గుంటూరు: ఏపీలో ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. వైయస్ఆర్‌సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు.. అడ్డంకులను సృష్టించారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసం నుంచి ర్యాలీగా ముందుకు సాగారు. వైయస్ఆర్‌సీపీ ర్యాలీ.. స్వామి థియేటర్ వద్ద రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఓవరాక్షన్‌కు దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ సీఐ గంగా వెంకటేశ్వర్లు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. దీంతో, సీఐపై అంబటి రాంబాబు మండిపడ్డారు. అక్కడే ఉన్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల వైఖరి నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఇక, గతంలోనూ అంబటి రాంబాబు పట్ల పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించాం. రెవెన్యూ అధికారులకు మెమోరాండం అందించాం. 17మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టామని చెప్పాం. ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రైవేటు కాలేజీలు భారీస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేదలకు అన్యాయం చేసే పీపీపీ పద్దతిని వద్దని చంద్రబాబుకు సూచిస్తున్నాం. పీపీపీ పద్దతిపై కొన్ని రాష్ట్రాలలో ప్రజలు వ్యతిరేకించడంతో ప్రభుత్వాలు వెనక్కితగ్గాయి.