తాడేపల్లి: గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో గట్లకు వలంటీర్ల ద్వారా రక్షణ కల్పించనున్నారు. ప్రతి అర కిలోమీటరుకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేశారు. రాత్రంతా వలంటీర్లు గట్లపై రక్షణ నిలువనున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావం, తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రాధానంగా చర్చ జరిగింది. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని ఇప్పటికే ప్రభావిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...: అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటమట్టం 49.60 అడగులు ఉంది. రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ఇన్‌ఫ్లో, అవుట్ ప్లో 13 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇది రేపటికి సుమారు 16 లక్షలకు చేరుకుని.. ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. 17 లక్షల క్యూసెక్కులు మూడో ప్రమాద హెచ్చరిక కాగా... ప్రస్తుతం రెండు, మూడు ప్రమాద హెచ్చరికల మధ్యలో అంటే...13 లక్షలకుపైగా 17 లక్షల లోపే ప్రవాహం ఉంటుంది. గత ఏడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చూశాం. కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలి. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలి. ఉండాల్సినదాని కన్నా ఎక్కువగా మానవత్వంతో పనిచేయాలి. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కరూపాయి అదనంగా ఖర్చు చేసినా, బాధితులకు అండగా ఉండాలి. వారి పట్ల మానవతాధృక్పధంతో వ్యవహరించాలి. కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలి. మన వల్ల జిల్లాకు మంచి జరిగింది, మంచి కలెక్టర్ అనిపించుకునేలా పనిచేయాలి. అధికారులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే కొన్ని చోట్ల ఖాళీలు చేశారు. 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలనుకూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధితులకు సహాయశిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి. శిబిరాల్లో అధికారులు ఉంటే.. ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలి. ఆ మేరకు సదుపాయాలమీద ధ్యాస పెట్టాలి. అదే టైంలో.. సహాయ శిబిరాల నుంచి బాధితులను తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు రూపాయలు ఇవ్వండి. వ్యక్తులైతే వారికి రూ.1000లు ఇవ్వండి. మరో ముఖ్యమైన అంశం కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ ధృక్పథంతో ఉండాలి. ఉదారంగా వ్యవహించాలి. కచ్చా ఇళ్లనుంచి సహాయ శిబిరాలకు వచ్చినవారిని వారిని తిరిగి ఇళ్ళకు పంపించేటప్పుడు వారికి రూ.10వేల రూపాయలు ఇవ్వాలి. ఇది తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకోవడానికి వారికి ఉపయోగపడుతుంది. అలా చేయకపోతే వాళ్లు ఎక్కడికి పోవాలో తెలియదు ? కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అన్న వర్గీకరణ వద్దు. వాళ్లు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు వర్గీకరణ అనవసరం. అలాంటి వారికి రూ.10వేల ఆర్థిక సహాయం ఇస్తే.. తిరిగి ఆ కచ్చా ఇంటిని మరమ్మతు చేసుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్లును కోరుతున్నాను. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. అలాగే ముంపునకు గురైన ఇళ్లు, అలాగే వరదనీరు ప్రవహించిన ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీచేయాలి. ఉదారంగా నిత్యావసరాలను పంపిణీచేయాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలి. మొత్తంగా బాధితుల పట్ల మరింత ఉదారంగా, మానవతా దృక్ఫథంతో వ్యవహించాలి. రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. ఇప్పడూ అప్రమత్తంగా ఉండాలి. కంట్రోలు రూమ్స్ ఏర్పాటుకు సంబంధించి.... జిల్లా స్థాయి నుంచి మండల స్థాయివరకూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. సచివాలయ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందితో పాటు, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. ముంపు బాధిత గ్రామాలమీద, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అదే విధంగా ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా చూసుకోవాలి. దీనిపై మరొక్కసారి సమక్షించుకొండి. లంక గ్రామాలలో జనరేటర్లు లాంటివాటిని సిద్ధంచేసుకోండి. తాగునీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోండి. తాగునీటి ప్యాకెట్లను సిద్ధంచేసుకోండి. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టండి. బ్లీచింగ్, ఫినాయిల్ వంటివి సిద్దంగా పెట్టుకొండి. అదే విధంగా ఆరోగ్య శిబిరాల ఏర్పాటు పై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టండి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలలో సరిపడా మందులను ఏర్పాటు చేసుకోండి. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి. వరదల కారణంగా పాముకాట్లు లాంటి ఘటనలు జరిగితే.. వాటికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకొండి. వరదనీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి చర్యలోనూ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్న మెసేజ్ అందించాలి. అత్యంత పారదర్శకత పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరందరినీ కూడా వైద్యం, మంచి సదుపాయాలు ఉన్నచోటకు ముందే తరలించాలి.