ఆరోప‌ణ‌లు చేసి పారిపోవ‌డం ప‌వ‌న్‌కు  అల‌వాటే

డిప్యూటీ సీఎం పవన్‌కు ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్
 

చిత్తూరు: చిత్తూరు జిల్లా మంగళంపేట భూములపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన‌ ఆరోపణలను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళంపేట అటవీ భూములను పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆక్ర‌మించార‌ని ఆరోపిస్తూ  ప‌వ‌న్ క‌ళ్యాణ్ హెలికాప్ట‌ర్‌లో సెల్‌ఫోన్‌లో షూట్ చేస్తున్న వీడియోను త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేయ‌డం ప‌ట్ల ఎంపీ మిథున్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.   పవన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.  నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ కుటుంబం చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిందని, అన్ని రికార్డులు పబ్లిక్‌గా ఉన్నాయని, కావాలంటే ప‌బ్లిక్ డొమైన్‌లో చెక్ చేసుకోవాల‌ని మిథున్ స్పష్టం చేశారు. ముందుగా వాటిని పరిశీలించి, ఆ తర్వాతే మాట్లాడాలని సూచించారు. గతంలో కూడా ఎర్రచందనం విషయంలోనూ పవన్ ఇలాగే ఆరోపణలు చేసి పారిపోయారని ఆయ‌న గుర్తు చేశారు. తమపై ద్వేషంతోనే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి మండిప‌డ్డారు.

2000లో చట్టబద్ధంగా కొనుగోలు!
మంగళంపేటలో 2000 సంవ‌త్స‌రంలో పెద్దిరెడ్డి చట్టబద్దంగా భూములు కొనుగోలు చేశార‌ని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ భూములు ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన పట్టా భూములని 1981 నవంబర్‌ 11న డైరెక్టర్‌ ఆఫ్‌ సెటిల్‌మెంట్స్‌ అధికారి అసదుద్దీన్‌ అహ్మద్‌ ఆర్డర్‌ జారీ చేశార‌న‌ని,  ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2000లో వాటిని పెద్దిరెడ్డి చట్టబద్ధంగా కొనుగోలు చేసి మామిడితోట, పశువుల పెంపకం చేపట్టార‌ని తెలిపారు. కేంద్ర అటవీశాఖ నుంచి 2022 జూన్ 27న క్లియరెన్స్‌ పొందిన తరువాతే అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్‌ అనుమతులు ఇచ్చింద‌ని వివ‌రించారు.

గ‌తంలో ఈ భూములపై ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించార‌ని తెలిపారు. దీనిపై అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్‌ సర్వే చేసి అది అటవీ భూమి కాదని.. పూర్తిగా ప్రైవేట్‌ భూమేనని నిర్ధారించార‌ని వెల్ల‌డించారు. 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే అంశంపై మరోసారి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు అది ప్రైవేటు భూమి అని మరోసారి నిర్ధారించార‌ని మిథున్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Back to Top