చెప్పిందే చేస్తా..

గ‌ణ‌ప‌వ‌రం స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

నాలుగో ఏడాది తొలి విడత వైయస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ సాయం

రాజకీయాల గురించి ఆలోచించను..ప్రజలకు మేలు చేయాలనేదే నా తపన

రైతులకు ఉచిత విద్యుత్, వ్యవసాయం దండగ అన్న నాయకుడు చంద్రబాబు

రైతులపై కాల్పులు జరిపి చంపించిన నేత చంద్రబాబు

రుణాల మాఫీ పేరుతో మోసం చేసిన నాయకుడి పాలనను గుర్తు చేసుకోండి

ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు?

రైతు భరోసా పథకం గతంలో ఉండేదా?

మూడేళ్లలో అరకోటికిపైగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ.23,875 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశాం

గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలి

ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి

అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ ఇచ్చాం

ఆక్వా జోన్‌లో ఉన్న పదెకరాల వరకు రూపాయిన్నర విద్యుత్‌ సబ్సిడీ వర్తింపు

గణపవరంను భీమవరం జిల్లాలో కలుపుతాం

గణపవరం: మీ బిడ్డ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని నిజాయితీ, నిబద్ధత ఉందని, ఏది చెబితే అదే చేస్తానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు, ఈనాడు, ఏబీఎన్‌, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదని సీఎం వైయ‌స్ జగన్‌ మండిపడ్డారు. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలి. రైతు భరోసా పథకం గతంలో ఉండేదా?. మూడేళ్లలో అర కోటికిపైగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ.23,875 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశాం. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా?. రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటున్నాం. ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్ట చతుష్టయం ప్రశ్నించలేదు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని నిల‌దీశారు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోంది. కేంద్రం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నాం. గతానికి, ఇప్పటికి ఉన్న తేడాను రైతులు గమనించాలని సీఎం వైయ‌స్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. 

ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా ప‌థ‌కం కింద నాలుగో ఏడాది మొద‌టి విడ‌త డబ్బు జమ చేశారు. వైయ‌స్ఆర్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అంద‌జేశారు. 
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడారు.

