ఏపీ సేవా పోర్టల్‌ ద్వారా మరింత వేగంగా సేవలు

సిటిజన్‌ సర్వీస్‌ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌ 

ఏపీ సేవ ద్వారా మరింత పారదర్శకంగా సేవలు 

ఉద్యోగుల జవాబుదారీతనం మరింత పెరుగుతుంది

రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు

ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540కి పైగా సేవలు

రెండున్నరేళ్లలో 3.46 కోట్ల మందికి సేవలు అందాయి

ఎవరి వద్ద ఫైల్‌ పెండింగ్‌లో ఉందో ఇట్టే తెలిసిపోతుంది

అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుంది

వ్యవస్థలో అవినీతి నిర్మూలనకు ఏపీ సేవ ఉపయోగపడుతుంది

ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు ఆమోదించే అవకాశం ఉంటుంది

తాడేపల్లి:  ఏపీ సేవా పోర్టల్‌ ద్వారా ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందుతాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం ఉండదని, కుల, మత, రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. అవినీతికి తావు లేని వ్యవస్థ కోసమే ఏపీ సేవా పోర్టల్‌ను రూపొందించామని తెలిపారు. ప్రజలకు తమకు అవసరమైన సేవలు పొందేందుకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు ఆమోదించే అవకాశం ఉంటుందని, మన దరఖాస్తు ఎక్కడ ఉంటుందో ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.  అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుందన్నారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏపీ సేవా పోర్టల్‌ను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. సిటిజన్‌ సర్వీస్‌ పోర్టల్‌(సీఎస్‌పీ). ఈ పేరు కూడా ఏపీ సేవాగా మార్చుతున్నాం. ఈ పోర్టల్‌ను ఈ రోజు లాంచ్‌∙చేస్తున్నాం. దీనివల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారితనం పెంచే విధంగా, మనకు ఉన్న వ్యవస్థను ఇంకా మెరుగు పరిచి, మెరుగైన వ్యవస్థను తీసుకువచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ప్రారంభిస్తున్నాం.
 గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో గడిచిన ఈ రెండేళ్లలో మన కళ్లెదుటే మనకు కనిపించే విధంగా మన ప్రభుత్వం అడుగులు వేసింది. గ్రామ స్వరాజ్యం అంటే మన కళ్లెదుటే, మన గ్రామంలోనే ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ, అక్కడే 10 మంది ఉద్యోగులు కూర్చోవడం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌. వీరు సచివాలయాలకు అనుసంధానం కావడం, నిజంగా దాదాపుగా 540కి పైగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ఈ సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నాం. గ్రామ స్వరాజ్యం అంటే ఇంతకన్న మీనింగ్‌ ఉండకపోవచ్చు.

ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను క్రియేట్‌ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలను ఏర్పాటు చేశాం. వీటి ద్వారా దాదాపుగా 1.34 లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు అక్కడ పని చేస్తున్నారు. మన పిల్లలే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ చొప్పున 2.60 లక్షల మంది వాలంటీర్లు..మొత్తంగా 4 లక్షల మంది మనకళ్లెదుట..ఈ రోజు డెలీవరి మెకానిజమ్‌లో పని చేస్తున్నారు. గ్రామ స్వరాజ్యానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. 
ఈ రోజు ఇంటింటికి వెళ్లి గడప వద్దనే ప్రభుత్వ పథకాలు అందించడంలో వీరంతా కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. వీరు చేస్తున్న పనిని గొప్పగా అభినందించాలి.ఇంతవరకు మనం ఈ సేవలు అందిస్తున్నాం. ఈ సేవలను ఇంకా మెరుగు పరుస్తూ..ముందడుగు వేస్తూ ఈ రోజు ఏఈ సేవా పోర్టల్‌కు శ్రీకారం చుడుతున్నాం.

మారుమూల గ్రామాల్లోనూ వేగంగా, పారదర్శకంగా, జవాబుదారితనం పెరిగేందుకు, సామాన్యులకు సేవలందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది. గ్రామ సచివాలయాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని జనవరి 26, 2020వ తేదీన ఆవిష్కరించాం. రెండేళ్ల ఈ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలతో ఇంకా మెరుగైన మార్పులు తీసుకువచ్చి, ఇంకా బాధ్యతగా, పారదర్శకత పెంచే విధంగా, వేగంగా జరిగే విధంగా మార్పులు తెస్తూ..ఈ రోజు ఏపీ సేవా పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. 
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకే వేదికగా 540కి పైగా సేవలను అందుబాటులోకి, ఇంకా మెరుగైన పరిస్థితిలోకి తెస్తున్నాం. ఇంతవరకు గ్రామ సచివాలయాల ద్వారా అక్షరాల 3.46 కోట్ల మందికి మేలు జరిగిస్తూ సేవలు గ్రామ స్థాయిలోనే, వార్డు స్థాయిలోనే అందుబాటులోకి తెచ్చాం. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ 3.46 కోట్ల మందికి మేలు చేసిందంటే..ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉపయోగపడిందో చెప్పడానికి మరో నిదర్శనం అవసరం లేదు. 

