చంద్రబాబు ఒక క్రెడిట్‌ చోర్‌ 

ఇళ్ల ప్రారంభోత్సవంతో మరోసారి తేటతెల్లం

గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం 

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి.

3 లక్షల ఇళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టించావా?

గజం స్థలం అయినా పేదల కోసం కొన్నావా?

అయినా అంత నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటావు?

చంద్రబాబుకు గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూటి ప్రశ్న

గత ప్రభుత్వ హయాంలోనే ఆ 3 లక్షల ఇళ్ల నిర్మాణం

వాటిలో ఆనాడే 1,40,010 ఇళ్లు దాదాపు పూర్తి

శ్లాబ్‌ లెవెల్‌ వరకు మరో 87,380 ఇళ్ల నిర్మాణం

వివిధ దశల పనులతో మిగిలిన 66,845 ఇళ్లు 

అయినా 3 లక్షల ఇళ్లు తామే కట్టినట్లు సీఎం బిల్డప్‌

పచ్చి అబద్ధాలతో చంద్రబాబు ఇళ్ల కలరింగ్‌

అందుకే చంద్రబాబు క్రెడిట్‌ చోర్‌ అనేది సుస్పష్టం

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి      

హైదరాబాద్‌:    గత వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వం పేదలకు ఇళ్ల స్జలాలు, వారికి పక్కా ఇళ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, ఆ దిశలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేయించడమే కాకుండా, 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్‌ చేయించి కట్టడం మొదలుపెట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. రెండేళ్లు కోవిడ్‌ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన తెలిపారు.
    నిన్న (బుధవారం) చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసి ప్రారంభించిన 3,00,092 ఇళ్లలో, గత ప్రభుత్వ హయాంలోనే  1,40,010 ఇళ్లు దాదాపు పూర్తి కాగా, శ్లాబ్‌ లెవెల్‌ వరకు 87,380 ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఇంకా వివిధ దశల పనులతో మిగిలిన 66,845 ఇళ్లు ఉన్నాయని గుర్తు చేశారు. అయినా 3 లక్షల ఇళ్లు తామే కట్టినట్లు పచ్చి అబద్దాలతో సీఎం చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారని, అందుకే ఆయన క్రెడిట్‌ చోర్‌ అనేది మరోసారి తేటతెల్లం అయిందని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జి.శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో వైయ‌స్ఆర్‌సీపీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంకా ఏం మాట్లాడారంటే..:

చంద్రబాబూ మీ స్కీం హేయం:
    గత వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా.. 2023, అక్టోబరు 12న, ఒకేసారి 7,43,396 గృహ ప్రవేశాలతో ఒక చరిత్ర సృష్టించింది. అది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. అయినా వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, అన్నీ తానే చేసినట్లుగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు స్కీం అత్యంత హేయం.
    తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి 18 నెలల్లో స్వయంగా నిర్మించిన 3 లక్షల 92 ఇళ్లు ఒకేరోజు లబ్ధిదారులకు అందజేసినట్టు ప్రచారం చేసుకున్న చంద్రబాబు, అందుకోసం కనీసం గజం స్థలం కొని, సెంటు భూమి అయినా పేదలకు మంజూరు చేసి ఉంటే చూపాలి. అవేవీ చేయకుండా గత వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో పూర్తయిన ఇళ్లకు రంగులేసి, అప్పటికే ఆ ఇళ్లలో ఉంటున్న వారికి మళ్లీ కీ ఇచ్చి, అవన్నీ తామే కట్టించి, గృహ ప్రవేశం చేయిస్తున్నామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. రాయచోటిలో నిన్న (బుధవారం) ప్రారంభించిన ఇళ్లు గత మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. అందుకు తగిన ఆధారాలన్నీ ఉన్నాయి. అందుకే సీఎం చంద్రబాబు ఒక క్రెడిట్‌ చోర్‌.