మంచి కార్యక్రమం జరుగుతోంది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
జూన్‌ మాసం రాకముందే, ఖరీఫ్‌ మొదలుకాకముందే, వ్యవసాయ పనులు ప్రారంభం కాకమునుపే ఈ ఏడాది 2022 ఖరీఫ్‌పంటకు పెట్టుబడిగా వైయస్‌ఆర్‌ రైతు భరోసాను అందించడానికి ఇక్కడ మీ అందరి ఎదుట ఈ కార్యక్రమంలో బటన్‌ నొక్కి డబ్బులు జమ చేయడం సంతోషంగా ఉంది.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా, వాచా, కర్మన గట్టిన నమ్మిన ప్రభుత్వం  మనది. ఈ దశలోనే రైతులను అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం ఈ మూడేళ్ల కాలంలో ప్రతి అడుగు కూడా అదే దిశగా వేశాం. గతంలో లేని విధంగా ఆలోచన చేశాం. రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టాం. క్రమం తప్పకుండా క్యాలెండర్‌ఇచ్చి..నెల చెప్పి కచ్చితంగా క్రమం తప్పకుండా వైయస్‌ఆర్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌కార్యక్రమాన్ని అమలు చేస్తున్నానని సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. 
వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.13, 500 చొప్పున మూడు విడతల్లో ప్రతి ఏటా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, కౌలు రైతులకు, దేవాలయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులకు  అందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం.
వరుసగా నాలుగో ఏడాది మళ్లీ వైయస్‌ఆర్‌ రైతు భరోసా సొమ్మును ఈ వేదిక నుంచి విడుదల చేస్తున్నాం. నాలుగో ఏడాది మొదటి విడత కింద ఖరీఫ్‌ సీజన్‌ మొదలుకాకముందే రూ.7500, పంట కోతకు వచ్చిన సమయంలో మరో రూ.4 వేలు, ఆ తరువాత సంక్రాంతికి రూ. 2000 చొప్పున ఇస్తున్నాం. అందులో భాగంగా నాలుగో ఏడాది మొదటి విడతగా రూ.7500 సొమ్ములో రూ.5,500 ఈ రోజు ఇక్కడ బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. మరో రూ.2000 ఈ నెలాఖరులో పీఎం కిసాన్‌ కింద కేంద్రం విడుదల చేస్తోంది. ఆ డబ్బులు కూడా ఈ నెల 31న రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఈ నెలాఖరు కల్లా 50 లక్షల పైచిలుకు రైతులకు ఒక్కొక్కరికి రూ.7500 చొప్పున దాదాపుగా రూ.3,758 కోట్లు ఈ నెలాఖరులోగా జమ అవుతుందని మీ బిడ్డగా సగర్వంగా చెబుతున్నాను.
వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద మొదటి విడతగా మే నెలలో జమ చేస్తున్న ఈ రూ.7500 తో పాటు రెండో విడత అక్టోబర్‌లో మరో నాలుగు వేలు, మూడో విడతలో సంక్రాంతికి రూ.2 వేలు కలిపి రూ.13,500 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. ప్రతి ఏటా సుమారు రూ.7 వేల కోట్లు రైతు భరోసా అన్న పథకానికి అందిస్తున్నాం. 
ఇప్పటికే గత మూడేళ్లుగా అందించాం. ఈ ఏడాది నాలుగో ఏడాది మొదటి విడతగా అందిస్తున్న ఈ సొమ్మును కూడా లెక్కిస్తే..మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కాకముందే వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద అక్షరాల రూ.23875 కోట్లు నేరుగా రైతన్న బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. రైతు కష్టం తెలిసిన మీ బిడ్డగా చెబుతున్నాను.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా కేవలం ఈ మూడేళ్ల పాలనలోనే మనందరి ప్రభుత్వం, రైతన్నల ప్రభుత్వం రైతులకు మేలు చేస్తూ  రూ.1,10,93,000 కోట్లు ఇవ్వడం జరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నా.
2022కు సంబంధించి ఈ డబ్బును విడుదల చేస్తున్న సమయంలో రాష్ట్రంలోని ప్రతి రైతుకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్ల పాలనలో ఎక్కడా కూడా కరువు లేదు. ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరమే రాలేదని సవినయంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని ప్రతి ఒక్క రిజర్వాయర్‌ సకాలంలో నిండుతూ వచ్చింది. ఈ మూడేళ్ల కాలంలోనే రాష్ట్రంలోని గ్రౌండ్‌ వాటర్‌లెవల్‌ కూడా పెరిగింది. అనంతపురం లాంటి కరువు జిల్లాలో సైతం రికార్డు స్థాయిలో భూగర్భజలాలు పెరిగాయని తెలియజేస్తున్నాను.
అంతకుముందు ఐదేళ్ల పాలన చూశాం. చంద్రబాబు పాలన చూశాం. మన పాలన ఈ మూడేళ్లలో చూస్తున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని గమనిస్తే సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. 2014–2019 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు అయితే మనందరి ప్రభుత్వంలో ఈ మూడేళ్లలో 170 లక్షల టన్నులకు దిగుమతి పెరిగిందని సవినయంగా తెలియజేస్తున్నాను.
గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలకు ఐదేళ్లలో చెల్లించింది కేవలం రూ.782 కోటుల మాత్రమే. ఈ మూడేళ్లలో మన ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాలకు రూ.1282 కోట్లు చెల్లించింది. తేడా గమనించండి. అప్పుడు ఉన్నది రైతులే. రైతుల పట్ల వారికి ఉన్న ప్రేమ ఏంటి? మీ జగనన్నకు ఉన్న ప్రేమ ఏంటో గమనించండి.
