తాడేపల్లి: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను, సోషల్ మీడియా కార్యకర్తలను, ప్రజలను అక్రమంగా అరెస్టు చేస్తూ... కూటమి ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. పదే, పదే కోర్టులు అక్షింతలు వేస్తున్నా ప్రభుత్వం, పోలీసులు తమ తీరు మార్చుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని.. ప్రజా కోర్టులో తగిన శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... కోర్టులను ఖాతరు చేయని పోలీసులు... కూటమి ప్రభుత్వం ఇటీవల కాలంలో సోషల్ మీడియా కేసుల్లోనూ, వైయస్ఆర్‌సీపీ నాయకులు, సానుభూతిపరులు, చివరకు సామాన్య పౌరులుపైన రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయంగా జరుగుతున్న దాడులపై అనేక సందర్భాలలో కోర్టులు పలుమార్లు ప్రభుత్వానికి అంక్షింతలు, మెట్టికాయలు వేసింది. అయినప్పటికీ ప్రభుత్వం, దానికి వత్తాసు పలుకుకున్న పోలీసు వ్యవస్థ ఏమాత్రం స్పందించడం లేదు. హైకోర్టు హెచ్చరిస్తున్నా మరుసటి రోజే మరో నేరం చేస్తూ.. కోర్టులను కూడా లెక్క చేయమనే స్థాయికి చేరుకున్నారు. చివరికి పోలీసుల బరితెగింపు ఎంత పరాకాష్టకు చేరిందంటే... అన్యాయంగా గంజాయి కేసులు కూడా నమోదు చేస్తుంటే వాటిపై సీబీఐ విచారణ నియమించాల్సిన పరిస్థితి హైకోర్టుకు కలిగిందంటే రాష్ట్రంలో పాలన ఎంత అధ్వాన్నంగా జరుగుతుందో మనం స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్చే, స్వేచ్ఛగా నివసించే హక్కులను కాలరాసి పౌరులు భయం, భయంగా బ్రతికే పరిస్థితులు రాష్ట్రం కల్పిస్తుంటే జోక్యం చేసుకోవాల్సింది న్యాయస్థానాలే. సుప్రీం కోర్టు ఇటీవల ప్రొఫెసర్ జావెద్ అహ్మద్ అజామ్ కేసులో స్వేచ్ఛగా మాట్లాడ్డం, భావ వ్యక్తీకరణ చేయడం వంటి అంశాలపై పోలీసులుకు పాఠాలు చెప్పాల్సిన అవసరం వచ్చిందని తన తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొంది. భావ వ్యక్తీకరణ పై ఎంతవరకు నియంత్రణ ఉండాలి అనేది కూడా పోలీసులకు పాఠాలు తీసుకోవాల్సిన అవసరం దేశవ్యాప్తంగా ఉందని కూడా వ్యాఖ్యానించింది. ఎందుకంటే రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఒక అంశంపై అసమ్మతి, స్వేచ్చగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అసమ్మతి వివిధ రూపాల్లో తెలియజేసే హక్కు ఉంటుంది. కానీ ఇవాళ ఆ హక్కులన్నింటినీ కాలరాస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా.. వాళ్లు చేస్తున్న అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు నిరసనగా రాష్ట్రంలో ఎవరు నోరెత్తినా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బాలకృష్ణది నీచమైన బాష... తాజాగా రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు బాలకృష్ణ నీచమైన భాషను వాడారు. ఒక మాజీముఖ్యమంత్రిని రాయలేని భాషలో సంబోధిస్తే... పవిత్రమైన సభలో ఉన్న పెద్ద మనుషులు, ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న చంద్రబాబు, గౌరవప్రదమైన స్ధానంలో ఉన్న స్పీకర్ కూడా అది తప్పని, ఇలాంటి భాష వాడొద్దని వారించలేదు సరికదా వెకిలిగా, హేళనగా ఆ భాషను ప్రోత్సహించేలా ప్రవర్తించడం దారుణం. సభలో లేని వ్యక్తి మీద నీచమైన భాష మాట్లాడితే ఎవరూ ఖండించకపోవడం ఎలాంటి సంకేతాలు ప్రజలకు ఇస్తున్నారు. చివరకు ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇస్తుందంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించవద్దని, తప్పులను నిలదీయవద్దని, నిరసనలు చేయవద్దని చెబుతోంది. ఇవి ఏవి చేసినా కేసులు పెడతామని చెబుతోంది. