పార్టీ మారే ప్ర‌స‌క్తే లేదు 

నిరాధార క‌థ‌నాల‌ను న‌మ్మ‌వ‌ద్దు

మాజీ రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు

కార్య‌క‌ర్త‌లంతా క్షేత్ర స్థాయిలో పాల‌న సంబంధ వైఫ‌ల్యాలు వివ‌రించాలి 

సోష‌ల్ మీడియాను ఆయుధంగా చేసుకుని క్రియాశీల‌క రాజ‌కీయాల‌లో మాట త‌ప్పిన నైజాన్నీ, టీడీపీ స‌ర్కారు మోసాన్నీ ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి

శ్రీ‌కాకుళం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ కార్యాలయంలో విస్తృత స్థాయి స‌మావేశం  

శ్రీకాకుళం :    అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను టీడీపీ ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉందని, ఈ ప్రాంత అభివృద్ధిపై అస్సలు దృష్టి సారించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని మాజీ రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ఆవేదన చెందారు. స్థానిక వైఎస్సార్ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది కాలం పాలనలో కనీసం వెయ్యి కోట్లు కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి కేటాయించలేకపోయారు. ఆయనకు ఈ జిల్లా అభివృద్ధి పట్టడం లేదు. మీరంతా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. కానీ ఇది కూటమి  ప్రభుత్వం కాదు టీడీపీ ప్రభుత్వం అని మాత్రమే వ్యవహరించాలి. పవన్ కల్యాణ్ గారు గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నారు. బీజేపీ అయితే ఎన్నికలకు ముందే చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోతో మాకేంటి సంబంధం అని సభాముఖంగానే వాళ్ల నాయకులు సైడ్ అయిపోయారు. అంటే ఇది టీడీపీ ప్రభుత్వం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సింది ఎవరు ? అసలు మాట్లాడాల్సింది ఎవరు ? మీరు.. మీరు అంటే కార్యకర్తలు. సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకుని దాన్నొక  ఆయుధంగా చేసుకుని మీరంతా పనిచేయాలి. ముఖ్యంగా గుడ్ మార్నింగులు, గుడ్నైట్ లు చెప్పడం కాదు పార్టీ విధివిధానాలు, అలానే టీడీపీ పాలన సంబంధ వైఫ్యలాలు వీటి గురించి ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి. చాలా మంది వీటిపై ఇంకా దృష్టి సారించడం లేదు.

పాలన పరంగా ఆ రోజు నుంచి ఈరోజు వరకూ ఏడు దశాబ్దాలకు పైగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతం అన్యాయానికి గురి అవుతూనే ఉంది. మన దాహార్తి తీర్చే మన పంటలకు నీళ్లిచ్చే వంశధార ప్రాజెక్టు పూర్తికే యాభై ఏళ్లు పట్టిందంటే మీరంతా అర్థం చేసుకోవాలి. పాలకులకు మన ప్రాంతం అంటే ఎంతటి ప్రేమో అన్నది. అలానే ఆ రోజు కానీ ఈరోజు కానీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి దృష్టి సారించి ఆఫ్ షోర్, తోటపల్లి, నారాయణపురం వంటి ప్రధాన ప్రాజెక్టులకు నిధులు ఇచ్చింది వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి. వీళ్లిద్దరే ఈ ప్రాంతం కోసం నిధులు కేటాయించారు. 

ముఖ్యంగా మన పాలకులకు ఈ ప్రాంతంపై పట్టింపు లేదు అనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను వ్యక్తిగత విమర్శలు చేయను విధాన సంబంధం అయిన విమర్శలు మాత్రమే చేస్తాను. పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ కు పోటీ చేస్తా. లేదా నా బదులు మరొకరికి నాయకత్వం ఇస్తే వారికి మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తూ పనిచేస్తా. నేను పార్టీ మారుతానని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిజం కావు. 
నా సైన్యాన్ని వదిలి వాళ్లతో మాట్లాడకుండా రాజకీయ రంగంలో యుద్ధం ఎలా చేయగలను. మీరంతా ఒక్కసారి ఆలోచించాలి. మీరు ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలను చదవవద్దు. నిరాధార క‌థ‌నాలు న‌మ్మ‌వ‌ద్దు. వాటి కారణంగా  నిజానిజాలు తెలియవు. ఇవాళ ఒక్కో పత్రిక వెనుక ఒక్కో యాజమాన్యం ఉంది. వాళ్ల ఆలోచనలకు అనుగుణంగానే అవి నడుస్తున్నాయి.
ఆవిధంగా కాకుండా నిజానిజాలు తెలుసుకుని, నిర్థారించుకుని ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు కృషి చేయండి. నేను రాలేదు నేను రాలేదు అని  అనడం కాదు. నేను తప్పక వస్తాను. మీరు క్షేత్ర స్థాయిలో పనిచేయడం అన్నది ఎంతో ముఖ్యం. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో 1000 మందిని భాగం చేస్తే, ఎన్నికల నాటికి లక్ష మంది అవుతారు. ఆ రోజు సచివాలయ వ్యవస్థలో నిష్పక్షపాతంగా పోస్టింగులు ఇచ్చాం. కానీ ఇవాళ బదిలీల పేరిట ముడుపులు చెల్లిస్తే కానీ పని కావడం లేదు. ఆ రోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సచివాలయంలో ఉద్యోగ అవకాశం ఇచ్చాం. రాజకీయ అవినీతికి తావులేకుండా ఆ రోజు పనిచేశాం. కానీ ఇప్పుడు డబ్బులు చెల్లిస్తే కానీ బదిలీలు కావడం లేదు. డబ్బులు చెల్లించి పోస్టులు వేయించుకుంటున్న వైనం వెలుగు చూస్తోంది. ఎన్నికల ముందే చెప్పం వలంటీర్లు ఎవ్వరైనా టీడీపీకి ఓటు వేస్తే బోడి గుండు మిగులుతుంది అని..ఇవాళ అదే జరిగింది. ప్రజలను నిలువునా మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. 

జగన్ మరింత బలపడితే ఈ కూటమిలో ఉన్న నాయకులు రేపటి వేళ మనతో కలిసి వస్తారు. మీరంతా కలిసి పనిచేయండి. గ్రామాలలో పార్టీ బలోపేతానికి కృషి చేయండి. ఆ రోజు టీడీపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో ఏంటి అన్నది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. కనుక ఇందుకు అనుగుణంగా పనులు అవుతున్నాయా ? లేదా ? అన్నది గుర్తించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లండి. మీరు ఎంతమందిని చైతన్యవంతులను చేశారు.. క్షేత్ర స్థాయిలో పార్టీకి ఉన్న పట్టు ఎంత అన్నవి నివేదిక రూపంలో పార్టీకి అందజేయండి. అని మాజీ మంత్రి ధర్మాన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్, వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పరిశీలకులు కుంభ రవిబాబు, ఎమ్మెల్సీ నర్త రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు మెంటాడ పద్మావతి, గేదెల పురుషోత్తం, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, కార్యక్రమం అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు సాదు వైకుంఠరావు  తదితరులు పాల్గొన్నారు.

Back to Top