వ్యవసాయంలో రైతన్న కు మంచి చేయాలని గుండెతో మనసుతో ఆలోచన చేశాం. దురదృష్టవశాత్తు కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో మాదిరిగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను మన ప్రభుత్వంవిస్మరించలేదు. గత ప్రభుత్వం రైతు చనిపోతే..అతను వ్యవసాయం చేయలేదని కుంటి సాకులు చెప్పేది. ఏ రైతు అయినా కూడా పట్టదారు పుస్తకం ఉంటే చాలు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి  రూ.7 లక్షలు పరిహారం చెల్లించాం. 
సీసీఆర్‌సీ కింద నమోదు చేసుకుని ఆత్మహత్య చేసుకుంటే వాళ్లకు సైతం రూ.7 లక్షల పరిహారం అందిస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత గొప్పగా, పారదర్శంగా మనం చేస్తున్నాం. 
చంద్రబాబుకు దత్తపుత్రుడైన ఒక్క పెద్ద మనిషి రైతుల పరామర్శకు  బయలుదేరాడు. ఆ పెద్ద మనిషి పరామర్శలో ఒక్కటంటే ఒక్క రైతును చూపించలేకపోయాడు. పట్టదారు పాస్‌ బుక్‌ఉండి ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతుకు రూ.7 లక్షలు దక్కని ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు ఈ దత్తపుత్రుడు. సీసీఆర్‌సీ కార్డు మీ ఆర్‌బీకేలోనే అందుబాటులో ఉంటుంది. ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు. అంత గొప్పగా పరిపాలన సాగుతోంది.
ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా రైతుకు పరిహారం అందించడం దేశ చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా మన రాష్ట్రంలో గొప్ప పరిపాలన ఈ మూడేళ్లుగా జరుగుతోంది. రైతు బీమాలో రైతు వాటాగా చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. అక్కడే ఆర్‌బీకేలు, ఈ–క్రాప్‌ బుకింగ్‌ చేస్తున్నారు. ఒక సీజన్‌లో జరిగిన నష్టం మళ్లీ రెండో ఏడాది మరో సీజన్‌ రాకముందే ఆ ముందు సంవత్సరం ఇన్సురెన్స్‌ సొమ్ము రాష్ట్రంలో అందజేస్తున్నాం.
కృష్ణా, గోదావరి డెల్టాతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అత్యధికంగా సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల ద్వారా నీరిచ్చింది ఈ మూడేళ్లలోనే అన్నది గమనించాలని కోరుతున్నా. రైతులకు ఇలాంటి మేలు చేయాలంటే నేల తల్లి మీద, వ్యాసాయం మీద, గ్రామం మీద, మన సంస్కృతి మీద, రైతు కూలీల మీద, రైతుల కష్టం మీద మమకారం ఉండాలి. అవగాహన ఉండాలి. గత పాలకులకు ఇవేవి లేవు.
సాగునీరు ఉండే ప్రాంతాల్లో రైతులకు ఉండే కష్టాలు, మెట్ట ప్రాంతాల్లో రైతుల  ఇబ్బందులపై గత పాలకులకు అవగాహన లేదు. ఏ ఒక్కరైతుకు ఇబ్బంది వచ్చినా కూడా స్పందించే ప్రభుత్వం మనది.
ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పితే lరైతు ఏమవుతాడు అన్నది అర్థం కాని ఏ నాయకుడు అయినా కూడా రాజకీయాల్లో ఉండటానికి తగునా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలని మన ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిని అడుగుతున్నా. కానీ మన దురదృష్టం ఏంటంటే..రైతులకు ఉచిత విద్యుత్‌ వద్దన్న నాయకుడు, వ్యవసాయం దండగ అన్న నాయకుడు, రైతుల గుండెలపై గురిపెట్టి బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చంద్రబాబు. రూ. 87612 కోట్ల వ్యవసాయ రుణాలను మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పి ఐదేళ్లలో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే జమ చేసి చివరికి తన వాగ్ధానాలు నమ్మిన రైతులకు వాళ్లు చేసిన పంట రుణాలకు బంగారం తాకట్టు పెట్టి ఆ రుణాలకు వడ్డీల భారం తడిసి మోపెడై ఆ బంగారం కూడా వేలం వేస్తున్నా కూడా మనసు కరగని ఆ నాయకుడి పాలనను  ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నా. 
చెప్పడమేమో చెప్పారు.. ఆతరువాత రైతులను గాలికి వదిలేశారు. ఆ తరువాత రైతులు ఎలా బతుకున్నారో గత పాలకులు గాలికి వదిలేశారు. ఏమాత్రం పట్టించుకోకుండా  బాధ్యత లేనట్లుగా తప్పించుని తిరుగుతున్నాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై విపరీతమైన ప్రేమ చూపించాడు. ఈ రోజు ప్రశ్నిస్తున్నానని చెప్పుకుంటున్నాడు ఆ దత్తపుత్రుడు. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని ఆ దత్తపుత్రుడిని అడుగుతున్నాను. ఈ విషయాలను ఆ రోజు తమ పేపర్లు, టీవీల్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నిస్తున్నాను. ఆ ఎల్లోమీడియా, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5..ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా చంద్రబాబును ప్రశ్నించలేదు. ఈ రోజు మాత్రం ముసలికన్నీరు కార్చుతున్నారు. అసలు వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడే అర్హత వీళ్లకు ఉందా?


