తాడేపల్లి: టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్‌ఓ) సతీష్‌కుమార్ మృతి కేసులో వైయస్ఆర్‌సీపీ నాయకులను ఇరికించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. సతీష్‌కుమార్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని స్పష్టం చేసిన ఆయన, ఈ కేసును సీబీఐతో లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్న టీడీపీ నేతలు.. పరకామణి చోరీ కేసులో సిట్ విచారణలో ఉన్న సీఐ సతీష్‌కుమార్ మరణం అత్యంత విచారకరం. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఈ మరణంపై ప్రజల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. సతీష్‌కుమార్ మృతి విషయం తెలియగానే, టీడీపీ నాయకులు చాలా వేగంగా స్పందించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాకుండానే, పోస్ట్‌మార్టమ్ కూడా పూర్తి కాకుండానే మా వైయస్ఆర్‌సీపీపై నిందలు వేస్తూ, ఆయన్ను మా పార్టీ నాయకులే హత్య చేశారని నిరాధార పిచ్చి ఆరోపణలు చేశారు. ఆ విధంగా ప్రభుత్వం ఈ కేసులో వైయస్ఆర్‌సీపీ నాయకులను ఇరికించే కుట్ర చేస్తోంది. మరోవైపు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది అత్యంత హేయం. వందలాది మంది ప్రభుత్వ అధికారులకూ వేధింపులు... పరకామణిలో చోరీని గుర్తించి, ఫిర్యాదు చేసిన సతీష్ నే పలు దఫాలుగా విచారణ పేరుతో పిలవటం ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరో ఒకరితో ఫిర్యాదు చేయించి.. సాక్ష్యాలు లేకున్నా ఇలా విచారణ పేరుతో కోర్టుకు తీసుకెళ్లడం.. అనంతరం రిమాండ్ కి పంపించడం పరిపాటిగా మారింది. ఆ తర్వాత తీరిగ్గా కేసు గురించి ఆలోచిస్తున్నారు. పోలీసులే విచారణ పేరుతో తిరిగి పోలీసులనే వేధించడం కూటమి పాలనలో తొలిసారిగా చూస్తున్నాం. వందల సంఖ్యలో ఇలాంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయలు, విశాల్ గున్నీ, సునీల్ కుమార్, మార్గదర్శి కేసుపై విచారణ చేశారని సంజయ్‌ను, విజయ్‌పాల్, చెవిరెడ్డి గన్‌మెన్‌గా పనిచేసిన చిన్న ఉద్యోగిని శారీరంగా వేధించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివిధ స్ధాయిల్లో వందలాది మంది ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. వ్యవస్థలను భయపెట్టి.. మాకు అనుకూలంగా పనిచేయకపోతే వీఆర్ పేరుతో మేం మీకు రివార్డు ఇస్తామని చెబుతున్నారు. ఇంకా కక్ష ఉంటే అధికారులను సైతం జైల్లో వేస్తున్నారు. సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్డితో విచారణ... సతీష్ మృతి వెనుక వాస్తవాలు ప్రజలకు తెలియాలి. చివరకు మృతుడి భార్య ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని.. వారి ఇంటిని మీ ఆధీనంలోకి తెచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది. వాస్తవం ప్రజలకు కచ్చితంగా తెలియాలి. టీడీపీ నేతలు బయట నుంచి పోలీసులను ప్రభావితం చేయడం సరికాదని శైలజానాధ్ సూచించారు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గం అంటూ అధికారులను రెండుగా ఈ కూటమి ప్రభుత్వం విభజించింది. ఏదేమైనా సతీష్‌కుమార్ మృతిలో వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐ లేదా సుప్రీంకోర్డు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడి అప్రజాస్వామికం.. హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారని ఆరోపిస్తే దాడి చేస్తారా? ఇది అత్యంత అప్రజాస్వామికం, మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని టీటీడీ గూండాలు రెచ్చి పోతున్నారు. ప్రశ్నించే వారిపై దాడి చేస్తే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలెవరూ భయపడరు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించుకోవాలి. ఈ దాడులు చూస్తుంటే నాగరిక సమాజంలో ఉన్నామా? అనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వ్యక్తుల మీద, పార్టీ కార్యాలయాల మీద కూడా దాడి చేస్తున్నారు. చివరకు మీ వల్ల నష్టపోయామని ఎవరైనా ఆవేదన వ్యక్తం చేస్తే.. వారి మీద కూడా దాడికి దిగుతున్నారు. అందుకే ఇకనైనా ప్రజలందరూ మీ అరాచకాలను గమనిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దని సాకే శైలజానాథ్ గుర్తు చేశారు.