తాడేపల్లి: ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రారంభ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్పందన, ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రగతిపై సీఎం వైయస్ జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. సీఎం మాట్లాడుతూ..లబ్ధిదారులకు నేరుగా ఇంటి పట్టా అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 39 శాతం ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని తెలిపారు.17 వేలకు పైగా జగనన్న కాలనీల్లో 9,668 వైయస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. ఇళ్ల స్థలాల పెండింగ్ కేసులను త్వరగా పరిష్కారం అయ్యేలా కలెక్టర్లు చూడాలన్నారు.పాలనలో పారదర్శకతను ఒక స్థాయికి తీసుకుని వెళ్లామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో అర్హుడికి ఇంటి పట్టా ఇవ్వాలన్నారు. రేషన్, పెన్షన్ కార్డులు 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజుల్లో ఇస్తున్నామని చెప్పారు. సంతృప్తిస్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అర్హులందరికీ తప్పకుండా ఇంటి పట్టా రావాలన్నారు. ఏపీ చరిత్రలో గొప్ప కార్యక్రమం జరిగిందని, ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అక్కా చెల్లెమ్మల మోహాల్లో సంతోషం కనిపిస్తుందన్నారు. లే అవుట్లలో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమం అయితే, ఆ లే అవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించడం మరో కార్యక్రమమన్నారు. రోడ్లు, కరెంట్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. స్కూళ్లు, అంగన్‌వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాయాలు, విలేజ్ క్లినిక్స్ ఈ కాలనీల్లో రావాలన్నారు. కాలనీ పరిమాణం, జనాభాను బట్టీ వీటిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు.వీధి దీపాలు, కరెంటు స్తంభాల ఏర్పాటులో కూడా వినూత్న పద్ధతులను అవలంభించాలన్నారు. వైయస్ఆర్ జగనన్న కాలనీలను మంచి కాలనీలుగా తీర్చిదిద్దాలని సూచించారు.
వైయస్ఆర్ జగనన్న కాలనీ నిర్మాణంలో మన సంతకం కనిపించాలన్నారు. ప్రతి కాలనీ వెలుపల బస్టాప్ ఉండాలని, బస్టాప్ హైటెక్ రీతిలో నిర్మించాలని వివరించారు. కాలనీ ఎంట్రెన్స్ కూడా వినూత్న రీతిలో ఉండాలన్నారు. భవిష్యత్ తరాలు మన పేర్లను గుర్తించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రేనేజీ లాంటి వ్యవస్థలపై ఇప్పుడే దృష్టి పెట్టాలన్నారు.ఇంటి నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారుడి నుంచి ఆప్షన్లు వెంటనే తీసుకోవాలన్నారు. మ్యాపింగ్, జియోట్యాపింగ్ కూడా ఏకకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. కలెక్టర్లు తప్పకుండా రివ్యూలు చేయాలని, పేదవాళ్ల నుంచి ఎవరైనా అవినీతికి పాల్పడితే అది క్షమించరాని నేరమని హెచ్చరించారు. ప్రతి అధికారికీ కలెక్టర్ కమ్యూనికేట్ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.