వ్యవసాయానికి మన ప్రభుత్వం ఏమి చేసిందో, గత ప్రభుత్వం ఏమి చేసిందో మీ అందరికి కూడా తెలుసు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. గతానికి ఇప్పటికి తేడా చూపిస్తుంది. నిజంగానే ఇది జరిగిందా అని ఆలోచన చేయండి.
–  రైతులకు మనందరి ప్రభుత్వం ప్రతి ఏటా రూ.13,500 చొప్పున వైయస్‌ఆర్‌ రైతు భరరోసా పథకం అమలు చేస్తున్నాం. ఇటువంటి పథకం ఉందా? లేదా?. సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులు, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సాయం అందిస్తున్నాం. గతంలో ఇలాంటి సాయం అందేదా?
– ఎన్నికల వేళ..మేనిఫెస్టోలో ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్లలో రూ.12 వేల చొప్పున రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. కానీ ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 రైతుల చేతుల్లో పెడుతున్నాం. ఇటువంటి కార్యక్రమం రూ.87612 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కేవలం ముష్టి వేసినట్లు రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.
– అర కోటి మంది రైతులకు అక్షరాల మనం రూ.23,875 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని..రాష్ట్ర చరిత్రలో ఇంతగా మేలు చేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా?
– మనందరి ప్రభుత్వంలో వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ.1282 కోట్లు మనం ఇచ్చాం. ఐదేళ్లలో రూ.782 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తేడా చూడండి.
– మనందరి ప్రభుత్వంలో కరువు, వరదల వల్ల ఏ సీజన్‌లో జరిగిన నష్టం అదే సీజన్‌లో అందించాం. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూశారా? గతంలో పంట నష్టం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఇవాళ గ్రామాల్లోనే ఆర్‌బీకేల పరిధిలో జాబితాను ప్రదర్శించి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం, ఈ–క్రాపింగ్‌తో ముడిపెట్టి పంట నష్టం అందజేస్తున్నాం. గతంలో ఎప్పుడైనా ఇలా చేశారా?
– మన ప్రభుత్వం ప్రతి అడుగులో రైతుకుతోడుగా ఉంటూ విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకు సాహాయపడుతూ రైతు భరోసా కేంద్రాలను ఏకంగా మన గ్రామాల్లోనే స్థాపించి రైతులకు తోడుగా ఉంటున్నాం. ఈ–క్రాపింగ్‌బుకింగ్‌ గ్రామాల్లో చేస్తూ..దానివల్ల ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులకొనుగోలు కార్యక్రమాలు పారదర్శకంగా చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఉన్నాయా? తేడా గమనించండి.
– రైతులు కట్టాల్సిన బీమాప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆర్‌బీకే పరిధిలోనే ఈ–క్రాప్‌ బుకింగ్‌తో పాటు ఇన్సూరెన్స్‌ నమోదు చేస్తున్నాం. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం చెల్లిస్తున్నాం. గతంలో ఇలా చెల్లించేవారా?
– ఈ మూడేళ్లలో వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ద్వారా అందించిన సొమ్ము గమనిస్తే..అక్షరాల 31 లక్షల మంది రైతులకు దాదాపుగా రూ.5 వేల పైచిలుకు సొమ్మును ఇన్సూరెన్స్‌గా రైతుల ఖాతాల్లో వేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఎక్కడా కూడా లంచాలు లేవు. వివక్ష లేదు. అర్హత ఉన్న ప్రతి రైతుకు..ఆ రైతు నాకు ఓటువేసినా ? వేయకపోయినా సాయం అందిస్తున్నాం.
– కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఆరు పంటలకు కూడా రైతు తక్కువ రేటుకుఅమ్ముకుని నష్టపోకుండా వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఆలోచన చేయండి. ఈ రోజు ఆర్‌బీకేలోనే పంటలకు సంబంధించిన ..కేంద్రం ప్రకటించని పంటలకు సైతం రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేస్తోంది. ఇది గతంలో ఉండేదా? ఆలోచన చేయండి.
– ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ గురించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలోచన చేశాను. ఈ మూడేళ్లలో రూ.2403 కోట్లు కరెంటు సబ్సిడీగా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మనది కాదా?
