ప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా

ప్రతి ఇంటికి సంక్షేమం అందాలంటే మళ్లీ మీ జగనే రావాలి

ప్రొద్దుటూరులో  భారీ బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
 
ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు

చిన్నాన్నను చంపారు.. నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారు

పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా?

మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు!

మే 13న ఫ్యాన్‌ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించేందుకు  మీరంతా సిద్ధమేనా?

ఆ దేవుడు, ప్రజల్నే నమ్ముకున్నా.. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా:  వైయ‌స్ జ‌గ‌న్‌

ప్రతి ఇంటికి రేషన్‌ రావాలంటే మళ్లీ జగనన్నే రావాలి

పేదల భవిష్యత్‌ బాగుండాలంటే మళ్లీ మీ జగనన్నే రావాలి

మీరే నాకు స్టార్‌ క్యాంపెయినర్లు

ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని చెప్పాలి

గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ బాగుపడాలన్నా మళ్లీ జగన్‌ను గెలిపించండి

జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం

నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు పడాలన్నా జగన్ననే ముఖ్యమంత్రి అవ్వాలి

చంద్రముఖి చెడద పోవాలంటే ఫ్యాన్‌ గుర్తుపై ఓటేయాలి:  వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్ జిల్లా:  త‌న ఒక్క‌డిపై యుద్ధానికి ప్ర‌తిప‌క్షాల‌న్నీ కలిసి కట్టుగా వస్తున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు. వైయ‌స్ వివేకానంద‌రెడ్డి చిన్నాన్నను చంపారు.. నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారని మండిప‌డ్డారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.   

వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు.  చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ, నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తపించిపోతున్న ఒకరిద్దరు నావాళ్లు భాగం అయ్యారు. 

ఇంతటి దారుణం చేసి.. నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా.. నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెబుతున్నా. 

నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు.  అందరూ కలిసి జగన్‌పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాం‍్గరెస్‌ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. కానీ, నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా, దేవుడి దయ ఉన్నాయి. విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...: 

వైయస్ఆర్ జిల్లా నేల మీద, ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని, ఎవరెన్ని కష్టాలు పెట్టినా,ఎన్ని వ్యవస్థల్ని నామీద ఉసిగొల్పినా కూడా నా వెన్నంటి ఉండి, నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైయస్ఆర్  జిల్లా కుటుంబ సభ్యులకు, మీ అభిమానానికి, మీ ఆదరణకు మీ జగన్‌ శిరస్సు వంచి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. 

ఈ రోజు నాముందు కనిపిస్తున్నది.. బహుశా ఈ జిల్లాలోనే ఇంత పెద్ద మీటింగ్‌ జరిగి ఉండదేమో. ఈ రోజు ఒక మహాసముద్రం ఇక్కడ ఈ జిల్లాలో కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికి, ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రకు ముందు వరుసలో మన వైయస్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ జెండా తలెత్తుకుని ఇక్కడే ఎగురుతోంది.  

అధికారాన్ని పేదల భవిష్యత్‌ కోసం, రైతుల కోసం, అక్కచెల్లెమ్మల కోసం, అవ్వాతాతల కోసం, భావితరం పిల్లల కోసం, మన గ్రామాల కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారు పేరుగా మార్పులు తీసుకుని రావడమే కాకుండా ఏకంగా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్లు.. ఎక్కడా కూడా లంచాలు లేకుండా, వివక్షకు తావులేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వ ఎజెండా... ఇక్కడ కనిపిస్తున్న మన జెండా.

*ఈ జెండా మరే జెండాతోనూ జత కట్టడం లేదు...*
కాబట్టే చెబుతున్నా, ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది. కాబట్టే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఈరోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ, 2024 ఎన్నికల సమరానికి సిద్ధం.. సిద్ధం.. అని ఈరోజు అంటున్నాయి.
కాబట్టే ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు. ప్రజలే ఎజెండాగా ఈ రోజు ఈ జెండా రెపరెపలాడుతోంది. ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన.. చరిత్రలో చిరస్థాయిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

*మీ అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు...*
మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా గర్జించండి. పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డు పడుతున్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించే ఈ ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణులైన మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని ఈ సందర్భంగా చెబుతున్నాను. 

మే 13న ఫ్యాను మీద రెండు ఓట్లు వేసి, మరో 100 మందికి చెప్పి వేయించి, మనందరి పార్టీని గెలిపించడానికి, అభివృద్ధి నిరోధకుల్ని, పేదల వ్యతిరేకుల్ని ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. 

*48 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో– గెలుపే లక్ష్యంగా...*
మరో 48 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గెలుపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి. మనకు పోటీగా ఉన్నది.. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చెప్పేవాళ్లు. అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్లందరూ ఏకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ చంద్రబాబు బృందానికి, ప్రజలకు అన్యాయం చేయడంలో, నమ్మించి ప్రజల్ని నట్టేట ముంచడంలో ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడుకు 45 ఏళ్ల అనుభవం ఉంది. 

*మోసాలు, అబద్దాల్లో బాబుది 45 ఏళ్ల అనుభవం...*
మోసాలు చేయడంలోనూ, అబద్ధాలు చెప్పడంలోనూ, వెన్నుపోటు పొడవడంలో, కుట్రలు, కుత్రంతాల్లో 45 ఏళ్ల అనుభవం ఉంది ఈ పెద్దమనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలా పడేయటంలో కూడా ఈ పెద్దమనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. 

ఎన్నికలప్పుడు మాత్రమే బాబుకి మేనిఫెస్టో గుర్తుకొస్తుంది. రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే  మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు. ఈరకంగా 14 సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నారు. 

