అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందాల్సిందే

ఇళ్ల పట్టాల పంపిణీ అతిపెద్ద కార్యక్రమం

జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం

కోవిడ్‌ తగ్గుముఖం అనంతరం గ్రామాల్లో పర్యటిస్తా

ఇంటి పట్టా లేదని ఎవరూ చేయి ఎత్తకూడదు

‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం 

తాడేపల్లి: ఇళ్ల పట్టాల పంపిణీ అతిపెద్ద కార్యక్రమమని, జూలై 8వ తేదీన అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో ‘స్పందన’పై సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై జిల్లాల వారీగా సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, 29 నుంచి 30 లక్షల ఇళ్ల పట్టాలు అర్హలకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమమని గుర్తుచేశారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధిపై అధికారులు నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నూటికి నూరుశాతం ఇళ్ల పట్టాలు పంపిణీ కావాలన్నారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. 

కోవిడ్‌ పరిస్థితులు తగ్గుముఖం పట్టాక గ్రామాల్లో పర్యటిస్తానని, ఇంటి పట్టా లేదని ఎవ్వరూ చేయి ఎత్తకూడదని, అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా అందించాలని సూచించారు. ‘నాకు ఓటు వేయని వారికి కూడా ఇళ్ల పట్టా ఇవ్వాలి’ అని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 

దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో పెన్షన్‌ కార్డు, రేషన్‌ కార్డులు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, ఇంటి పట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందించాలని ఆదేశించారు. ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సూచించారు. వివక్ష లేకుండా, సంతృప్తస్థాయిలో అందించాలని ఆదేశించారు. 
 

Back to Top