స‌ర‌స్వ‌తి ప‌రిస్థితిని విని చ‌లించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

క్యాన్స‌ర్ బాధితురాలికి రూ.3 లక్ష‌ల స‌హాయం అందించాల‌ని సీఎం ఆదేశం

సాయంత్రం క‌ల్లా బాధితురాలికి చెక్కు అంద‌జేత‌

విజ‌య‌న‌గ‌రం: ప‌లు అభివృద్ధి ప‌నులు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌ల నిమిత్తం జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా ప‌లు ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ త‌మ కుటుంబ‌ దీన‌స్థితిని విన్న‌వించుకున్న ఎంద‌రో అభాగ్యుల‌కు ఉదారంగా స‌హాయం అందించి ఆదుకుంటున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం విజ‌య‌న‌గ‌రం జిల్లా మెంటాడ మండ‌ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మాన‌వ‌తా హృద‌యంతో మ‌రో మ‌హిళ‌కు ఆర్థిక స‌హాయం అందించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌రివిడి మండ‌లం బిల్ల‌ల‌వ‌ల‌స పంచాయ‌తీ కొండ‌దాడి గ్రామానికి చెందిన క‌న్నూరు స‌ర‌స్వ‌తి(34)ది ఒక విషాద‌గాథ‌. ఆమె త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ క్యాన్స‌ర్ వ్యాధితోనే మృతి చెందారు. ఆమెకు నా అనుకునేవారెవ‌రూ లేరు. పైగా గ‌త ఐదేళ్లుగా గొంతు క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతూ వైయ‌స్‌ఆర్ ఆరోగ్య‌శ్రీ కింద చికిత్స పొందుతోంది. 

ఎలాంటి జీవ‌నాధారం లేక‌పోవ‌డంతోపాటు క్యాన్స‌ర్ వ్యాధితో ఆమె ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారై రోజు గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి పింఛ‌న్‌ పొందేందుకు నిబంధ‌న‌ల ప్ర‌కారం అవ‌కాశం లేక‌పోవ‌డంతో త‌న‌కు ప్ర‌భుత్వ ప‌రంగా ఏదైనా స‌హాయం అందించి త‌న‌ను ఆదుకోవాల‌ని శుక్ర‌వారం మెంటాడ మండ‌లం చిన‌మేడ‌ప‌ల్లిలో కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం శంకుస్థాప‌నం కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరింది. ఆమె ప‌రిస్థితిని విని చ‌లించిన ముఖ్య‌మంత్రి త‌క్ష‌ణ‌మే రూ.3 లక్ష‌ల ఆర్ధిక స‌హాయం ప్ర‌క‌టించారు. ఆమెకు వెంట‌నే స‌హాయం అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మిని ఆదేశించారు.

జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో రూ.3 లక్ష‌ల మొత్తాన్ని ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి నుంచి మంజూరుచేస్తూ రెవెన్యూ అధికారులు చెక్కును సిద్ధంచేసి విద్యా శాఖ‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేతుల మీదుగా శుక్ర‌వారం స‌హాయం అంద‌జేశారు. ముఖ్య‌మంత్రికి క‌న్నూరు స‌ర‌స్వ‌తి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ స‌హాయాన్ని జీవితాంతం మ‌రువ‌లేన‌ని, త‌న‌కు ముఖ్య‌మంత్రిని క‌లిసే అవ‌కాశం క‌ల్పించిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

Back to Top