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ మాట్లాడిన అభ్యంతరకమైన భాషపై రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో నిరసన తెలుపుతూ.. గతంలో ఆయన ఇంటిలో కాల్పుల ఘటన కేసుపైనా, కాకర్ల సుబ్బారావు చెప్పిన మాటలను చెబుతూ... మీకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారని చెబితే వాటిపైనా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాపై అక్రమ కేసులు పెడుతున్నారు.కాల్పులు ఘటన చోటుచేసుకున్న రోజు ఏం జరిగిందో వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. వాటన్నింటిపైనా కేసులు పెడుతున్నారు. పత్రికా స్వేచ్ఛనూ కాలరాస్తున్న ప్రభుత్వం... వైయస్.జగన్ ఏ పర్యటనకు వెళ్లినా అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు పోతే దాన్ని నియంత్రించడానికి ప్రభుత్వమే రోడ్లు తవ్వడానికి సిగ్గుండాలి. వైయస్.జగన్ ను చూడ్డానికి అభిమానులు వస్తే డ్రోన్ల సాయంతో వాళ్ల పోటోలు తీసి కేసులు నమోదు చేస్తున్నారు. ప్రత్యక్షంగా లేని నాయకులపైనా కేసులు పెడుతున్నారు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నేరుగా గ్రామాల్లోకి వెళ్లి వైయస్.జగన్ సమావేశాలకు వెళ్లొద్దంటూ బెదిరిస్తున్నారు. చివరకు పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై జరిగిన దాడులు చేస్తే.. దానికి నిరసనలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎక్కడా కేసులు నమోదు చేయలేదు. ప్రభుత్వ అన్యాయాలను వ్యతిరేకిస్తూ సాక్షితో పాటు వార్తలు రాస్తున్న పాత్రికేయులపై కూడా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి అత్యంత పరాకాష్టగా విజయవాడలో అర్ధరాత్రి సాక్షి కార్యాలయంపై దాడిచేసి, ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి, భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు తప్పుడు కేసు నమోదు చేశారు. ప్రజాస్వామిక విలువలను పరిరక్షించాల్సిన ప్రభుత్వం, పోలీసులూ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. న్యాయస్థానాలు తీర్పులను కూడా పట్టించుకోవడం లేదు. కోర్టు తీర్పులూ పట్టని పాలకులు- పోలీసులు... డజన్ల కొద్దీ హైకోర్టు మొట్టికాయలు వేసినా మారలేదు. వర్రా రవీంద్రరెడ్డిని అక్రమంగా అరెస్టు చేస్తే.. మీరు ఎప్పుడు నిర్భంధించారు?, ఎప్పుడు అరెస్టు చేశారు? స్పష్టంగా చెప్పండి అని అడిగితే.. స్థానిక ఎస్పీ దానికి సమాధానం చెప్పకపోతే మీరు కోర్టులకంటే ఎక్కువనుకుంటున్నారా ? ఎస్పీ పైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అని హైకోర్టు హెచ్చరించింది. ఇంకో సోషల్ మీడియా యాక్టివిస్టు బోసా రమణపై 30 అక్రమ కేసులు నమోదు చేశారు. తప్పుడు అరెస్టులు చేసి, అనేక చోట్ల నిర్భంధిస్తే.. హెబియస్ కార్పస్ వేసిన తర్వాత.. విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం జిల్లా ఎస్పీ రమణ అరెస్టుపై భిన్నమైన నివేదికలు ఇచ్చారు. దాని మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. డీజీపీ నివేదిక ఇస్తారని భావించాం. మీలో చలనం లేదు. మేం ఆదేశిస్తేనే ప్రొడ్యూస్ చేస్తారా ? అలా అయితే డీజీపీని కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించారు. అవుతు