ఉద్యోగ సంఘాలతో నేడు సీఎం వైయ‌స్ జగన్‌ సమావేశం!

తాడేప‌ల్లి: ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పీఆర్సీపై స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల వ్యవహారాలు) ఎన్‌. చంద్రశేఖర్‌రెడ్డి ఆయా సంఘాలకు సమాచారం ఇచ్చారు.

 
పీఆర్సీపై కొద్ది రోజులుగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ బుధవారం  కూడా ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. గురువారం మరోసారి అధికారులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. పీఆర్సీపై ఇప్పటికే ప్రభుత్వం వివిధ స్థాయిల్లో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అనేక ఏళ్లుగా ఊసేలేని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలను పలుమార్లు నిర్వహించి ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు.

 
కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను సంతృప్తి పరిచేలా పీఆర్సీ ఎంత ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ చర్చించి, పూర్తిస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో సమావేశమై ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన ప్రతి అంశంపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీలు ఆందోళనలను విరమించుకున్నాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top