రాష్ట్రంలో ప్రజారవాణా పునరుద్ధరణ

సగం సీట్లు నింపి ప్రయాణించేలా విధివిధానాలు రూపొందించాలి

వలస కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాతే బస్సుల రవాణా

అంతర్‌రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణకు ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోమన్‌రెడ్డి ఆదేశం

వలస కార్మికులను ఆదుకోవడం అధికారుల పనితీరు అభినందనీయం

తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజారవాణా పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సగం సీట్లు మాత్రమే నింపి బస్సుల సర్వీసులు పునరుద్ధరించేలా విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పనిచేశారని, ఏపీ మీదుగా నడిచి వెళ్తున వారికి సహాయంగా నిలిచారని కితాబిచ్చారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయం ఇది. వలస కార్మికుల తరలింపు పూర్తయిన తరువాతే బస్సులు నడపాలని అధికారులను సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడపాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు విధివిధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్లలో ముగ్గురు ప్రయాణించేలా అనుమతివ్వాలన్నారు. ఒక బస్టాండ్‌ నుంచి మరొక బస్టాండ్‌కు మాత్రమే బస్‌ సర్వీసులు ఉండాలని, బస్సులో ప్రయాణించేవారి పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. దశలవారీగా ప్రజారవాణా పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించారు. అంతర్‌రాష్ట్ర సర్వీసులు పునరుద్ధరణకు ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రజా రవాణాకు ప్రైవేట్‌ బస్సులకు అనుమతివ్వాలని సూచించారు.

టేక్‌ అవే రెస్టారెంట్లకు అనుమతివ్వాలని, టేక్‌ అవే సమయంలో భౌతికదూరం పాటించాల్సిందేనని సూచించారు. రాత్రి 7 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలని, దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతివ్వాలన్నారు. కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 

Back to Top