అక్రమ కేసులు పెడతామంటే ఉపేక్షించం

వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులను బెదిరిస్తే స్టేషన్‌ ముందే బైఠాయిస్తాం

న్యాయం కోసం ఎస్పీ, అవసరమైతే డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం

త్రీటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ గతంలో ఏం చేశారో అన్నీ తెలుసు

వైయ‌స్‌ఆర్‌సీపీలో యాక్టివ్‌గా ఉంటే స్టేషన్లకు పిలిచి బెదిరిస్తారా?

వైయ‌స్‌ఆర్‌సీపీయువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ మండిపాటు

పోలీసులు ఇదే పద్ధతి కొనసాగితే లీగల్‌గా ముందుకెళ్తాం

వైయ‌స్‌ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి 

అనంతపురం  : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో యాక్టివ్‌గా ఉంటే పోలీస్‌స్టేషన్లకు పిలిపించి కేసులు పెడతామని బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని వైయ‌స్‌ఆర్‌సీపీ యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ అన్నారు. న్యాయం కోసం అవసరమైతే పోలీస్‌స్టేషన్‌ ఎదుటే బైఠాయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం అనంతపురంలో నిర్వహించిన ‘ప్రజా ఉద్యమం’ నిరసన ర్యాలీ విజయవంతమైంది. ఈ క్రమంలో ర్యాలీలో యాక్టివ్‌గా పాల్గొన్న వారిని గుర్తించి వారిలో కొందరు యువజన, మైనార్టీ నేతలను గురువారం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చేయి చేసుకున్నారు. ఈ విషయాన్ని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత లీగల్‌ సెల్‌ నాయకులతో కలిసి త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన ఘటనపై సీఐ రాజేంద్రనాథ్‌తో మాట్లాడారు. పాత కేసులున్న వారిని స్టేషన్‌కు పిలిపించినట్లు సీఐ చెప్పగా.. ఒక్క కేసు కూడా లేని వాళ్లను కూడా తీసుకొచ్చారని సాకే చంద్రశేఖర్‌ తెలియజేశారు. పైగా అసభ్యంగా మాట్లాడుతూ బెదిరించి పోలీసులే చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీలో యాక్టివ్‌గా పాల్గొన్న వారిని గుర్తించి భయభ్రాంతులకు గురి చేసేలా ఫొటోలు పెట్టుకుని మరీ పోలీసులు భయపెట్టినట్లు సాకే చంద్రశేఖర్‌ తెలిపారు. త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో యువకులను కొట్టారని, కేసులు పెడతామని బెదిరించినట్లు చెప్పారు. ఎందుకు తీసుకొచ్చారని సీఐ రాజేంద్రనాథ్‌ను అడిగితే అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. స్టేషన్‌కు తీసుకొచ్చిన వాళ్లలో కొందరిపై ఒక్క కేసు కూడా లేదని తెలిపారు. ‘‘ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు తొత్తులుగా ఉండాలంటే ఉండండి. అది మీ విజ్ఞత. ఇదే సమయంలో మా వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించము. న్యాయం కోసం స్టేషన్‌ ముందే బైఠాయిస్తాం. త్రీటౌన్‌ సీఐ గతంలో ఏం చేశారో, ఎలాంటి వ్యవహారాలు నడిపారో అన్నీ తెలుసు. అవన్నీ ఇప్పుడు చెప్పడం సందర్భం కాదు. పోలీసుల వ్యవహారశైలి ఇలాగే ఉంటే ఎస్పీ దృష్టికి తీసుకెళ్తాం. అప్పటికీ న్యాయం జరగకుంటే డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం’’ అని సాకే చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. వైయ‌స్‌ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి మాట్లాడుతూ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. అనంతపురంలో ర్యాలీ విజయవంతం కావడంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైందని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బైండోవర్‌ పేరుతో వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిచారన్నారు. సీఐని అడిగితే పాత కేసులని దాట వేసినట్లు చెప్పారు. ఇదే పద్ధతి కొనసాగితే లీగల్‌గా పోరాటం చేస్తామన్నారు. ఎవరిపై అయినా దాడి చేసి గాయపరిస్తే ప్రైవేట్‌ కేసులు పెట్టి కోర్టు ద్వారా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వైయ‌స్‌ఆర్‌సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు శ్రీనివాస్‌ దత్త మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అనంతపురంలో ర్యాలీ కొనసాగిందన్నారు. అయినా కూడా యువజన విభాగం నాయకులను ఇబ్బంది పెట్టాలని పోలీసులు చూస్తున్నారని తెలిపారు. అక్రమ కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోమని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, న్యాయవాది బాషా, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, సాంస్కృతిక విభాగం నగర అధ్యక్షుడు కసిరెడ్డి కేశవరెడ్డి, మైనార్టీ విభాగం నాయకుడు ఆసిఫ్, యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు వినీత్, నగర కార్యదర్శి మైను, యువజన విభాగం నాయకులు దాదు, హర్ష, సుబ్బారావు, రోహిత్, ఆకాష్, ఘన, ప్రసాద్, కిరణ్, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు అనిల్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top