వీరికి కుట్రలు, కుతంత్రాలే కాదు.. మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలతో గోబెల్స్‌ ప్రచారమే కాదు.. కుటుంబాలను చీల్చడంలో కూడా బాగా అనుభవం ఉందని మీరందరూ చూస్తున్నారు.
ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు. మా చిన్నాన్న గారిని( మా బాబాయిని) వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో? ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజూ కనిపిస్తానే ఉంది. 

ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో కూడా మీరంతా రోజూ చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుని మరీ మద్దతిస్తున్నది ఈ చంద్రబాబు, ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. 
వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తపించిన పోతున్న ఒకరిద్దరు నా వాళ్లు. వీరంతాకూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా మద్దతిస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతున్నాను. 

చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే దాని అర్థం ఏమిటి? ఇంతటి దారుణం చేస్తూ .. దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయం అని వారికి వారే చెబుతున్నారంటే ఇది కలియుగం కాకపోతే ఇంక ఏమిటి? అంటున్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చుని, ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా? ప్రజల మద్దతు లేని బాబు.. చేస్తున్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని ఈ సందర్భంగా గర్వంగా చెబుతున్నాను. 

*ఆ దేవుడు, ప్రజలనే నమ్ముకున్నాను..*
ఆ దేవుడు, ఆ ప్రజలు .. వీళ్లిద్దరినే నేను నమ్ముకున్నాను. ధర్మాన్ని, న్యాయాన్ని వీటి రెండింటినే నేను నమ్ముకున్నాను. ఈరోజున నన్ను, మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్న వారికి, ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. మనకు వంచించిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు మనలో. తేడా గమనించమని అడుగుతున్నాను. 

వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్‌. మేనిఫెస్టో ఇచ్చి కనీసం 10 శాతం వాగ్దానాలు కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు. కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా, ఒక భగవద్గీతగా.. ఇంత త్రికరణ శుద్ధిగా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది. తేడా గమనించమని కోరుతున్నాను. 

మరో విషయం కూడా చెబుతున్నాను. ఈ మధ్య కాలంలోనే ఈ విషయం పేపర్లు, టీవీల్లో ప్రత్యర్థులు.. వాళ్ల వాళ్ల ఎల్లో మీడియాలో చూపిస్తున్నారు కాబట్టి చెబుతున్నాను. 

ఎక్కడో బ్రెజిల్‌ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదినగారి చుట్టం.. తన కంపెనీకి డ్రై ఈస్ట్‌ పేరుతో డ్రగ్స్‌ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే ఈ మధ్య కాలంలోనే సీబీఐ వాళ్లు రెయిడ్‌ చేశారు. ఈ రెయిడ్‌ జరిగింది అని తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్‌ అందరూ ఉలిక్కి పడ్డారు. వారి బ్రదర్‌ దొరికిపోయాడని తెలిసిన వెంటనే... దొరికితే తమ బ్రదర్‌ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్‌ అని మన మీద నెట్టేయడానికి క్షణాల్లోనే వీళ్లంతా రెడీ అయిపోయారు.

తీరా చూస్తే వారు ఎవరయ్యా అని అంటే.. సాక్షాత్తూ మన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబునాయుడుగారి వదినమ్మగారి కొడుకు వియ్యంకుడు, ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు. బాబు బంధువులు, ఆత్మ బంధువులు. బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్లందరికీ బంధుత్వాలు ఉన్నాయి. 

నేరమంటూ జరిగితే అది చేసింది వారు. తోసేది మనమీద. ఎక్కడన్నా నేరం జరిగినా.. ఎక్కడన్నా, ఏదైనా జరిగినా...  బురదచల్లడానికి మాత్రం.. ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు వెంటనే రెడీ అవుతారు. వీరిద్దరికీ ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడవుతారు. వీళ్లంతా ఓ ఎల్లో బ్యాచ్‌ తయారయిపోయి నేరమంటూ జరిగితే అది చేసింది వారు అయితే, తోసేది మాత్రం మన మీద. 

ఇదే చంద్రబాబు, ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుత్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తున్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్లు. దొరికితే మాత్రం వెంటనే వైయస్ఆర్  సీపీ వాళ్లు అవుతారు. బతికి ఉంటే వివేకానందరెడ్డి గారు శత్రువు. ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్‌ ను వీరే వెన్నుపోటు పొడిచి చంపేస్తారు. చనిపోయాక వీళ్లే ఎన్టీఆర్‌ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండులు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి. వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

*వీరు వీరి రాజకీయాలు చూస్తే– ఛీ అని...* 
నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు, ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు ఛీ అనిపించడం లేదా అని అడుగుతున్నాను. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది.. పొద్దున్నే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతోందని ఒకసారి చూస్తాను. ఎందుకంటే మనల్ని తిట్టేవాళ్లను మనం వినాలి, చూడాలి కాబట్టి. చూసిన తర్వాత ఛీ.. ఇదొక పేపరా అని రోజూ పక్కన పడేయాల్సిన పరిస్థితిలోకి పోతోంది. ఈ రాజకీయాలను చూస్తే... ఛీ అనిపించడం లేదా అని చెప్పి ఆ ఈనాడును, ఆంధ్రజ్యోతిని, టీవీ5ను, చంద్రబాబును, దత్తపుత్రుడిని అంటున్నాను. నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతోంది. 

వీళ్లందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగా ఒక పార్టీని తెచ్చుకున్నారు. పరోక్షంగా ఇంకో పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్‌ మీద.. ఒక్క జగన్‌ మీద యుద్ధం చేస్తున్నారు. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌.. ఇంత మంది ఏకమై . . వీళ్లంతా సరిపోవడం లేదని చెప్పి.. నా చెల్లెళ్లను ఇద్దర్నీ కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంత మంది ఏకమై యుద్ధం చేస్తున్నది కేవలం ఒకే ఒక్కడి మీద. 

ఇంత మందిని ఒకే ఒక్కడు ఇంతగా భయపడించాడు అంటే.. ఈ ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ కూడా లేదంటే.. కారణం.. ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక సత్యం. 