శ్రీధర్ రెడ్డి విషయంలో కూడా హైకోర్టు పౌరుల స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. ప్రేమ్ కుమార్ పై తప్పుడు కేసు పెడితే దానిలో కూడా హైకోర్టు తీవ్రంగా మందలించింది. తప్పు చేస్తే అరెస్టు చేయండి.. కానీ కేసులు పెట్టడానికే మీరు అరెస్టులు చేస్తున్నారని తప్పు పట్టింది. పోసాని కృష్ణ మురళీ గారి అరెస్టులో సుఫారీ కిల్లర్స్, కాంట్రాక్ట్ కిల్లర్స్, దేశద్రోహులు వంటి వారిపైన పెట్టాల్సిన కేసులు పెట్టారు. ఇది కోర్టు ధిక్కారమే అని కోర్టు హెచ్చరించింది. అదే విధంగా మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ విషయంలో చాలా దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరించింది. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులు అరెస్టు చేస్తూ.. దాదాపు 12 కేసులు నమోదు చేశారు. చివరికి ఆరేళ్ల కిందట జరిగిన సంఘటన అని అరెస్టు చేస్తే.. దానిపై హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఈ రకంగా పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛను హరించింది అని తప్పు పెట్టారు. మరోవైపు సివిల్ దుస్తులలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఇంటికి వెళ్లడం, తాజాగా సవీంద్రరెడ్డి అరెస్టు సమయంలో కూడా యూనిఫామ్ లేకుండానే అర్ధరాత్రి, అపరాత్రి రెక్కీ నిర్వహించి, ఇళ్లకు వచ్చి తలుపులు బద్దలు కొట్టి తీసుకుని పోతున్నారు. ఎవరు, ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియదు. గట్టిగా కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే తాడేపల్లి పోలీసులమని చెబుతున్నారు. తాడేపల్లి పోలీసులు మేము అరెస్టు చేయలేదని చెబుతారు. మరలా హెబియర్ కార్పస్ పిటిషన్ వేసేటప్పటికి ఎక్కడో అనంతపురం కోర్టులో హాజరు పరుస్తారు. ఇదీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి. వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలన్నీ హైకోర్టు పరిశీలించి అర్నేస్ కుమార్ తీర్పును మరోసారి పరిశీలించి మెజిస్ట్రేట్ లు, పోలీసులు ఏదానా కేసు పెట్టినప్పుడు నిశితంగా పరిశీలించి కేసులు పెట్టాలి. రిమాండ్ విధించడం తప్పనిసరైతే తప్ప 41 ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ పై విడుదల చేయాలని చెబుతూ.. సర్క్యులర్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు ఇంత సీరియస్ గా ఉన్నప్పటికీ పోలీసుల్లో మార్పు లేదు. తిరుపతిలో జరిగిన ఓ ఘటనలో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను వేధించన ఘటనపై కూడా కోర్టు తీవ్రంగా మందలించింది. కోర్టు సిబ్బందిపైనా పోలీసు దాష్టీకం... ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే నిన్నతాజాగా హైకోర్టులో డ్రైవర్ గాపనిచేస్తూ తన విధినిర్వహణలో భాగంగా హైకోర్టు జడ్జీలు నివసించే మంగళగిరి ప్రాంతంలో వివిధ కేసులకు సంబంధించి మరుసటి రోజు ఫైళ్లను తీసుకెళ్తున్న లక్ష్మీనారాయణ అనే డ్రైవర్ ను వేధించి, కొట్టి నోటికొచ్చినట్లు స్థానిక సీఐ దుర్భాషలాడారు. డ్రైవర్ ను , కోర్టు ఫైళ్లు ఉన్న వాహనాన్ని స్టేషన్ లో పెట్టి బంధించారు. అతడి ఫోన్ తీసుకుని అవసరమైతే జడ్జీలే ఫోన్ చేస్తారని అవహేళనగా మాట్లాడారు. చివరకు ఈ విషయం మిగిలిన డ్రైవర్ల ద్వారా విషయం తెలుసుకుని కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కేసు