అమ్మ ఒడి చదువుల బడి

అమ్మ ఒడి పథకం చిన్నారులు వారి తల్లిదండ్రులకు అంకితం

అక్కాచెల్లెమ్మలకు అండగా, పిల్లలకు మంచి మేనమామగా నిలిచా

నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో అనేక విషయాలను తెలుసుకున్నా

పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదు

అమ్మ ఒడి ద్వారా బడికి పంపించే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తున్నాం

42,12,186 మంది తల్లులకు రూ.6318 కోట్లను అకౌంట్లలో జమచేస్తున్నాం

దేశ చరిత్రలో అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం

ప్రతి పాఠశాలలోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులకు శ్రీకారం చుడుతున్నాం

పిల్లల పౌష్టికాహారానికి రూ.200 కోట్లు అధికమైన సంతోషంగా భరిస్తున్నాం

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో విద్యార్థులకు తోడుగా ఉంటా

పాదయాత్ర ముగిసిన ఏడాది రోజున అమ్మ ఒడి ప్రారంభం సంతోషంగా ఉంది

అమ్మ ఒడికి దరఖాస్తుకు ఇంకా నెల రోజుల గడువు పెంచుతున్నాం

చిత్తూరు సభలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 

చిత్తూరు: ప్రపంచంతో పోటిపడి పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లు బాగుండేలా అక్కచెల్లెమ్మలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. చిత్తూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, వీరితో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి చిన్నారికి..ఈ పథకానికి మీకే అంకితం చేస్తూ ఈ రోజు ఇక్కడి నుంచి చిత్తూరు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి బిడ్డ ఎదిగేది అమ్మ ఒడిలోనే..ఆ తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకొని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఆ తల్లి ప్రేమ ఆ చిన్నారికి భరోసా ఇస్తుంది. అమ్మ తన పిల్లలను ప్రాణానికి ప్రాణంగా పెంచుతుంది. తన ప్రాణం కన్న తన పిల్లలే ఎక్కువని తాను భావించడమే కాకుండా సర్వం త్యాగం చేస్తుంది. అలాంటి అమ్మలను, అక్కచెల్లెమ్మలను నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూశాను. ప్రతి గడపలోనూ చూశాను. పిల్లలను చదివించాలనే తపన, తాపత్రయం ఒకవైపు ఉంటే..మరో వైపు ఆ పిల్లల చదువులు భారం కాకూడదనే ఆలోచన ఆ అక్కాచెల్లెమ్మల్లో ఉండేది. ఆ పేదింటి తల్లులకు, ఆ పిల్లలకు అండగా ఉండేందుకు ఈ రోజు ఈ చిత్తూరులో కాసేపట్ల్లో బటన్‌ ఆన్‌ చేస్తే..ఆ తరువాత దాదాపు 43 లక్షల తల్లులకు, దాదాపుగా 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేట్టుగా  నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోకి రూ.15 వేలు జమా అవుతుందని సగర్వంగా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. చదువు అనేది నిజంగా మనం ఇచ్చే ఆస్తి. ఇదే నిజమైన సంపద, ఈ ఉద్దేశంతోనే మన రాజ్యాంగంలోనే చదువును ప్రాథమిక హక్కుగా ప్రకటించారు. ఆర్టికల్‌ 21ఏ తీసుకువచ్చారు. దీనిప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా చదువుకోవడం ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో చేర్చారు. కానీ చట్టాన్ని అమలు చేయడం, పిల్లలను చదివించే పరిస్థితి ఇళ్లలో ఉండాలి. చదువుకునే పరిస్థితి స్కూళ్లలో ఉండాలి. క్లాసుల్లో పాఠం వినాలన్నా..చదువుకోవాలన్నా..పేదింటి పిల్లలు కడుపు నిండాలి.