ఈ 75 ఏళ్ల బాబును చూడండి. తన మేనిఫెస్టోలోఇచ్చిన వాగ్దానాలు.. బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో ఎక్కడ ఉంటుందంటే వెతుక్కోవాలి. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తారు. టీవీల్లో, పేపర్లలో అడ్వర్టైజ్‌ ుమెంట్లు ఇస్తారు. ఇంటింటికీ పాంపెట్లు కొట్టి పంపిస్తారు. ఎన్నికలు అయిపోయినాక  చంద్రబాబుది మేనిఫెస్టో ఎక్కడ ఉందంటే కనిపించదు. వెబ్‌ సైట్లలో కూడా లేకుండా మాయం చేస్తారు. పొరపాటున ఆ మేనిఫెస్టో ప్రజలకు మళ్లీ గుర్తుకొస్తే చంద్రబాబు నాయుడు గారిని కొడతారేమో అని భయం. 

*చంద్రబాబు–రొటీన్‌ వంచన.*
నిజంగా ఇదొక రొటీన్‌ వంచన. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మరో కొత్త మేనిఫెస్టోను తీసుకొస్తారు. మళ్లీ కొత్త వాగ్దానాలు ఇవే చెప్పుకుంటూ పోతారు. గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏ మాత్రం సిగ్గు లేకుండా గతంలో ఉన్న ఇష్యూస్‌ అదే మాదిరిగా ఉన్నా కూడా మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ జతకడతారు. ఢిల్లీదాకా వెళ్లి కూడా కాళ్లు పట్టుకుంటారు. ఇవీ.. వీరి రాజకీయ విలువలు. 

ఆలోచన చేయమని అడుగుతున్నాను. విశ్వసనీయత లేని, విలువలు లేని వీరు చేసే రాజకీయాలు నిజంగా ఎవరికి స్పూర్తిదాయకం అని ఆలోచన చేయమని కోరుతున్నాను. 

*మీ బిడ్డ ప్రభుత్వం– 58 నెలల్లో....*
మరోవంక మీ బిడ్డ ప్రభుత్వం ఈ 58 నెలల్లోనే గతంలో ఎప్పుడూ రాష్ట్రంలో జరగని విధంగా, చూడని విధంగా, చరిత్రలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఏం చేసిందో క్లుప్తంగా చెబుతాను. 

*ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ....*
మీ జగన్‌ పాలనలో, మీ బిడ్డ పాలనలో... ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం.. ఏ గ్రామాన్నయినా, పట్టణాన్ని అయినా తీసుకోండి. ఆ గ్రామానికి వెళ్లి నాలుగు అడుగులు వేస్తే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. పట్టణాల్లో అయితే వార్డు సచివాలయం కనిపిస్తుంది. ఎవరు పెట్టారు ఆ సచివాలయం అని ఎవరిని అడిగినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్‌. చేసింది మన వైయస్ఆర్  సీపీ పార్టీ. జరిగినది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని గర్వంగా చెబుతున్నాను. 

ఆ సచివాలయాల్లోనే దాదాపు 10 మంది మన పిల్లలే ఉద్యోగస్తులు. మన తమ్ముళ్లు, చెల్లెల్లే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. వారిని చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్‌. మన వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ. అది జరిగిందీ ఈ 58 నెలల కాలంలోనే. 

ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో.. గతంలో ఎప్పుడూ జరగలేని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా... ఒకటో తేదీ సెలవుదినమైనా, ఆదివారమైనా తెల్లవారకముందే చిక్కటి చిరునవ్వుతో మనవళ్లు, మనవరాళ్లుగా వాలంటీర్లు వచ్చి అవ్వాతాతలు, వింతతు అక్కచెల్లెమ్మలకు, వికలాంగులకు ఇలా ఏకంగా 66 లక్షల మంది కుటుంబాలకు అందించే రూ.3 వేల పెన్షన్‌ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. అది జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. జరిగింది మన వైయస్ఆర్  సీపీ ప్రభుత్వంలోనే. 

*దేశంలో రూ.3వేల పెన్షన్‌ ఇస్తున్నది మనమే...*
ఇంకో విషయం కూడా తెలుసా.. రూ.3 వేల పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. అవ్వాతాతలు, వింతంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగుల కోసం.. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు మీ బిడ్డ ఖర్చు చేస్తుంటే..  మన తర్వాత చూస్తే మిగిలిన రాష్ట్రాలు ఎంతెంత ఖర్చు చేస్తున్నాయో తెలుసా ?.
తర్వాత రాష్ట్రం తెలంగాణ అట.. చేస్తున్నది కేవలం రూ.12 వేల కోట్లు. అంతకన్నా తక్కువ చూస్తే మిగతా రాష్ట్రాలు అన్నీ  రూ.8 వేల కోట్లు, రూ.6వేల కోట్లు, రూ.4 వేల కోట్లు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం అవ్వాతాతల కోసం ఏకంగా సంవత్సరానికి రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఇది జరుగుతున్నది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

లంచాలు, వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీలను రద్దు చేసి, లంచాలు లేని, వివక్ష లేని సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారు అంటే.. మన గ్రామస్థాయిలో ఈరోజు గత ఎన్నికల్లో మీ జగన్‌కు ఓటు వేయని వారికి కూడా ఈరోజు పథకాలన్నీ కూడా అందుతున్నాయి అంటే? ఇది జరుగుతున్నది మీ బిడ్డ పరిపాలనలోనే. మన వైయస్ఆర్ సీపీ పరిపాలనలోనే. 

డీబీటీ ద్వారా గతంలో ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బులు పేదలకు అందుతాయా? అది కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అందే పరిస్థితి వస్తుందా? అంటే  మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు ఎవరు కూడా నమ్మశక్యంగా అవును అని చెప్పే పరిస్థితి లేదు.

ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం. ఎలాంటి లంచాలు లేవు. వివక్ష లేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లింది ఎప్పుడు అంటే.. మీ బిడ్డ ప్రభుత్వంలోనే. బ్యాంకులకు వెళ్లి ఆ అక్కచెల్లెమ్మల కుటుంబాలు వాళ్ల ఖాతాలు చూసినప్పుడు, ఆ ఖాతాల్లో లక్షలకు లక్షలు కనిపించినప్పుడు..  గుర్తుకొచ్చేది మీ జగన్‌. జరిగినది మన వైయస్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో. ఈ 58 నెలల కాలంలోనే. 

మొట్ట మొదటిసారిగా గవర్నమెంట్‌ బడిలో ఇంగ్లీషు మీడియం. సీబీఎస్‌ఈతో మొదలు పెడితే ఐబీ దాకా ప్రయాణం. గవర్నమెంట్‌ బడుల్లో పిల్లలకు ట్యాబులు వాళ్ల చేతుల్లో కనిపిస్తున్నాయి. వాళ్లబడుల్లో, క్లాస్‌ రూముల్లో ఈరోజు ఐఎఫ్‌పీలు, డిజిటల్‌ బోధన కనిపిస్తోంది. ఆ బడులకు వెళ్లి, ఆ డిజిటల్‌ బోధన మధ్య, ఆ పిల్లల చేతుల్లో ట్యాబుల మధ్య ఒకసారి కూర్చుని చూస్తే.. ఎవరిచ్చారమ్మా ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. జరిగినది ఎప్పుడంటే ఈ 58 నెలల కాలంలో, మన వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలోనే. 

గ్రామంలో రైతన్నను ప్రతి విషయంలో కూడా విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోళ్ల వరకు ప్రతి విషయంలో కూడా రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ ఆర్బీకేలను గ్రామ స్థాయిలోనే తీసుకువచ్చి రైతన్నకు తోడుగా ఉండింది ఎవరు అంటే.. ఆర్బీకే వైపు వెళ్లి చూసినప్పుడల్లా గుర్తుకొచ్చేది మీ జగన్‌. జరిగినది ఎప్పుడంటే ఈ 58 నెలల కాలంలో, మన వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలోనే. 

రైతన్నకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా సొమ్ము. ఆలోచన చేయమని అడుగుతున్నాను. పెట్టుబడికి రైతన్నకు సహాయంగా గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఏ రైతన్న కూడా చూడలేదు. పంట వేసే సమయానికి పెట్టుబడి సహాయంగా రైతు భరోసా సొమ్ము అందిస్తున్నది ఎవరు అంటే?.. జరుగుతున్నది ఎప్పుడు అంటే? గుర్తుకొచ్చేది మీ జగన్‌. చేస్తున్నది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

*రైతులకు తోడుగా....*
రైతన్నకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నకుతోడుగా ఉంటూ అసైన్డ్‌ భూముల మీద, 22ఏ భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూహక్కులు ఆ రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడుతున్నవి ఎప్పుడు అంటే అదీ.. మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఈ 58 నెలల కాలంలోనే, వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

ఈరోజు నిరుపేదలంటూ ఈ 58 నెలల కాంలోనే ఆ ప్రతి నిరుపేదకూ తోడుగా ఉండాలని, నిరుపేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు, వారి చేతుల్లో  2.70 లక్షల కోట్లు పెట్టిన పరిస్థితులు ఎప్పుడు జరిగాయంటే అదిమీ బిడ్డ పాలనలోనే. 

*సామాజిక న్యాయానికి అర్ధం చెబుతూ...*
చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ, సామాజిక న్యాయం అన్నది చేతల్లో చూపిస్తున్న ప్రభుత్వం, సామాజిక న్యాయానికి నిజంగా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అంటే మీ బిడ్డ ప్రభుత్వం. ప్రతి మాటకూ ముందు నా ఎస్సీలంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనార్టీలంటూ, నా పేద వర్గాలు అంటూ.. ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి. పేదరికంలో కులం చూడటం లేదు. మతం, రాజకీయం చూడటం లేదు. పేదవాడికి తోడుగా ఉండాలని అడుగులు వేసిన ప్రభుత్వం కూడా ఒక్క మీ జగనన్న ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్లు ఎస్సీలను తూలనాడితే ఆ ఎస్సీలు గ్రామాల్లో ఎలా బతుకుతారు. అధికారంలో ఉన్న వాళ్లు బీసీలను తూలనాడితే ఆ బీసీలు గ్రామాల్లో ఎలా బతుకుతారు. ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారు మైనార్టీలకు ఇచ్చిన ఆ 4 శాతం రిజర్వేషన్‌ తో అధికారంలో ఉన్న వారు చెలగాటం ఆడితే ఆ మైనార్టీలు ఎక్కడికి పోతారు? 

అందరికీ తోడుగా ఉన్నది, త్రికరణ శుద్ధిగా వారందరికీ అండగా ఉన్నది, వారందరికీ మంచిజరిగింది ఎప్పుడంటే అదీ ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే, మీ బిడ్డ హయాంలో మరో 2.31 లక్షల ఉద్యోగాలు యాడ్‌ అయ్యాయి. ఆ 2.31 లక్షల ఉద్యోగాల్లో ఏకంగా 80 శాతం నేను నా..నా..నా అని పిలుచుకుంటున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కనిపిస్తున్నారంటే సామాజిక న్యాయానికి ఇంతకన్నా అర్థం ఉంటుందా? 

ఈరోజు రాష్ట్రంలో పేదలందరినీ చేయి పట్టుకుని నడిపిçస్తూ...  పేదలందరికీ తోడుగా నిలబడుతూ, అందులోనూ మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడుతూ, 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాను. 

