అనంతపురం: నగరంలో నకిలీ సర్టిఫికెట్‌లతో పనులు చేపడుతున్న రుద్ర ఇన్ఫ్రా సంస్థపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ మేయర్ మహమ్మద్ వసీం డిమాండ్ చేశారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు సంచలన ఆరోపణలు చేశారు. రుద్ర ఇన్ఫ్రా సంస్థ నకిలీ పత్రాలతో పనులు చేపడుతోందని, ఈ విషయాన్ని టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ సమాచార హక్కు చట్టం ద్వారా బయటపెట్టారని తెలిపారు. సాధారణంగా క్లాస్-5 కాంట్రాక్ట్ పనుల అనుభవంతో క్లాస్-3 కాంట్రాక్టర్‌గా గుర్తింపు లభిస్తుందని, అయితే ఎలాంటి అనుభవం లేకుండానే రుద్ర ఇన్ఫ్రా పనులు చేపడుతోందని విమర్శించారు. దీంతో ఆ సంస్థ చేపడుతున్న పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్ & బీ ఎస్ఈ కూడా ఆ సంస్థకు గుర్తింపు ఇవ్వలేదని లేఖ ఇచ్చినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.3 కోట్ల పనులు ఆ సంస్థకు కేటాయించారని ఆరోపించారు. కనీస పత్రాల పరిశీలన లేకుండానే అధికారులు పనులు అప్పగించడం దురదృష్టకరమన్నారు. సదరు సంస్థ స్థానిక ఎమ్మెల్యే సన్నిహితులదనే ప్రచారం ఉందని, ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహించడం తగదని వసీం విమర్శించారు. అనంతపురం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి ఇలాంటి సంస్థల ద్వారా వ్యక్తిగత అభివృద్ధి జరుగుతోందని ఎద్దేవా చేశారు. నగరంలోని పలు రోడ్డు పనులపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ, నీరు-ప్రగతి పార్క్ రోడ్, రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ రోడ్ వంటి పనులు ఎవరికిచ్చి, ఎవరు నిర్వహిస్తున్నారో పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని అన్నారు. అలాగే శ్రీనగర్ కాలనీలో ఎమ్మెల్యే ఇంటి ముందున్న రోడ్డు మూడు నెలలుగా ఎందుకు నిలిచిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు నకిలీ సర్టిఫికెట్‌లతో ఉన్న సంస్థలకు పనులు ఇస్తే వారి గుడ్‌విల్ దెబ్బతింటుందని, నాసిరకం పనుల కారణంగా బ్లాక్‌లిస్ట్‌లో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేపై తరచూ దందాలు, దౌర్జన్యాలు, కబ్జాల ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికైనా మారాలని సూచించారు. తాము చేసే ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయని, ఎమ్మెల్యే కూడా తమపై చేసే ఆరోపణలను సాక్ష్యాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, రుద్ర ఇన్ఫ్రా సంస్థ చేపడుతున్న పనులను నిలిపివేసి విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే నకిలీ సర్టిఫికెట్‌లు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రుద్ర ఇన్ఫ్రా, వైన్స్, రుద్ర యాడ్ ఏజెన్సీల పత్రాలను సమగ్రంగా పరిశీలించాలని, అధికారులు ఇలాంటి సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలపై ప్రజల పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని వసీం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాసులు, కమల్ భూషణ్, పార్టీ నాయకులు కాకర్ల శీనా తదితరులు పాల్గొన్నారు.