ముందుగా కడుపు నిండితేనే ఆ తరువాత అన్ని కూడా. చదువు భరోసాగా ఉంటుందన్న ఆశ తల్లులకు ఉండాలి. ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకొని..పేదింటి పిల్లలు దేశంలోనే కాదు..ప్రపంచంతో కూడా పోటీ పడి తట్టుకుని నిలచే పరిస్థితి రావాలి. ఈ దిశగా అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. ఈ రోజు అమ్మ ఒడి పథకాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. పిల్లల చదువుల కోసం ఏ రకమైన అడుగులు వేస్తున్నామని తెలియజేస్తున్నాం. 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు పిల్లలను చదివిస్తున్న ఆ పేదింటి తల్లులకు ఏటా రూ.15 వేలు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో జమా చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. ఆతల్లులకు గతంలో బ్యాంకుల్లో అప్పుల్లో ఉంటే ఈ సొమ్మును పాత అప్పులకు జమ చేసుకోకుండా బ్యాంకర్లతో మాట్లాడాం.  వీళ్ల డబ్బులపై బ్యాంకులకు ఎటువంటి హక్కు లేకుండా వారి సహాయ సహకారం తీసుకున్నాం. దాదాపుగా 42 లక్షల 12 వేల మంది తల్లులకు దాదాపుగా రూ.6318 కోట్లు ఈ రోజు వారి అకౌంట్లలో అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 8172224 మంది విద్యార్థులకు మేలు జరిగే పరిస్థితి ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో  అమ్మ తమ పిల్లల చదువులు ఆగకూడదనే ప్రతి ఒక్కరికి సహాయం చేసేందుకు ఈ అన్న తోడుగా ఉండేందుకు ముందుకు వచ్చాడు. ఏటా రూ.15 వేలు  ఇస్తాం. 75 శాతం హాజరు వచ్చే ఏడాది నుంచి తప్పనిసరి ఉండాలి. ఈ ఏడాది మినహాయిస్తున్నాం. కారణం ఈ పథకం ఈ ఏడాదే పెడుతున్నాం కాబట్టి..ఈ పథకం ఒక్కసారి చేతికి అందితే జగనన్న ఉన్నాడు. మన పిల్లలను బడికి పంపితే ప్రతి ఏటా ఇస్తారనే నమ్మకం కలిగేందుకు 75 శాతం హాజరు లేకపోయినా డబ్బులు ఇస్తున్నాం. 

మన ఎన్నికల ప్రణాళికలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు  ఇస్తామని చెప్పాం. చెప్పిన దానికన్న మిన్నగా 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఈ పథకాన్ని తీసుకువస్తూ అమలు చేస్తున్నాం. పిల్లల చదువుల కోసం అడుగులు ముందుకు వేస్తూ రెండో అడుగు వేస్తున్నాం. ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తున్నాం. రాష్ర్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని వినయంగా ఒక్కటే అడుగుతున్నాను. మీ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం చదివించాలా? వద్దా మిమ్మల్నే అడుగుతున్నాను. ఇంగ్లీష్‌ మీడియం చదువులు కావాలా? అని మిమ్మల్నే అడుగుతున్నాను. ఈనాడుకు, చంద్రబాబుకు, ఇంకొక సినిమా యాక్టర్‌కు వినిపించదు..గట్టిగా చెప్పాలి. ప్రజల మనోభావాలు అర్థం చేసుకోవాలని అడుగుతున్నాను. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అంటే జూన్‌ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామని గర్వంగా చెబుతున్నాను. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తాం. నాలుగేళ్లలో మన పిల్లలందరూ కూడా ఇంగ్లీస్ బోర్డు పరీక్షలు రాసే పరిస్థితి వస్తుందని సగర్వంగా చెబుతున్నాను. ఇంతకాలం తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంకు మారడానికి వీలుగా కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించాలి. బ్రిడ్జి కోర్సులు తీసుకువస్తాం. టీచర్లకు కూడా ఇంగ్లీష్‌లో చదువులు చెప్పేందుకు ట్రైనింగ్‌ మాడ్యుల్స్‌ చేయిస్తున్నాం. తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది 6వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2030వ సంవతర్సంలో డిగ్రీ పూర్తి చేస్తారు.  