నమోదు చేశారు. అంటే జర్నలిస్టులు, న్యాయమూర్తులు ఎవరైనా పోలీసులుకు ఒక్కటే అన్నట్టు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఐ టీడీపీపై చర్యలేవి ? తాజాగా మరలా సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చట్టాలు ద్వారా తప్పు చేసిన వారిని శిక్షిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. సోషల్ మీడియా అంటే కేవలం వైయస్ఆర్‌సీపీ ఒక్కటే కాదు. మీ ఐటీడీపీని కూడా ఓసారి చూడండి. మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఏం అబద్దాలు ప్రచారం చేస్తున్నారో.. ఎన్ని అశ్లీల ఫోటోలు, అసభ్య పదజాలంతో ఎంత మంది నాయకుల కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారో చూడండి. విదేశాల్లో మీరు రిక్రూట్ చేసుకున్న వారు ఫోర్న్ స్ధాయిలో అశ్లీల పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. మరలా అసెంబ్లీలో ముఖ్యమంత్రి, హోంమంత్రి, మంత్రివర్గ సభ్యులు అంతా మరలా చట్టాన్ని, న్యాయాన్ని పరిరక్షించే వ్యక్తులుగా నీతులు చెబుతున్నారు. మీరు విధ్వంసం చేస్తారు, వైయస్.జగన్ విధ్వంసం అని చెబుతారు. మీది రెండు నాల్కుల వ్యవహారం. అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పినదానికి కట్టుబడి.. అన్ని పార్టీల సోషల్ మీడియాల్లో అశ్లీల కంటెంట్ ఉంటే వారిపై చర్యలు తీసుకుంటారా? అలా కాకుండా మీ ఐటీడీపీ ద్వారా వైయస్ఆర్‌సీపీ నాయకులు, వారి కుటుంబసభ్యులమీద విషప్రచారం చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడయా పై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మీరు టార్గెట్ పెట్టుకున్న వైయస్ఆర్‌సీపీ వ్యక్తులపై తప్పుడు కేసులు బనాయిస్తూ... బయటకు మాత్రం నీతి కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఐటీడీపీ పేరుతో మీరు నిర్వహిస్తున్న ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను మూసివేసి అప్పుడు మాట్లాడండి. నీతి లేని పచ్చ రాతలు.... స్కూటర్లు, బైక్ లు, కార్లకు వైయస్.జగన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లు వేసుకుంటే అడ్డం చెబుతున్నారు. చివరకు మీరు, మీ పచ్చ పత్రికల్లో వాడే భాష కూడా అత్యంత జుగుప్సాకరం. మీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే కార్యకర్తలని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులనైతే వైకాపా మూకలని, చంద్రబాబుది నివాసం మాత్రం ఇళ్లు అని, వైయస్.జగన్ గారి నివాసమైతే ప్యాలస్ అని అత్యంత నీచంగా రాస్తారు. వైయస్.జగన్ ప్రభుత్వంలో అప్పులు చేసి.. రాష్ట్రాభివృద్దికి అవసరమైన పోర్టులు, మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తూ.. డీబీటి ద్వారా ప్రజా సంక్షేమం కోసం వాడితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు. ఇవాళ కేవలం 15 నెలల్లోనే విపరీతంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తుంటే... దానికి మాత్రం పచ్చమీడియా రుణసమీకరణ అని ముద్దుపేరుతో రాస్తారు. ఇదా మీ నీతి ? మీ నిజ స్వరూపాన్ని, మీ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియాపై పెద్ద సంఖ్యలో అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేదిలేదు, వెనక్కి తగ్గేది లేదు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమని మనోహర్ రెడ్డి హెచ్చరించారు.