వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడి అత్యంత హేయం

ఈ ఘటనకు ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యత వహించాలి

మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్‌ స్పష్టీకరణ

దళితులంటే టీడీపీకి చులకన

హిందూపురం చరిత్రలోనే ఇది మాయని మచ్చ

 గుర్తు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు వేణురెడ్డి 

హిందూపురం:     శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గుండాలు దాడి చేసి, మొత్తం విధ్వంసం చేసిన ఘటనను పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. దళితులంటే టీడీపీకి చులకన అని, హిందూపురం చరిత్రలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని, ఆ స్థాయిలో టీడీపీ గుండాలు వ్యవహరించారని వైయ‌స్ఆర్‌సీపీనాయకుడు వేణురెడ్డి వెల్లడించారు. ఇది కచ్చితంగా హిందూపురం వాసుల మనోభావాలు దెబ్బ తీయడమే అని ఆయన స్పష్టం చేశారు. 
ఈ మేరకు ఉషాశ్రీ చరణ్, వేణురెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..:

ఉషాశ్రీ చరణ్‌. శ్రీసత్యసాయి జిల్లావైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు. మాజీ మంత్రి:
– హిందూపురం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బాధ్యత వహించాలి. కొంతమంది టీడీపీ గుండాలు మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. మొత్తం ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఆఫీసు సిబ్బందిని కూడా విచక్షణ రహితంగా కొట్టారు. మా పార్టీకి వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక అక్కస్సుతో విచక్షణ కోల్పోయి పార్టీ ఆఫీసు మీద దాడి చేయడం పిరికి పంద చర్య. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ ఘటనకు బాధ్యత వహించాలి. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలన్న మా పార్టీ అధినేత మాటలు గుర్తుంచుకుని మేము సంయమనం పాటిస్తున్నాం.

వేణురెడ్డి. హిందూపురం వైయ‌స్ఆర్‌సీపీనాయకుడు:
– మా పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి హిందూపురం చరిత్రలోనే మాయని మచ్చ. వాస్తవానికి ఇలాంటి సంస్కృతి హిందూపురం వాసులది కాదు. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వారు ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. ఆ విధంగా ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు. ఇది పూర్తిగా పిరికిపందల చరిత్ర. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ చర్యలపై వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీ విజయవంతం కావడంతో ఓర్చుకోలేని ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇక్కడికి వచ్చి ఒక రిసార్ట్‌లో కూర్చుని, తన మనుషులను రెచ్చగొట్టి ఈ దాడి చేయించాడు. బాకృష్ణకు చేతనైతే నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప, ఇలాంటి దుశ్చర్యలు కాదు.

దళితులంటే టీడీపీకి చులకన:
    బాబా సాహెబ్‌ అంబేద్కర్‌  ఫొటోను పగలగొట్టారు. దళితులంటే టీడీపీ వాళ్ళకు చులకన. ఇది మంచి పద్దతి కాదు. మూడుసార్లు ఓటేసి గెలిపించారు. అయినా ఏ ఒక్క అభివృద్ధి అయినా చేశారా? ప్రజలంతా ఓట్లు వేస్తేనే కదా బాలకృష్ణ గెలిచింది. మాకు ఇక్కడ 40 శాతం ఓటు బ్యాంక్‌ ఉంది. తల్లి లాంటి అసెంబ్లీలో కూర్చొని, మా అధినేత, మాజీ సీఎంను సైకో అంటూ తీవ్ర స్థాయిలో దుర్భాషలాడాడు. అది తప్పు కానప్పుడు, మేం మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది?. నేనేం ఆయనలా సైకో అని అనలేదే?.

Back to Top