తాడేపల్లి: కుటుంబ పెద్ద అకాల మరణం పొందితే ఆ కుటుంబాలను ప్రభుత్వమే మానవతా దృక్పథంతో ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు వైయస్ఆర్ బీమా ద్వారా ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నామని, ఏటా రూ.510 కోట్లు ఖర్చు చేసి బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ దాదాపు 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అనుకోని ప్రమాదం జరిగి ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉండాలని 2020 అక్టోబర్ 21న వైయస్‌ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించామని, ఇప్పటి వరకు మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబాలకు రూ. 254 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం చెప్పారు. గతంలో మాదిరిగా పీఎంజేజేబీవై (ప్రధాన మంత్రి జన జీవన బీమా యోజన), పీఎంఎస్‌బీఐ (ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన) నుంచి 50 శాతం వాటా లేనప్పటికీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం సొమ్ము చెల్లిస్తూ పథకం అమలు చేస్తోందని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 12,039 కుటుంబాలకు వైయస్ఆర్ బీమా సొమ్ము రూ.254 కోట్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్ విడుదల చేశారు. అంతకు ముందు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం ఏం మాట్లాడారంటే.. ‘వైయస్‌ఆర్ బీమా సొమ్ము కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సకాలంలో జరగని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. బీమా పథకానికి అర్హులై ఉండి కూడా బ్యాంకులు వారిని ఎన్‌రోల్ చేయని కారణంగా.. ప్రభుత్వం బ్యాంకులకు ప్రీమియం డబ్బులు కట్టేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన మెలికల వల్ల ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నాయి. అర్హత ఉండి బ్యాంకుల్లో ఎన్‌రోల్ కాకుండా మిగిలిపోయిన నేపథ్యంలో దురదృష్టవశాత్తు మరణించిన 12,039 కుటుంబాలను మానవతాదృక్పథంతో ఆదుకుంటున్నాం. ఏటా రూ.510 కోట్లు ఖర్చు చేసి బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ.. దాదాపు 1.41 కోట్ల నిరుపేద కుటుంబాలకు వైయస్ఆర్ బీమా ద్వారా ఉచిత బీమా రక్షణ కల్పిస్తూ గతేడాది అక్టోబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కుటుంబాల్లో సంపాదించే వ్యక్తికి అనుకోని సంఘటన జరిగితే.. ఆ కుటుంబానికి తోడుగా నిలబడాలనే దృక్పథంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ప్రారంభించినప్పుడు పరిస్థితులు వేరేరకంగా ఉన్నాయి. ప్రతి పాలసీకి గత ఐదేళ్లతో పోల్చి.. మారిన పరిస్థితులు గమనిస్తే.. అప్పట్లో ప్రతి పాలసీకి పీఎంజేజేబీవై (ప్రధాన మంత్రి జన జీవన బీమా యోజన), పీఎంఎస్‌బీఐ (ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన) కింద కేంద్రం 50 శాతం వాటాను కట్టేది. ఆ తరువాత 2020 మార్చి 31 నుంచి కేంద్రం పూర్తిగా పక్కకు తప్పుకుంది. 2020 మార్చి నుంచి ఈ పథకాలను నిలిపివేస్తామని, రాష్ట్రాలు తాము కావాలనుకుంటే కొనసాగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. బీమా సొమ్ము చెల్లించే బాధ్యతను మనందరి ప్రభుత్వం భుజస్కంధాల మీద వేసుకుంది. ఇదొకటే కాకుండా.. కేంద్రం నుంచి రూపాయి సహాయం లేకున్నా కూడా మానవ దృక్పథంతో పూర్తి బీమా సొమ్మును మనందరి ప్రభుత్వమే భరిస్తూ బ్యాంకులకు కడుతుంది. గతేడాది అక్టోబర్ 21 తేదీన బ్యాంకులకు ప్రీమియం సొమ్ము దాదాపు రూ.510 కోట్లు పూర్తిగా చెల్లించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. ఇంతకు ముందు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండేది.. ఈ రోజు ప్రతి ఒక్కరితోనూ బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించాలని కేంద్రం చెబుతుంది. వలంటీర్ల సహకారంతో దాదాపు 62 లక్షల అకౌంట్ల ఓపెన్ చేయించగలిగాం. మిగిలిన దాదాపు 62 లక్షల అకౌంట్లు ఇంకా ఓపెన్ చేయలేని పరిస్థితి. అకౌంట్ ఓపెన్ చేయించి మన ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియం బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టిన పిమ్మట.. మరో కొత్త మెలిక పెట్టారు. 45 రోజులలోపు ఎవరైనా చనిపోతే వారికి బీమా సొమ్ము ఇవ్వరట. ఇలా రకరకాల మెలికలు, ఇబ్బందులు బీమా పథకానికి క్రియేట్ చేయబడ్డ పరిస్థితులున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 12,039 కుటుంబాలకు చెందిన కుటుంబ పెద్దలు మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు మనందరి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందడుగు వేసింది. ప్రభుత్వం ప్రీమియం కట్టినప్పటికీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేని పరిస్థితి కారణం, 45 రోజుల లోపు నిబంధన వల్ల.. ఇలా రకరకాల కారణాల వల్ల 12,039 మందికి అర్హత ఉండి కూడా బీమా సొమ్ము రాని పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంలో ఇటువంటి వారిని మానవతా దృక్పథంతో.. ఆ కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి రూ.254 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అర్హత ఉండి కూడా మిగిలిపోయి ఉంటే వారిని ఆదుకునేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశాం. 155214 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కచ్చితంగా వాళ్లకు కూడా మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మనిషిని అయితే తీసుకురాలేము కానీ, దేవుడి దయ ఆ కుటుంబాలపై ఉండాలని, మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.