వైయ‌స్‌ జగన్‌పై విచారణకు హైకోర్టు స్టే 

తాడేప‌ల్లి:  సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో ఏపీ పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.  వైయ‌స్‌ జగన్‌ను పోలీసులు విచారించకుండా హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలుకు ఏజీ రెండు వారాల గడువు కోరగా.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.

  • క్వాష్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్‌ఐఆర్‌ ఇన్ఫర్మేషన్‌ సరిపోతుంది కదా?.. ఏజీతో హైకోర్టు బెంచ్‌
  • వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలి: జడ్జితో జగన్‌ లాయర్‌ 
  • వాదనలు వినాల్సిన అవసరం లేదు: జడ్జితో అడ్వొకేట్‌ జనరల్‌ 
  • సంఘటన తర్వాత నాలుగు రోజుల తర్వాత వీడియో విడుదల చేశారు: : జగన్‌ లాయర్‌ 
  • సోషల్‌ మీడియాలో డౌన్‌లోడ్‌ చేశామని ఎస్‌ఐ చెప్పారు: జగన్‌ లాయర్‌ 
  • ఏఐతో ఏదైనా సృష్టించగలిగే అవకాశం ఉంది కదా: జగన్‌ లాయర్‌ 
  • కౌంటర్‌ దాఖలుకు రెండు వారాల సమయం ఇవ్వండి: జడ్జితో అడ్వొకేట్‌ జనరల్‌
  • ఆధారాలు ఉన్నా ఇంకా సమయం దేనికి?: జగన్‌ లాయర్‌

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వెళ్తుండగా.. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తూ మరణించాడు. అయితే వైయ‌స్ జగన్‌ కాన్వాయ్‌ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ వైయ‌స్‌ జగన్‌తో పాటు పలువురు ఆయన వ్యక్తిగత కార్యదర్శి, వైయ‌స్ఆర్‌సీపీ నేతలూ క్వాష్‌ పిటిషన్లు వేయగా.. వాటంన్నింటిని కలిపే హైకోర్టు విచారణ జరుపుతోంది. 

గత విచారణ సందర్భంగా.. సింగయ్య మృతికి వైయ‌స్‌ జగన్‌ కారకులు ఎలా అవుతారంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నేటి విచారణలో వైయ‌స్ జగన్‌ విచారణపై ఏకంగా స్టే విధించడం గమనార్హం.

Back to Top