అన్నారు. అందులో రూ.16,418 కోట్లు మీరు చేసిన అప్పు. మీరు చేసిన పనికి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఎంటైర్ భారత దేశానికి ఈ రూల్ అప్లయ్ చేశారు. హామీల అమలు లేదు: – రూ.14 లక్షల కోట్లు అప్పు ఉన్నా కూడా సూపర్ సిక్స్.. అంటారు. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటే ఒకటి యువగళం. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేలు ఇవ్వాలి. ఎవరికైనా ఇస్తున్నారా? ఒక్క వ్యక్తికైనా ఇస్తున్నారా రాష్ట్రంలో? – తల్లికి వందనం అంటే బడికి పోయే ప్రతి పాపకూ, పిల్లవానికీ రూ.15 వేలు ఇవ్వాలి, ఎవరికైనా ఇంత వరకు ఇచ్చారా? – అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇవ్వాలి. ఎవరికైనా ఇచ్చారా? ఒక్కరికి కూడా ఇవ్వలేదు. – దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు మొన్న మొదలు పెట్టారు. అంటే మూడు సిలిండర్లలో ఒక సిలిండర్. దీన్ని అర్ధ దీపం అనాలా, పావు దీపం అనాలా? – ఆడబిడ్డ నిధి.. ప్రతి మహిళకూ నెలకు రూ.1500 చొప్పున సంవత్సరానికి 18 వేలు ఇవ్వాలి. ఒక్కరికైనా ఇంత వరకు అందిందా? – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారా? – ఈ సూపర్ సిక్స్ లో ఒక్క పావు దీపం తప్ప ఏవీ గ్రౌండ్ కాలేదు. 3 ఇప్పటికే గ్రౌండ్ చేశాం అంటున్నారు. పెన్షన్ సూపర్ సిక్స్ లో లేదు కదా. – అసెంబ్లీలో ఆన్ రికార్డు ఎలా చెబుతున్నారు ఇవన్నీ. ప్రభుత్వ ఆదాయం తగ్గింది: – ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలైంది. ఈ సెప్టెంబర్ 24 వరకు చూస్తే రూ.16,431 కోట్లు రాష్ట్ర ఆదాయం. – అదే గత ఏడాది సెప్టెంబరు (2023) వరకు, అంటే ఆ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలు చూస్తే రూ.13,818 కోట్లు. – అదే అంతకు ముందు ఏడాది, అంటే 2022లో తొలి ఆరు నెలలతో పోల్చి చూస్తే, ఏడాదిలో ప్రభుత్వ ఆదాయం 12.66 శాతం పెరిగింది. – అదే మీ హయాంలో తొలి ఆరు నెలల్లో ప్రభుత్వ ఆదాయం –8.78 శాతం. – ఒకవైపు ఆదాయం తగ్గితే, సంపద సృష్టిస్తామని ఎలా చెబుతున్నారు?. – పాతది కూడా చూస్తే 1999 నుంచి 2004 వరకు రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ రాబడి లెక్కేస్తే 12.4 శాతం పెరిగింది. – 2004 నుంచి 2009 వరకు రాజశేఖరరెడ్డి గారి హయాంలో 21.6 శాతం పెరిగింది. – 2009 నుంచి 2014 వరకు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 14.4 శాతం పెరిగింది. మీకంటే ఎక్కువే. – 2014–19 వరకు మీరున్నారు. మీరు సంపద సృష్టిస్తారు, బ్రహ్మాండమైన చిత్తశుద్ధితో పరిపాలన చేస్తారు కదా.కానీ రాష్ట్ర ఆదాయం పెరుగుదల కేవలం 6 శాతమే. – మాకు అసలు తెలివే లేదంటారు కదా. 2019–24 మధ్య 16.7 శాతం పెంచాం. – ఇవన్నీ మీ బడ్జెట్ డాక్యుమెంట్లు, కాగ్ లెక్కలే. మీ రైతు సాధికార సంస్థ తప్పు కాదా?: – ఆర్థిక మంత్రి కేశవ్ ఇంకో మాట అన్నారు. – ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పెట్టారు. అక్కడి నుంచి అప్పు తీసుకుని స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు ఇచ్చారని మాట్లాడారు. – మరి మీరు రైతు సాధికార సంస్థ అని పెట్టారు. అప్పు తీసుకున్నారు. ఆ అప్పు ద్వారా మీరు పంచారు మరి అది కరెక్టా? – అందుకే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు ఆన్ రికార్డు ఉన్నారు. చివరగా.. – పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. దయచేసి రాంగ్ ఫిగర్స్ మాట్లాడొద్దు. ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారు. ప్రజలు ఎల్లకాలం మోసపోరు. – కాబట్టి ఇకనైనా దుష్ప్రచారం, నిందలు ఆపండి. మీ వయసుకు, మీ స్థాయికి ఇది తగదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తేల్చి చెప్పారు.