*ప్రొద్దుటూరునే తీసుకొంటే....*
ఇదే ప్రొద్దుటూరు నగరమే తీసుకోండి. ఏకంగా 24 వేల ఇళ్ల పట్టాలు వచ్చింది ఎప్పుడంటే, జరిగింది ఎప్పుడంటే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. అక్కచెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయితే అక్కచెల్లెమ్మల చేతుల్లో ఒక్కొక్కరి చేతుల్లో పెట్టే ఆస్తుల విలువ ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో పెట్టినట్లవుతుంది. 

ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్కచెల్లెమ్మలకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా అక్కచెల్లెమ్మలకే పోయింది రూ.1.90 లక్షల కోట్లు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగలేదు. 

అక్కచెల్లెమ్మలకైతేనేమి, సామాజిక వర్గాలకైతేనేమి, అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలైతేనేమి.. మొట్ట మొదటి సారిగా చట్టం చేసి మరీ 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అంటే అది ఈ 58 నెలల కాలంలోనే. ఈరోజు అక్కచెల్లెమ్మలు ఏఎంసీలలో కనపడుతున్నారు. మున్సిపల్‌ చైర్మన్లుగా కనిపిస్తున్నారు. కార్పొరేషన్లలో చైర్మన్లుగా కనపడుతున్నారు. ఏ పదవి చూసుకున్నా ఏకంగా 50 శాతం ప్రతి అక్కచెల్లెమ్మ కనిపిస్తోందంటే.. చట్టం చేసి మరీ ఇచ్చింది ఎవరంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు ఏ అక్కచెల్లెమ్మ అయినా కూడా ఇలా బ్యాంకు ఖాతాల్లోకి ఇన్నిన్ని లక్షల రూపాయలు పడటం ఎప్పుడైనా చూశారా? ప్రతి అక్కచెల్లెమ్మనూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు ఎవరైనా ఒక అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీయింబర్స్‌ చేసే విద్యాదీవెన, వసతి దీవెన, ఓ సున్నావడ్డీ, ఓఆసరా, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం.. ఇటువంటి పథకాలు ఎప్పుడైనా మహిళా సాధికారతకు సంబంధించిన ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్ర చూశారా అని అడుగుతున్నాను. ఆలోచన చేయమని అడుగుతున్నాను.  

మహిళా సాధికారత అంటే.. మొట్ట మొదటి సారిగా ఏ అక్కచెల్లెమ్మ అయినా ధైర్యంగా బయటకు వెళ్లొచ్చు. అక్కచెల్లెమ్మల చేతుల్లో సెల్‌ ఫోన్‌ ఉంటే చాలు. ఆ సెల్‌ ఫోన్‌ లో ఒక దిశ యాప్‌. గ్రామంలోనే అక్కచెల్లెమ్మకు రక్షణ కల్పిస్తూ మహిళా పోలీస్‌ ఉంది. ఏ ఆపద వచ్చినా ఫోన్‌ 5 సార్లు షేక్‌ చేసినా చాలు.. వెంటనే 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు వచ్చి చెల్లెమ్మా ఏమైంది అని తోడుగా నిలబడే పరిస్థితి ఉన్నది ఎప్పుడంటే ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

*ఏ గ్రామంలోకి వెళ్లి నాలుగు అడుగులు వేసినా....*
మొట్ట మొదటి సారిగా గ్రామాల్లో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు అడుగులు వేస్తే విలేజ్‌ క్లినిక్‌ కనిపిస్తుంది. అదే గ్రామంలో మొట్ట మొదటి సారిగా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్‌ ఈ రోజు గ్రామంలోనే కనిపిస్తున్నాడు. ఆ ఫ్యామిలీ డాక్టర్‌ ను చూసినప్పుడు గానీ, ఆ ఆరోగ్య సురక్ష, విలేజ్‌ క్లినిక్, ఉచితంగా ప్రతి పేదవాడినీ చేయిపట్టుకుని వాళ్లందరూ ఉచితంగా మందులిస్తూ, టెస్టులు చేస్తూ పేదవాడికి అండగా నిలబడుతున్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్‌. జరుగుతున్నది మన వైయస్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలోనే. 

ఈరోజు మొట్ట మొదటి సారిగా ఎప్పుడూ చూడని విధంగా ప్రతి ఇంటినీ జల్లెడపడుతున్నారు. ఏ గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష జరగని గ్రామంలో లేదు. ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. మందులు ఉచితంగా ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా కూడా 108, 104 కొత్త అంబులెన్స్‌ లు కుయ్‌ కుయ్‌ కుయ్‌ అని వినిపిస్తున్నాయి. 

ఆరోగ్యశ్రీ ఏకంగా 3300 ప్రొసీజర్లకు పెంచిన పరిస్థితి. ఆరోగ్యశ్రీలో ఈరోజు వైద్యం ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యానికి ఈరోజు ఎగబాకిన పరిస్థితి. ఎప్పుడూ కూడా జరగని విధంగా ఆరోగ్య రంగంలో ప్రతి పేదవాడికీ చేయి పట్టుకుని నడిపిస్తున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

ప్రతి ఒక్కరినీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. పేదవాడి గురించి నిజాయితీగా ఆలోచన చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే.. గతంలో 108, 104, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌.. ఇలా అనేక పథకాలు తీసుకొచ్చింది అప్పట్లో ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు, నాన్నగారు రాజశేఖరరెడ్డి గారు అయితే.. నాన్నగారు ఒక అడుగు వేస్తే నాన్నగారి బిడ్డగా, మీ బిడ్డగా ప్రతి పేదవాడికి తోడుగా, అండగా ఉండే విషయంలో నాలుగు అడుగులు వేసి ఈరోజు పరుగులెత్తిస్తున్నాడు. 

రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా కొత్తగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలు నిర్మాణం జరుగుతున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో టెరిషరీ కేర్‌ ను ఇంప్రూవ్‌ చేస్తూ అక్కడే సూపర్‌ స్పెషాలిటీ సదుపాయాలు తీసుకొస్తూ 17 మెడికల్‌ కాలేజీలు వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు సీ పోర్టులు. ఎప్పుడూ జరగని విధంగా.. ఏకంగా రూ.16 వేల కోట్ల పెట్టుబడితో నిర్మాణం జరుగుతోంది. కొత్తగా 10 ఫిషింగ్‌ హార్బర్లు పనులు రూ. 3800 కోట్లతో వేగంగా జరుగుతున్నాయి. 

మొట్ట మొదటి సారిగా ఎయిర్‌ పోర్టుల విస్తరణ మీద ధ్యాస పెట్టి పూర్తి చేశాం. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని పారిశ్రామిక సంస్థలు.. అంతెందుకు.. ఇదే మన జిల్లాలో అటువైపున బద్వేలులో చూస్తే ఎప్పుడైనా బజాంకాస్‌ అనే పేరు విన్నారా.. ఈరోజు సెంచురీ ప్లైవుడ్‌.. సంస్థ మన హయాంలోనే టెంకాయ కొట్టి ఫౌండేషన్‌ స్టోన్‌ వేశాం. మొన్న వెళ్లి ఏకంగా ఫ్యాక్టరీకి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించి రావడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఈరోజు రాష్ట్రం వైపు క్యూ కడుతున్నాయంటే అది ఈ 58 నెలల కాలంలోనే జరుగుతోంది. ఆలోచన చేయమని ప్రతి ఒక్కరినీ అడుగుతున్నాను. మీరే గమనించండి అని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. 

*మీ అవసరాలే ఎక్కువని భావించి....*
ఈ 58 నెలల కాంలో మీ బిడ్డ ఏకంగా ఎన్నిసార్లు బటన్‌ నొక్కాడో తెలుసా?.. పేదల కోసం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం రాష్ట్రంలో కోవిడ్‌ మహమ్మారి ఉండి రెండు సంవత్సరాలు ఆదాయాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు. మీ అవసరాన్ని ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు. మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు. 

ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ల కోసం అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్‌ నొక్కాడు. రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఈరోజు నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషాలు చూడాలని మీ బిడ్డ బటన్లు నొక్కాడు. 

*ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి...*
చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడైనా సాధ్యం అయిందంటే.. అది కేవలం మీ జగన్‌ కు మాత్రమే సాధ్యమైంది. మన వైయస్ఆర్  సీపీకి మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా చెబుతున్నాను. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక కొత్త ఒరవడి ప్రతి విషయంలోనూ కనిపిస్తోంది. ఈ ప్రతి విషయం కూడా ప్రతి ఇంటికీ వెళ్లండి. ప్రతి ఇంట్లోనూ చెప్పమని మిమ్మల్నందరినీ కోరుతున్నాను. మరి ఈ అమ్మ ఒడి, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, రైతు భరోసా.. ఇటువంటివన్నీ కూడా వాహనమిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నేతన్న నేస్తం దాకా, చేదోడు దగ్గర నుంచి మొదలు పెడితే తోడు దాకా కూడా ఇవన్నీ కూడా కొనసాగాలంటే మళ్లీ మీ జగనే రావాలి. వైయస్ఆర్  సీపీ ప్రభుత్వమేమళ్లీ ఏర్పడాలి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

ఆ ఇంట్లో చిరునవ్వుల మధ్య ఉన్న ప్రతి అవ్వ దగ్గరికీ వెళ్లి చెప్పండి. అవ్వా.. ఈ పెన్షన్‌ ఇలాగే మీ ఇంటివద్దకే రావాలన్నా.. గతంలో చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్‌ ఎంత ఇచ్చేవాడో అడగండి. ఆ అవ్వా ఇలా వెయ్యి రూపాయలు అంటుంది. మీ బిడ్డ ఎంత ఇస్తున్నాడు అని ఆ అవ్వను అడగండి. చిరునవ్వుల మధ్య ఆ అవ్వ చెబుతుంది రూ.3 వేలు అని. ఈ పెన్షన్‌ ఇంటివద్దనే అందాలన్నా, మెరుగైన రేషన్‌ ఇంటి వద్దకే రావాలన్నా.. మళ్లీ మీ జగనే రావాలి. మళ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వమే రావాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఈ ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు ఇలానే కొనసాగాలన్నా, 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ తో పెద్ద చదువులకు పిల్లలకు తోడుగా ఉండాలంటే ఆ విద్యాదీవెన, వసతి దీవెన కొనసాగాలన్నా.. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.. ఇవన్నీ జరగాలన్నా మళ్లీ జగనే రావాలి, అలా వస్తేనే జరుగుతాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

మన పిల్లలకు మంచి చదువులు, క్వాలిటీ చదువులు, పెద్ద చదువులు, విదేశీ చదువులు మన పేద పిల్లలకు అందాలన్నా, మళ్లీ మీ జగన్‌ ను, వైయస్ఆర్  సీపీని గెలిపించుకుంటేనే జరుగుతాయని చెప్పండి. ఆ అక్కచెల్లెమ్మల దగ్గరకు, ఆ ఇంటికి వెళ్లినప్పుడు చెప్పండి.. గవర్నమెంట్‌ బడులు బాగుపడాలన్నా, పిల్లల తలరాతలు మారాలన్నా, గవర్నమెంట్‌ హాస్పటళ్లు బాగుపడాలన్నా, అప్పులపాలు కాకుండా పేదవాడికి వైద్యం అందాలన్నా, మెరుగైన విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కొనసాగాలన్నా.. మళ్లీ మీ జగన్‌ ను, వైయస్ఆర్  సీపీని గెలిపించుకుంటేనే జరుగుతాయని చెప్పండి. 

