ఈనెల 4న పోల‌వ‌రానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

కేంద్ర‌మంత్రి షెకావ‌త్‌తో క‌లిసి ప్రాజెక్టు ప‌నులు ప‌రిశీల‌న‌

తాడేప‌ల్లి: ఈనెల 4న కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌తో కలిసి పోలవరం జాతీయ ప్రాజెక్టు పనుల పురోగ‌తిని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించనున్నారు. 4వ తేదీ ఉదయం తాడేప‌ల్లి నుంచి హెలీకాప్టర్‌లో ఇరువురు పోలవరానికి చేరుకుని.. ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. అక్క‌డి అంశాల ఆధారంగా కేంద్ర జల్‌ శక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి షెకావత్, సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు స‌కాలంలో పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్ర‌మంత్రిని సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2017–18 ధరల ప్రకారం ఆమోదం తెలిపిన సవరించిన అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌) ఇచ్చి, నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. పెండింగ్‌లో ఉన్న డిజైన్‌లను యుద్ధప్రాతిపదికన ఆమోదించేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేయనున్నారు. 

Back to Top