తిరుమల: తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. బర్డ్ ఆస్పత్రిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రూ.25 కోట్లతో నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రెండ్రోజుల తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయస్ జగన్ నేరుగా.. తిరుపతి బర్డ్ ఆస్పత్రికి చేరుకొని శ్రీపద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకొని మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. అదేవిధంగా గోమాతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గోమందిరం, గోతులాభారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాసేపట్లో తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేరుకొని స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు, తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.