ధాన్యం సేకరణ పటిష్ట విధానంతో జరగాలి

ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదు

ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలి

రబీ సీజన్‌కు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలి

భూసార పరీక్షలు చేసే పరికరాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాలి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: మినిమం సపోర్ట్‌ ప్రైస్‌ (ఎంఎస్‌పీ) కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని, అత్యంత పటిష్ట విధానంతో ధాన్యం సేకరణ కొనసాగాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై సమీక్షించిన అనంతరం మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. 

ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని, రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ జరగాలని ఆదేశించారు. ఈ–క్రాపింగ్‌ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలన్నారు. వ్యవసాయ శాఖతో పౌరసరఫరాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీకి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు, ఇలా అన్నిరకాలుగా రైతులకు కావాల్సివన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్‌ ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. 

ప్లాంట్‌ డాక్టర్స్‌ కాన్సెప్ట్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష చేపట్టారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఉంచాలని ఆదేశించారు. మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు కారణంగా ఏ ఎరువులు వాడాలి..? ఎంతమేర వాడాలన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. దీంతో పెట్టుబడి తగ్గుతుందని, దిగుబడులు కూడా పెరుగుతాయన్నారు. భూసారాన్ని కూడా పరిరక్షించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం.వి.యస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్‌ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి, మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్, సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌. హరికిరణ్, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ జి. వీరపాండ్యన్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ వీసీ అండ్‌ ఎండీ జి. శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

Back to Top