ఏప్రిల్‌ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ

జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్‌ చేసిన బియ్యం పంపిణీ
 

ప్రతి 30 – 40 కిలోమీటర్ల వ్యవధిలో బియ్యం ప్యాకేజీ యూనిట్‌

బియ్యం ప్యాకేజీ సంచులను తిరిగి సేకరించాలి

పౌరసరఫరాల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన బియ్యం, నిల్వల వివరాలను సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరమని, ఖరీఫ్, రబీ సీజన్లలో పంట ద్వారా 28.74 లక్షల టన్నుల బియ్యం అందుబాటులో ఉందని సీఎంకు వివరించారు. అదే విధంగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిశీలించారు. ఏప్రిల్‌ 1వ తేదీన అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని, అదే విధంగా ఏప్రిల్‌ నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నారు. 30 చోట్ల 99 నాణ్యమైన బియ్యం ప్యాకింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశామని, ఇందులో 41 సివిల్‌ సప్లయ్‌వి, మరో 58 చోట్ల పీపీపీ మోడల్‌లో ప్యాకేజ్డ్‌ యూనిట్లు అని, ప్రతి 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్యాకేజీ యూనిట్‌ ఉంటుందన్నారు. నెలకు 2 వేల టన్నుల బియ్యాన్ని ప్యాకేజీ చేసే సామర్థ్యం, సత్వర పంపిణీ కోసం సిబ్బంది, వాహనాలు ముందుగానే గుర్తించినట్లుగా వివరించారు. పర్యావరణానికి హాని జరగకుండా బియ్యాన్ని ప్యాకేజీ చేసేందుకు వాడుతున్న సంచులను తిరిగి సేకరించేలా చూడాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

Back to Top