ఏడాదిన్నరగా ఏం జరుగుతోంది?:
    గత ప్రభుత్వంలో నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాల రద్దు. కొన్నింటి పేరు మార్పు. నాడు ఏర్పాటైన పరిశ్రమలను కూడా తామే తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకోవడం, రోజూ నిందలు వేయడం, దుష్ప్రచారం చేయడం మినహా, ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు.
    విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి వాస్తవాలు దాచిన తండ్రీ కొడుకులు అదంతా తమ ఘనత అన్నట్లు మార్కెటింగ్‌ చేసుకున్నారు. నిజానికి గత వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలోనే అదానీ డేటా సెంటర్‌ (ఇప్పుడు గూగుల్‌ డేటా సెంటర్‌) ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూరై్తంది. అందుకే అదానీ పేరు చెబితే, వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వానికి క్రెడిట్‌ ఇవ్వాల్సి వస్తుందని గూగుల్‌ డేటా సెంటర్‌ అంటున్నారు. ఇంకా వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వంలోనే రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగితే, అవి కూడా తామే తీసుకొచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. 

ఇళ్లు. చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహారాలు:
    సీఎం చంద్రబాబు నానా హంగామా చేస్తూ, ఆర్భాట ప్రచారంతో నిన్న (బుధవారం) ప్రారంభించిన 3 లక్షల ఇళ్లన్నీ గత వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వంలోనే నిర్మించారు. వాటిలో చాలా వాటిని లబ్ధిదారులకు అందజేశారు కూడా. వాటిని కూడా తామే కట్టి, లబ్ధిదారులకు ఇస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. 
అందుకు ఇవీ కొన్ని ఉదాహరణలు:
    అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకి చెందిన ఎస్‌.అల్తాబ్‌బేగం, హేమలతకు ఏప్రిల్‌ 28, 2022లో వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరు చేస్తే, అప్పుడే వాటిని పూర్తి చేసుకున్నారు. వారికి రూఫ్‌ లెవెల్‌ వరకు బిల్లులు కూడా అప్పుడే మంజూరైనట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, అవి తాము కట్టామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. 
    అదే గ్రామంలో రాజీవ్‌నగర్‌ కాలనీలో 40 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే 30 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. అప్పుడే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఆ ఇళ్లనే నిన్న చంద్రబాబు ప్రారంభించి తన ఘనత అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. 
    అలా నాడు జగన్‌గారు కట్టించి, మంజూరు చేసిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్‌ కొట్టేసే కుతంత్రానికి తెర లేపాడు. శవాలు పూడ్చడానికి కూడా పనికి రావని గేలి చేసిన పెద్దమనిషి ఇప్పుడు అవే స్థలాల్లో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తన ఖాతాలో వేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నాడు.

రాజధానిలోనూ పేదలకు చంద్రబాబు దగా:
    రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు నాటి సీఎం వైయస్‌ జగన్‌ 52 వేల ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే, వాటిని అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని కోర్టులకెళ్లి అడ్డుకోవాలని చూసినా, జగన్‌గారు అవన్నీ ఎదుర్కొని పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పేదల పట్ల ఏమాత్రం దయ లేకుండా ఆ పట్టాలు రద్దు చేసి, పేదలకు దగా చేశారు.

పెద్దిరెడ్డిగారు ఆ భూములపై ఆధారాలు చూపారు:
    మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అటవీ భూములు కాజేశాడంటూ కూటమి నాయకులు ఆయన మీద పదే పదే బురద జల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. తాను ఆ భూములు ఎలా సంపాదించానో తెలియజేస్తూ ఆయన అన్ని ఆధారాలు చూపించారు. అన్నింటికీ పెద్దిరెడ్డి వద్ద ఆధారాలున్నాయి. పెద్దిరెడ్డిగారి మీద ఏడాదిన్నరగా ఆరోపణలు చేస్తూనే ఉన్నా, ఇప్పటి వరకు ఏ ఒక్కదాన్నీ ఆధారాలతో నిరూపించలేకపోయారని జి.శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు.

Back to Top