రైతన్నలకు రైతు భరోసా సొమ్ము అందాలన్నా, ఆర్బీకే వ్యవస్థ గ్రామాల్లో ఉండాలన్నా, ఒక సున్నా వడ్డీగానీ, రైతన్నలకు 9 గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్‌ అందాలన్నా, రైతన్నలకు బీమా సమయానికే రావాలన్నా, ఉచిత బీమా అందాలన్నా, ఇన్‌ పుట్‌ సబ్సిడీ సమయానికే రావాలననా, ఇవన్నీ ఏమి జరగాలన్నా కూడా రైతన్నను చేయి పట్టుకుని నడిపించే పరిస్థితి ఉండాలన్నా అది మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం కనిపిస్తుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

*పేదరికం సంకెళ్లు పోయి... ఎదగాలంటే...*
ప్రతి ఇంటా పేదరికం సంకెళ్లు తెంచుకుని, ప్రతి ఒక్క కుటుంబం కూడా గొప్పగా ఎదగాలని, ఇంటింటి అభివృద్ధి, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పాలన.. ఇచ్చే ప్రతి రూపాయీ నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లే పరిస్థితి రావాలన్నా.. అది కేవలం మీ జగనన్ననే చేయగలుగుతాడు. జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

ఇది జరగాలి అంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కుటుంబం కూడా మన పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్లుగా వాళ్లందరూ బయటకు రావాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మీ గ్రామాల్లో ఉన్న, పట్టణాల్లో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. స్టార్‌ క్యాంపెయినర్లుగా అక్కచెల్లెమ్మల కుటుంబాలు రావాలని, వాళ్లే కాకుండా 100 మందికి చెప్పి ఓటు వేయించాలి అని, స్టార్‌ క్యాంపెయినర్లుగా వచ్చి వాళ్ల అన్నకు, వాళ్ల బిడ్డకు తోడుగా నిలబడాలి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

ఇవన్నీ కొనసాగాలంటే 2024 ఎన్నికల్లో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు  నొక్కాలి. జగనన్న మీ కోసం 130 సార్లు బటన్లు నొక్కాడు. మళ్లీ ఇవన్నీ కొనసాగించడం కోసం, పేదల భవిష్యత్‌ కోసం, మనకోసం మనం రెండు బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటిపార్లమెంటుకు, రెండుసార్లు ఫ్యాన్‌ మీద బటన్‌ నొక్కితే, మీరు గతంలో బటన్‌ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు. కానీ పొరపాటు జరిగితే మళ్లీ చంద్రముఖి లకలకా అంటూ సైకిలెక్కి మీ ఇంటికి వస్తుంది. చేతిలో టీ గ్లాస్‌ పట్టుకుంటుంది. మళ్లీ మరో 5 సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుందని చెప్పండి. పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

*బాబుకు  ఓటేస్తే– పథకాలు రద్దు చేసుకున్నట్టే...*
చంద్రబాబుకు ఏ ఒక్కరైనా ఓటు వేయడం అంటే దాని అర్థం.. మనమే మనకు అందుతున్న మన పథకాలన్నింటికీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయడం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మడం అంటే అబద్ధాన్ని, మోసాన్ని, వెన్నుపోటును నమ్మినట్టే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకసారి చంద్రబాబు గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ చెప్పండి.. ఇదిగో చంద్రబాబు తియ్యటి మాటలు, రంగురంగుల వాగ్దానాలు, చంద్రబాబు మాటల్లో విషం ఎలా ఉంటుందో ఇదే దత్తపుత్రుడితో, ఇదే మోడీ గారితో కలిసి ఇదే చంద్రబాబు 2014లో ప్రజలకు ఏం చెప్పాడో, ఎంతటి మోసం చేశాడో వారు చేసిన పాంప్లేట్‌ ను మీరే ఒక్కసారి చూడండి. 

ఈ పాంప్లేట్‌ 2014లో చంద్రబాబునాయుడుగారు, దత్తపుత్రుడు, మోడీ గారు.. ముగ్గరి ఫొటోలు కింద చూస్తే చంద్రబాబు సంతకం. ఈ పాంప్లేట్‌ ప్రతి ఇంటికీ పంపించారు. టీవీల్లో అడ్వటైజ్‌ మెంట్లు వేశారు. అడ్వరై్టజ్‌మెంట్లు వీరబాదుడు బాదారు. వీళ్లు ముగ్గురూ కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్లు.. ఇంటింటికీ వెళ్లి పాంప్లేట్‌ పంచి, ఎల్లో మీడియాలో అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వటైజ్‌ మెంట్ల మీద అడ్వటైజ్‌ మెంట్లు వేసి.. వీళ్లంతా చెప్పినది ఏంటి.. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? 

పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. రూ.14,205 కోట్లు. ఒక్క రూపాయి అయినా చేశాడా? రెండు చేతులూ పైకెత్తి ఇలా ఇలా ఇలా.. ఆడ బిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం అట. రూ.25 వేలు ప్రతి బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేస్తామన్నాడు. మీకు ఏమైనా డిపాజిట్‌ చేశాడా? ఒక రూపాయి అయినా చేశాడా? పోనీ మీ ఇంటి పక్కన అటుపక్కన అయినా డిపాజిట్‌ చేశాడా? ఇంటికీ ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ ఉపాధి వచ్చేదాకా నెల నెలా రూ.2 వేలు నిరుద్యోగభృతి ఇస్తామని రాశారు. 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికీ బాకీ పడింది రూ.1.20 లక్షలు. కనీసం ఒక్కరికైనా వచ్చిందా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌. చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలు మాఫీ అన్నాడు. జరిగాయా? అని అడుగుతున్నాను. మహిళల రక్షణకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌. రాష్ట్రన్ని సింగపూర్‌ కు మించి అభివృద్ధి చేస్తాం, ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. అయ్యాయా? అని అడుగుతున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా 3 సెంట్ల స్థలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఇస్తామన్నాడు. కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. 

