చీకటి జీవోను త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాలి

ఎస్వీ యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం ఎదుట వైయ‌స్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన

తిరుప‌తి:  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించొద్దని కూటమి ప్రభుత్వం జారీ చేసిన చీక‌టి జీవోను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటీ అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎదుట వైయ‌స్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా చెవిరెడ్డి హ‌ర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పదిహేను నెలల్లోనే విద్యారంగాన్ని పూర్తిగా నీరుగార్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతం అవుతాయనే భయంతోనే విద్యార్థి సంఘాలని ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి  రాకుండా చీకటి ఉత్తర్వులిచ్చిందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహించిన లోకేష్.. నేడు ఇలాంటి ఉత్తర్వులివ్వడం ఏంటని ప్రశ్నించారు. పాఠశాలల్లో విద్యార్థులకిచ్చిన  బ్యాగులు నెల రోజుల్లోనే చిరిగిపోయాయి. మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉన్నది. ఆంగ్ల బోధన అటకెక్కింది. సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయుల్ని కుదించి పాఠశాలల్ని రద్దు చేసింది. నాడు, నేడు రద్దు చేసి పాఠశాలల్ని  నీర్వీర్యం చేసింది.  ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కనీస వసతుల్ని కల్పించలేదు. ఇలాంటి సమస్యలన్నీ విద్యార్థి సంఘాల దృష్టికి వస్తాయనే లోకేష్ ఉత్తర్వులిచ్చారని విమర్శించారు. విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలే అని గుర్తు చేశారు. విద్యాసంస్థలు, హాస్టల్ లో విద్యార్థి సంఘాలు వెళ్ళకుండా నిషేధం అమలు చేస్తూ జీవో ఇవ్వడం స‌రికాద‌ని హెచ్చ‌రించారు.

Back to Top