అమరావతి: భారీ వరదలు, వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు వెంటనే పూర్తి చేయాలని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను, లంక భూములు, నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. – వీలైనంత వేగంగా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి. సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తే రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుంది. – ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే ఐదు నిత్యావసర సరుకులతో ఉచిత రేషన్‌ను అందిస్తోంది. – మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలి. – సీఎం వెంట హోం మంత్రి మేకతోటి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఆదుకునేందుకు పలు చర్యలు – భారీ వర్షాలు, వరదలపై ఇప్పటికే పలుమార్లు అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. – ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,450 కోట్ల నష్టం జరిగిందని, బాధితులను ఆదుకోవడానికి రూ.2,250 కోట్ల సాయం అందించాలని కోరారు. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. – వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.