అప్పటికి మన రాష్ట్రంలో పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా పోటీలో నిలిచేందుకు కావాల్సిన  ఇంగ్లీష్‌మీడియం చెప్పించాలా? లేక ఏ రాజకీయ నాయకుడు..ఏ ఒక్క పత్రికా యజమాని, సినిమా యాక్టర్లు మాత్రం వాళ్ల పిల్లలను చదివించని తెలుగు మీడియంలోనే గాలికి వదిలేయాలా? మన పిల్లలు పేదరికంలో అల్లాడుతున్నారు. వీళ్లు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుంటారు. ఇలాంటి వారి బతుకులు మారాలి. కూలీలుగా, కుల వృత్తులు చేసుకునే అన్యాయమైన పరిస్థితి రాకూడదు. ఇలాంటి వ్యవస్థలపై తిరుగుబాటు చేస్తే ప్రభుత్వ స్కూళ్లను మార్చి వేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో సిలబస్‌ మార్చుతున్నాం. మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మెనూ మార్పు చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో పిల్లల చదువుల గురించి ఇంతగా ఆలోచించే ఏ ముఖ్యమంత్రి ఎవరు ఉండరని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకురావాలని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్‌ మాత్రమే . రోజు ఇదే తిండేనా అని ఆ పిల్లల నోట్లో నుంచి రాకూడదు. మొదటిసారిగా మోను కార్డు తయారు చేశాం. ఎగ్‌ కర్రి, స్వీట్‌, చిక్కీ, పొంగల్‌ కూడా ఇస్తున్నాం. ఇలా రోజు మెనూలో మార్పు చేస్తున్నాం. ఏం పెడితే పిల్లలకు బాగుంటారో అని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు. ఈ మార్పులు చేయడం వల్ల దాదాపుగా రూ.200 కోట్లు ఎక్కువైనా కూడా సంతోషంగా భరిస్తాం. ఆయాల గురించి ఆలోచన చేస్తున్నాం. గతంలో ముష్టి వేసినట్లు రూ.వెయ్యి ఇచ్చేవారు. సరుకుల బిల్లులు కూడా సకాలంలో ఇచ్చేవారు కాదు. వాళ్ల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచాం. ఇందుకోసం రూ.150 కోట్లు భారం అవుతుంది. 

చదువుల్లో విప్లవాన్ని తీసుకువచ్చేందుకు, బడుల రూపు రేఖలను మార్చేందుకు నాడు-నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో దాదాపు 40 వేల ప్రభుత్వ బడులు ఉన్నాయి. 471 జూనియర్‌ కాలేజీలు, 3287 హాస్టల్స్‌ ఉన్నాయి. 188 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిన్నంటి రూపురేఖలు మార్చబోతున్నాం. శిథిలావస్థకు చేరిన బడులను మళ్లీ దేవాలయాలుగా మార్చుతాం. బడులన్నీ కూడా ఫోటోలు తీస్తున్నాం. ఆ బడుల రూపురేఖలను మార్చిన తరువాత మళ్లీ ఫోటోలు తీసి అక్కడ పెడతాం. అప్పుడు నాడు-నేడు అని చూపిస్తాం. మూడేళ్లలో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. సంక్రాంతి అయిపోయిన వెంటనే 15,715 స్కూళ్లలను అన్ని రకాలు మౌలిక వసతులు కల్పిస్తాం. పిల్లాడు బడికి సంతోషంగా ఉండాలంటే ఏముండాలనే సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మరుగుదొడ్లు, గ్రీన్‌ బోర్డులు, తాగేందుకు నీరు, పెయింటింగ్‌,  ఇంగ్లీష్‌ ల్యాబులు వచ్చేలా పనులు ప్రారంభిస్తున్నాం. ప్రతి సంవత్సరం బడులకు వెళ్లే పిల్లలకు సగం సంవత్సరం అయినా కూడా బుక్కులు, యూనిఫాం ఇచ్చేవారు కాదు. ఈ పరిస్థితిని మార్చుతాం. స్కూల్‌ తెరిచిన వెంటనే ఒక కిట్‌ ఇస్తాం. ప్రతి పిల్లాడికి మూడు జతల యూనిఫాం, బూట్లు, పుస్తకాలు, సాక్స్‌, బెల్ట్‌తో కూడి స్కూల్‌ కిట్‌ ఉచితంగా ఇస్తాం. పాఠశాలలో భోదన ప్రమానాలు పెంచడంతో పాటు టీచర్లకు శిక్షణ ఇస్తాం. బ్రిడ్జి కోర్సులు ప్రవేశపెడుతాం. ఇవన్నీ కూడా పిల్లలకు మేలు చేస్తాయని ఆశతో చేస్తున్నాం.