కొత్తగా మనం తెలుసుకున్న విషయాలను క్రోడికరించి, మరింత కొత్తగా ఆధునిక, సాంకేతిక విధానాన్ని జోడించి ఈ ఏపీ సేవా పోర్టల్‌ను ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు  సచివాలయాల్లో ఏపీ సేవా పోర్టల్‌ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి. మరింత బాధ్యత పెంచుతోంది, మరింత పారదర్శకత పెంచుతుంది. మరింత వేగంగా పనులు జరుగుతాయి. ప్రజలకు మరింత సులభతరంగా, మరింత పారదర్శకంగా ప్రజలే వాళ్లకు సంబంధించిన సమస్య ఎక్కడ ఉంది? దరఖాస్తు పెట్టిన తరువాత పరిస్థితి ఏంటి అన్నది తెలుసుకునే వెసులుబాటు ఈ పోర్టల్‌ ద్వారా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుంది. ఏ అధికారి వద్ద ఫైల్‌ ఆగింది. ఏ అధికారి వద్ద పని జరగడం లేదన్నది ఏకంగా పైస్థాయి అధికారులకు కూడా తెలుస్తుంది. దీనివల్ల బాధ్యత, పారదర్శకత, వేగం పెరుగుతోంది. ఈ సేవాలన్నింటిని కూడా డిజిటలైజ్‌ చేస్తున్నాం.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మొదలు, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి అధికారుల వరకు , రాష్ట్రస్థాయి సెక్రటరేట్‌లో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఒకే ప్లాట్‌ఫాంపై పని చేయడం మొదలుపెడుతారు. డాక్యుమెంట్లపై డిజిటల్‌ సిగ్నేచర్‌ చేయడం ద్వారా ఉద్యోగుల జవాబుదారితనం మరింత పెరుగుతోంది. సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల జారీలో జాప్యం లేకుండా పోతుంది. వ్యవస్థలో అవినీతిని అరికట్టవచ్చు. జవాబుదారితనం వస్తుంది.ఈ గొప్ప మార్పు ఈ రోజు జరుగుతుంది. ఈ కొత్త సాప్ట్‌వేర్‌ ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలకు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని ఉండదు.

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు ఆమోదించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు జారీలో ఆలస్యానికి ఎక్కడా కూడా తావుండదు. ప్రజలకు తమ దరఖాస్తుల పరిష్కారం ఎక్కడా, ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఆయా శాఖల సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మధ్య సమన్వయం పెరుగుతుంది. అటు ప్రభుత్వ శాఖలు, ప్రజల మధ్య వార ధిగా, ఒక ముఖ్యమైన్‌ హబ్‌గా  గ్రామ,వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పని చేసే విధంగా ఏపీ సేవా పోర్టల్‌ ద్వారా జరుగుతుందని సగర్వంగా తెలియజేస్తున్నా. ప్రజలు ఏదైనా సేవ కావాలని దరఖాస్తు చేసుకుంటే..పక్కాగా అక్నాలెజ్‌మెంట్‌ ఇవ్వడంతో పాటు ఎంత సమయం పడుతుందన్నది కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఆయా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ సమాచారం కూడా ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫోన్‌కు సమాచారం ఇస్తారు. 

దరఖాస్తుదారులు తగిన రుసుం కట్టాల్సి వస్తే..ఇదే యాప్‌ నుంచి చెల్లించే ఏర్పాటు చేశాం. క్యూ ఆర్‌ కోడ్, క్యాస్‌పేవ్‌మెంట్‌ వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు. రెవెన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను ఈ పోర్టల్‌లోకి తీసుకువచ్చాం. పురపాలక, పరిపాలనకు సంబంధించి 25 రకాల సేవలు ఈ పోర్టల్లో పొందవచ్చు. పౌర సరఫరాలకు సంబంధించిన 6 సేవలు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన 3 సేవలు, విద్యుత్‌ రంగానికి సంబంధించిన 53 సేవలు ఈ పోర్టల్‌లోకి తెచ్చాం. ఆన్‌లైన్‌ విధానంలో ఈ సేవలు పొందవచ్చు.

దరఖాస్తు దారులకు ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌లు పంపించడమే కాక తమ సమీపంలోని సచివాలయాల్లోనే కాక మరే ఇతర సచివాలయాల్లోనూ కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఎక్కడినుంచైనా తమకు కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు పొందవచ్చు. దరఖాస్తులు తిరస్కరిస్తే..దానికి కారణాలు ఏంటి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏపీ సేవా పోర్టల్‌ ద్వారా ఇలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. విప్లవాత్మక మార్పులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు క్షేతస్థాయిలో ఇవన్నీ కూడా అందుబాటులోకి తెచ్చే గొప్ప ప్రయత్నం చేశాం. ఈ ప్రయోగాన్ని మరింత మెరుగు పరుస్తూ ఈ రోజు అడుగులు వేస్తున్నాం. దేవుడిదయతో అందరికి మంచి జరగాలని, ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏపీ పోర్టల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top