– ఇదే అక్వా రైతులకు సంబంధించి కొన్ని విషయాలు కూడా మీ అందరికీ తెలియాలి. మూడేళ్ల పాటు ఆక్వా సాగులో కోవిడ్‌ సమయంలో నష్టపోకూడదని ప్రభుత్వం తోడుగా నిలిచింది. కేవలం పశ్చిమ గోదావరి జిల్లాలో లక్ష 72 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. 58 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఐదేకరాల్లో 87 శాతం మంది సాగు చేస్తున్నారు. 70518 ఎకరాల్లో 5 ఎకరాల్లోపు సాగు చేస్తున్నారు. కేవలం ఐదు వేల మంది అక్షరాల 60 శాతం భూములను సాగు చేస్తున్నారు. కోవిడ్‌ సమయంలో అందరికీ అండగా నిలబడింది. చిన్న సన్నకారు రైతులకు మేలు చేయాలి. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా యూనిట్‌ రూ.1.50 చొప్పున సబ్సిడీపై ఇస్తున్నాం. రూ.3.80 కూడా మనప్రభుత్వమే ఇస్తుంది. మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మంచి చేయాలంటే చెప్పాలి. ఎన్నికలు అయిపోయిన తరువాత మోసం చేయడం ధర్మమేనా అని నాకు చెప్పిన వారికి తెలిపాను.
– ఇప్పటికే ఎమ్మెల్యే వాసు ఈ విషయం గురించి మాట్లాడారు. ఆక్వా జోన్‌లో ఉన్న రైతులకు 10 ఎకరాలకు ఈ సబ్సిడీని వర్తింపజేస్తున్నాను.
– ఒక్కసారి గమనించండి. గతంలో పాడీ రైతులను మోసం చేశారు. పాడి రైతులను మన ప్రభుత్వం ఆదుకుంటుంది. అమూల్‌ సంస్థను రంగంలోకి తీసుకువచ్చాం. ప్రతి లీటర్‌కు రూ.5 పైగానే మేలు జరుగుతోంది. మిగిలిన పాల డెయిరీలు కూడా రైతులకు రూ.5 ఎక్కువగా  ఇస్తున్నారు. తేడా గమనించాలి.
– నియోజకవర్గ స్థాయిలోనే ల్యాబ్‌లు పని చేస్తున్నాయి. ఆ ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. ఆర్‌బీకే స్థాయిలో ఒక చిన్నస్థాయి ల్యాబ్‌ ఉంది. 147 ల్యాబ్‌లు ఉన్నాయి. జిల్లా స్థాయిలో 13 ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాం. రైతులు కొనుగోలు చేసే ప్రతి విత్తనం, పురుగు మందులను పరీక్షిస్తున్నారు. గతంలో ఈ మాదిరిగా ఉండేదా?  ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా రైతులకు మంచి చేసేందుకే. ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు మేలు చేస్తున్న ఈ ప్రభుత్వం గురించి మీరే చెప్పాలని ప్రతి రైతును కోరుతున్నాను.
– రైతులకు మరో విషయం చెప్పాలి. 2014 ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు తన ఫొటోను పెట్టి విడుదల చేశాడు. ఈ మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తీసేశాడు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు చేస్తున్న నైజాన్ని గమనించగలరు. ఈ రోజు మన పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు మన మేనిఫెస్టోను తీసుకువచ్చి ప్రతి ఇంటికి వస్తున్నారు. ప్రతి ఇ ంటికి కూడా జగనన్న రాసిన లేఖను తీసుకునివస్తున్నారు. ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోలో మీకు కలిగిన మేలు గుర్తించి టిక్కులు పెట్టాలని, గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించగలరు. ఆ రోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మేనిఫెస్టో ఇవ్వడం, లెటర్లు రాశారు. ఈ లేఖల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ ఫోటోలు పెట్టాడు. ఎందుకు  మోసం చేశావని ప్రశ్నించని దత్తపుత్రుడిని ఏమనాలి. ఇదే దుష్ట చతుష్టయం ఈ రోజు రంద్రాలు వెతికే కార్యక్రమాలు చేస్తున్నారు. మంచి చేస్తున్నా వక్రీకరించే కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరికి ఒక్కటే విన్నపం. జగన్‌ మీ బిడ్డ..రైతుల తరఫున నిలబడే మీ బిడ్డ జగన్‌. ఎన్నికలకు ముందు ఒకరకంగా, ఎన్నికలు అయిపోయిన తరువాత మరోరకంగా ఉండే వాడు కాడు మీ బిడ్డ జగన్‌. నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది మీ బిడ్డకు. ఏది చెబుతాడో అదే చేస్తాడు మీ బిడ్డ జగన్‌. ఇటువంటి మంచి పరిపాలనకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని, మీ అందరి చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని బటన్‌ నొక్కి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. 
గణపవరంను భీమవరం జిల్లాలో కలుపుతానని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
 

Back to Top