ఢిల్లీ వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించండి

కోవిడ్‌–19 నియంత్రణపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

 తాడేపల్లి: ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ –19ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 విస్తరణ, కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి అధికారులతో చర్చించారు. 
ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌–19 కేసులకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు అందజేశారు. కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని, వీరిలో చాలా మంది ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులేనని వివరించారు. జమాత్‌ నిర్వాహకుల నుంచి, పోలీసులనుంచి, రైల్వేశాఖ నుంచి, ఇలా వివిధ మార్గాల ద్వారా వివరాలను సేకరించామని, దాని ప్రకారం రాష్ట్రం నుంచి వెళ్లిన వారు మాత్రమే కాకుండా ఆ రోజు వారితో రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను కూడా సేకరించామని అధికారులు తెలిపారు. వారిని గుర్తించి ఐసోలేషన్‌కు తరలిస్తున్నట్లు సీఎంకు చెప్పారు. వీరిపై ప్రధానంగా దృష్టిసారించి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఈ సందర్భంగా  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చికిత్స తీసుకోవాలని కోరారు. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఎటువంటి నష్టం జరగదని, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని సీఎం వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు సంయుక్తంగా పనిచేసి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ ఈ సమీక్షకు హాజరయ్యారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top