ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల 

విజయవాడ: ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ... అన్ని సవాళ్లను అధిగమించి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ప్రప్రథమంగా ఫలితాలను విడుదల చేశామన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ఫలితాలను అనుకున్న సమయానికి విడుదల చేయడం చరిత్రాత్మకమన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకాలతో విద్యాశాఖలోని అధికారుల సమష్టి కృషితో ఇంటర్మీడియట్‌ ఫలితాలను విడుదల చేశామన్నారు. 

మార్చి 19వ తేదీన పేపర్‌ వాల్యూయేషన్‌ మొదలుపెడితే.. 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిందని, మే 11వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ పేపర్‌ వాల్యూయేషన్‌ పూర్తిచేశామన్నారు. నెలరోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేపర్‌ వాల్యూయేషన్‌ చేపట్టామన్నారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 59 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, ద్వితీయ సంవత్సరంలో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీనంబర్‌ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈమెయిల్‌ ఐడీ, వాట్సాప్‌ నంబర్‌ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. 

ఈ ఏడాది విద్యా వ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్యా సంస్కరణలు అందరికీ ఆదర్శంగా నిలవనున్నాయన్నారు. 
 

Back to Top