ఇంటర్‌ పూర్తి అయిన తరువాత పిల్లలు ఎంత మంది ఇంజీనీర్లు, డిగ్రీలు చదువుతున్నారని చూస్తే..మన దేశంలోనే గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చూస్తే కేవలం 23 శాతం మాత్రమే. 77 శాతం పిల్లలు చదువుల జోలికి వెళ్లడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉండటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదరికంలో ఉన్న మైనారిటీల, పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల పిల్లలు. వీరందరికి కూడా ఇక మీదట జగనన్న తోడుగా ఉంటాడు. జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చి తోడుగా ఉంటాం. జగనన్న వసతి దీవెన పథకం తీసుకువస్తున్నాం. పిల్లల హాస్టల్‌, భోజన ఖర్చులకు ఏటా రూ.20 వేలు ఇచ్చి తోడుగా ఉంటాం. నేరుగా ఆ తల్లుల అకౌంట్లోకి డబ్బులు జమా చేస్తాం. జనవరి, ఫిబ్రవరిలో సగం ఇస్తాం. జులై, ఆగస్టులో మరో సగం ఇస్తాం. 
అమ్మ ఒడి గురించి చివరిగా రెండే రెండు మాటలు..29 రాష్ట్రాల్లో, దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మొట్ట మొదట మనమే. ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టుకు కట్టుబడి, పాదయాత్ర ముగిసింది కూడా ఇదే జనవరి 9న ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రూ.15 వేలు ప్రతి తల్లికి తమ పిల్లల జీవితాలు బాగుపరిచేందుకు జగనన్న ఒక అన్నగా , తమ్ముడిగా అండగా ఉంటూ ఇస్తున్నాడు. ఆ పిల్లలకు మంచి మేనమామగా కూడా ఇస్తున్నారు. ఒక బాధ్యత కూడా గుర్తు చేస్తున్నాడు. రూ.15 వేలు తీసుకుంటున్న తల్లికి ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రతి స్కూల్‌ రూపురేఖలు మార్చుతున్నాం.

ప్రతి స్కూల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నాం. మీరు స్కూల్‌ పనితీరులో భాగస్వాములు కావాలి. ఆ స్కూల్‌ బాగుండేలా మీరంతా కూడా మమేకం కావాలి. ఇందుకోసమే పేరెంట్‌ కమిటీలు తెచ్చాం. ఇందులో నా విన్నపం. మీ బడుల్లో బాత్‌రూములు ఉంటాయి. స్కూళ్లకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మీ పిల్లలు వెళ్తున్న బాత్‌రూములపై కాస్త ధ్యాస పెట్టండి. మీ బడుల్లో ఉన్న బాత్‌రూమ్‌ల మెయింట్‌నెస్‌ కోరకు ఒక మనిషిని పెట్టుకుంటే జీతం రూ.4 వేలు, మెయింటెన్స్‌ కోసం మరో రూ.2 వేలు అవుతుంది. వాచ్‌మెన్‌ను పెట్టుకుంటే దానికి మరో రూ.4 వేలు ఖర్చు అవుతుంది. ఈ చిన్న సొమ్ములో మీరంతా భాగస్వాములు అయితే మీరు ప్రశ్నించవచ్చు. మీ స్కూళ్లపై మీకు ఒనర్‌ షిప్‌ కూడా వస్తుంది. స్కూళ్లకు ఒక్క వెయ్యి రూపాయిలు సహాయం చేయగలిగితే..14 వేలు మీరే పెట్టుకోండి..కేవలం ఒక్క వెయ్యి రూపాయిలు ఇవ్వమని ఆ పిల్లల మేనమామగా అడుగుతున్నాం. నాడు-నేడు ద్వారా అన్ని చేస్తాం. మెయింటెనెన్స్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమం వల్ల పిల్లల జీవితాలు బాగుపడుతాయని పూర్తిగా విశ్వసిస్తూ.. ఇవాళ డబ్బులు జమా చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా ఈ పథకం వర్తించకపోతే ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. అందరికి కూడా అవకాశం ఇస్తాం. మరో నెల రోజులు అవకాశం కల్పిస్తాం. ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకుంటే వాళ్లకు కూడా డబ్బులు జమా చేస్తాం. మీ గ్రామాల్లోని గ్రామ సచివాలయాలను ఉపయోగించుకోండి. గ్రామ వాలంటీర్‌ సహాయంతో ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోండి. ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో నాకు ఇంకా బలం ఇవ్వాలని కోరుకుంటూ..ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా..

Back to Top