వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం 

 వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

జవాన్ కుటుంబానికి ప‌రామ‌ర్శ‌..రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం 

శ్రీసత్యసాయి జిల్లా: వీర జవాన్‌ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని, ఆయ‌న త్యాగానికి ప్ర‌జ‌లంతా రుణ‌ప‌డి ఉండాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కొనియాడారు. మంగ‌ళ‌వారం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్‌ ముడావత్‌ మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను ఆయ‌న‌ పరామర్శించారు. ముర‌ళి త‌ల్లిదండ్రుల‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. జ‌వాన్ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

అనంతరం వైయ‌స్ జ‌గ‌న్‌ మీడియాతో మాట్లాడారు. `వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం. ఆయ‌న త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలి. జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోంది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం జ‌వాన్ కుటుంబానికి అందిస్తాం. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్‌ వీరమరణం పొందారు.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంది మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది’’ అని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. 

Back to Top