*ఈ ముగ్గురూ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.*
ఈ పాంప్లేట్లు ఈ ముగ్గురి ఫొటోలతో ఇచ్చిన వాగ్దానాలు 2014లో. ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ ముగ్గురూ కలిసి నెరవేర్చారా? అని అడుగుతున్నాను. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? అని అడుగుతున్నా. మరి ఇదే బ్యాచ్‌.. ఇదే ముగ్గురు.. మళ్లీ ఈరోజు ఎన్నికలు వచ్చే సరికే మళ్లీ కొత్త మేనిఫెస్టో. ప్రతి ఇంటికీ కేజీ బంగారం అంట. ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు కొనిస్తారట. సూపర్‌ సిక్స్‌ అట, సూపర్‌ 7 అట. మళ్లీ రంగు రంగుల మేనిఫెస్టో అట. మళ్లీ ఇదే బ్యాచ్, ఇదే ముగ్గురు.. మళ్లీ మోసానికి రెడీ అయ్యారు అంటే ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు దేశ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా? 

*విలువలకు, విశ్వసనీయతకు మీ బిడ్డ ప్రతీక.*
విశ్వసనీయతకు, విలువలకు ప్రతీకగా మీ బిడ్డ నిల్చుని ఉన్నాడు. మీ బిడ్డ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాటను నెరవేర్చి 5 సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి వచ్చి చెప్పిన ప్రతి మాటా నెరవేర్చాను, ఆశీర్వదించండని అడుగుతున్నాడు. మీ బిడ్డ ఒకవైపున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాడు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తున్నాడు. అటువైపున మోసాలు, అబద్ధాలు నమ్ముకుని పొత్తుల రాజకీయాలు చేస్తున్నారు.

*ఫ్యాన్‌ ఇంట్లో– సైకిల్‌ ఇంటి బయట– గ్లాస్‌ సింక్‌లో...*
అందుకే ప్రతి ఒక్కరికీ చెప్పండి. ఫ్యాన్‌ ఇంట్లోనే ఉండాలి. సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌ లోనే ఉండాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 
ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు, మీ ఓటు పేదల భవిష్యత్‌ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పొరపాటు జరిగితే పేదల బతుకులు అంధకారమయమే. ప్రతి ఒక్కరికీ వెళ్లి చెప్పండి. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో మోసగాళ్లను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను.  

జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పని చేయడానికి, ఈనాడు రోత రాతలు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి సోషల్‌ మీడియా అబద్దాలు, మోసాలు.. వీటన్నింటి నుంచి ఇంటికీ అభివద్ధని, పేదవాడి భవిష్యత్‌ ను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? అని అడుగుతున్నా. సిద్ధమే అయితే, మీ జేబులోంచి సెల్‌ ఫోన్‌ బయటకు తీయండి. సెల్‌ ఫోన్‌ లోని టార్చ్‌ లైట్లు ఆన్‌ చేయండి. టార్చ్‌ బటన్‌ ఆన్‌ చేయండి. సెల్‌ ఫోన్లు చేతికి తీసుకోండి. మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా నినదించండి.

వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌ 175కు 175 ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌ 25కు 25 మంది ఎంపీలు. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. 175 ఎమ్మెల్యేలకు, 25 ఎంపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి వీలే లేదు.. సిద్దం అని గట్టిగా చెప్పండి. 

పేదల భవిష్యత్‌ కోసం జరిగే ఈ ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధం అని మరోసారి గట్టిగా చెప్పండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం మరో రెండు నెలల్లోగా మరో 5 ఏళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు మీ జగన్‌ అనే నేను.. సిద్ధం.. మరి మీరు సిద్ధమేనా అని అడుగుతున్నాను. 

ఈ ఎన్నికల్లో మన గుర్తు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఎన్నికల్లో మన గుర్తు ఫ్యాన్‌. మీ అందరికీ తెలిసిన గుర్తే. ఈ వేదికపై ఉన్న ఎంపీగా నిలబడుతున్న నా తమ్ముడు అవినాష్‌ రెడ్డి నా పక్కనే ఉన్నాడు.అదేవిధంగా 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నా పక్కనే ఇక్కడే ఉన్నారు. ఇదే ప్రొద్దుటూరు అభ్యర్థిగా నా సోదరుడు ప్రసాద్‌ నా పక్కనే ఉన్నాడు. కమలాపురం అభ్యర్థిగా మీ అందరికీ పరిచయస్తుడు, నేను కూడా ముద్దుగా మామా అంటాను. కమలాపురం ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్‌ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. బద్వేల్‌ ఎమ్మెల్యే నా సోదరి సుధమ్మ, డాక్టరమ్మ నా పక్కనే ఉన్నారు. జమ్మలమడుగు నుంచి నా సోదరుడు సుధీర్‌ నా పక్కనే ఉన్నాడు. కడప నుంచి నా మైనార్టీ సోదరుడు నేను ముద్దుగా నవాబ్‌ సాబ్‌ అంటాను. అంజాద్‌ బాషా కూడా నా పక్కనే ఉన్నాడు. మనందరికీ పిత్రు సమానుడు, మరీ ముఖ్యంగా నాకు పిత్రు సమానుడు, మైదుకూరుకు రఘురామిరెడ్డి అన్న నా పక్కనే ఉన్నాడు. ఇక మీ అందరికీ పరిచయస్తుడినైన నేనూ ఉన్నాను. మీ పులివెందుల అభ్యర్థిగా ఈ జిల్లా నుంచి నేను పోటీ చేస్తున్నాను. 

మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డ అయిన నా పైన, మనందరి ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులపైన ఉంచమని సవినయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చీకటి అయిపోయింది కాబట్టి సెక్యూరిటీ వాళ్లు ర్యాంప్‌ వద్దంటున్నారు. కాబట్టి ఈసారికి క్షమించండి అంటూ సీఎం తన ప్రసంగం ముగించారు.
 

Back to Top